త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | ఓటిచ్చేందుకు అప్పుడు స‌ర్ తీసుకొస్తే.. ఇప్పుడు బీజేపీ తెంచేస్తుంది

Revanth Reddy | గ‌తంలో ఓటిచ్చేందుకు స‌ర్ ప్ర‌క్రియ తీసుకొస్తే.. ఇప్పుడు ఓట్ల‌ను తెంచేందుకు బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంద‌ని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆనాడు సైమ‌న్ గోబ్యాక్ ఉద్య‌మం గ‌ట్టిగా సాగింద‌ని.. నేడు రాహుల్ గాంధీ చేప‌ట్టిన జ్ఞానేశ్‌కుమార్ గోబ్యాక్ పోరాటం రేపు దేశాన్ని కాపాడుతుంద‌న్నారు.

S

Telangana | Published On Oct 12, 2026, 5.37 pm IST

Revanth Reddy | ఓటిచ్చేందుకు అప్పుడు స‌ర్ తీసుకొస్తే.. ఇప్పుడు బీజేపీ తెంచేస్తుంది
Advertisement
  • జ్ఞానేశ్‌కుమార్ గోబ్యాక్ పోరాట‌మే రేపు దేశాన్ని కాపాడుతుంది
  • బీజేపీకి ప‌డ‌ని ఓట్ల‌ను తీసేయాల‌ని జ్ఞానేశ్‌కు టాస్క్ ఇచ్చారు
  • ఇది మరో స్వాతంత్య్ర పోరాటం
  • రాహుల్ చేప‌ట్టిన ఈ ఉద్య‌మంలో అంద‌రూ పాల్గొనాలి
  • ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు

Revanth Reddy |  త్రినేత్ర న్యూస్‌: గ‌తంలో ఓటిచ్చేందుకు స‌ర్ ప్ర‌క్రియ తీసుకొస్తే.. ఇప్పుడు ఓట్ల‌ను తెంచేందుకు బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంద‌ని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆనాడు సైమ‌న్ గోబ్యాక్ ఉద్య‌మం గ‌ట్టిగా సాగింద‌ని.. నేడు రాహుల్ గాంధీ చేప‌ట్టిన జ్ఞానేశ్‌కుమార్ గోబ్యాక్ పోరాటం రేపు దేశాన్ని కాపాడుతుంద‌న్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓట‌మి భ‌యంతోనే బీజేపీ వ్య‌తిరేకుల ఓట్ల‌ను తొల‌గించేందుకు కుట్ర‌లు చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. త‌క్ష‌ణ‌మే సీఈసీ రాజీనామా చేయాల‌న్నారు. ఓటు బ‌చావో.. దేశ్ బ‌చావో ఆందోళ‌న‌లో భాగంగా ఢిల్లీ తెలంగాణ భ‌వ‌న్‌లో సోమ‌వారం నిర్వ‌హించిన స‌మావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.

1950లో తొలిసారి..

అధికారాన్ని పదిలం చేసుకొనేందుకు ఈడీ, ఐటీ అనేక అస్త్రాలు ప్రయోగించిన బీజేపీ, ఇప్పుడు ఎస్​ఐఆర్ అనే ఆయుధాన్ని ప్రయోగించిందని సీఎం రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ఆనాడు కాంగ్రెస్‌ పార్టీ ఓటు హక్కు కల్పించేందుకు ఎస్​ఐఆర్ తీసుకువస్తే, ఇప్పుడు ఓట్లను దూరం చేసేందుకు ఈ ప్రక్రియ చేపడుతున్నారని ఆరోపించారు. అంబేడ్కర్‌ ప్రపంచమంతా తిరిగి ఎన్నో రాజ్యాంగాలను అధ్యయనం చేశారని గుర్తు చేశారు. ఎంతో అధ్యయనం చేసి ఓటుహక్కును మన రాజ్యాంగంలో చేర్చారని, పాలకుడు రాచరికం, వంశపారంపర్యంగా కాకుండా ప్రజలు ఎన్నుకునే పద్ధతి తీసుకువచ్చారని కొనియాడారు. 1950లో తొలిసారి ఎస్‌ఐఆర్ పద్ధతిని అమలు చేశారని పేర్కొన్నారు.

బీజేపీ వ్యతిరేకుల ఓట్లు తొలగించాలని జ్ఞానేశ్‌కుమార్‌ను టాస్క్‌ ఇచ్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. యువత, నిరుద్యోగులు, పేదల ఓట్లు తొలగించాలని జ్ఞానేశ్‌కుమార్ చూస్తున్నారని ఆరోపించారు. ఎస్‌ఐఆర్‌లో తప్పులు జరగుతున్నాయని మిగతా ఇద్దరు ఈసీలు వ్యతిరేకించారని, జ్ఞానేశ్‌కుమార్‌ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు బయటపడిందని విమర్శించారు. అలాంటి జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించేందుకు ప్రధాని మోదీకి అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు.

స‌ర్ జ‌ర‌గ‌ని రాష్ట్రాల్లో ఓడిపోయారు..

"సర్ ప్రక్రియ జరగని రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయింది. సర్ ప్రక్రియ జరిగిన బిహార్‌, బంగాల్‌లో బీజేపీ గెలిచింది. దేశంలో జనాభా పెరుగుతుంటే ఓటర్ల సంఖ్య కూడా పెరగాలి కదా. మరి దేశంలో ఓటర్ల సంఖ్య 97 కోట్ల నుంచి 81 కోట్లకు ఎందుకు తగ్గింది?. దళితులు, ఆదివాసీలు, యువత, నిరుద్యోగుల్లో బీజేపీపై వ్యతిరేకత ఉంది. దేశ మనుగడకు సంబంధించిన ఉద్యమంలో అందరూ పాల్గొనాలి అని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

దేశ ప్రజల ఓటు హక్కును కాపాడుకునేందుకు జరుగుతున్న పోరాటం మరో స్వాతంత్య్ర ఉద్యమ‌మ‌ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల నాయకత్వంలో ఈ పోరాటం కొనసాగుతోందని తెలిపారు. బ్రిటిష్‌ పాలన నుంచి దేశానికి స్వేచ్ఛ, స్వపరిపాలన కల్పించేందుకు ఆనాడు కాంగ్రెస్‌ నాయకులు పోరాడారని, ఇప్పుడు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కాపాడుకునేందుకు పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని సీఎం తెలిపారు.

భారత స్వాతంత్య్ర పోరాటంలో లాలా లజపతిరాయ్‌, భగత్‌సింగ్‌, మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ వంటి నాయకుల త్యాగాలు చిరస్మరణీయమని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. ‘సైమన్‌ గో బ్యాక్‌’ ఉద్యమ సమయంలో లాలా లజపతిరాయ్‌ లాఠీచార్జీలో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. పేదలు, దళితులు, గిరిజనులు సహా అన్ని వర్గాల ప్రజలకు ఓటు హక్కు కల్పించడం ద్వారా అంబేడ్కర్‌ సమానత్వానికి బాటలు వేశారని సీఎం కొనియాడారు.

ఇందిరాగాంధీ, అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వాల కాలంలోనూ ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ జరిగిందని గుర్తు చేశారు. అయితే, గతంలో ఓటర్ల జాబితాలో పేర్లు లేని అర్హులైన వారిని చేర్చడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టేవారని అన్నారు. ఇప్పుడు మోదీ, అమిత్‌ షాల పాలనలో మాత్రం ఇప్పటికే ఓటు హక్కు ఉన్నవారి పేర్లను తొలగించే ప్రయత్నం జరుగుతోందని సీఎం మండిప‌డ్డారు. గతంలో ఈ ప్రక్రియను ప్రజలకు మేలు చేసే చర్యగా చూశారని, ప్రస్తుత ప్రభుత్వం మాత్రం దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈసీఐ ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ను ముందుపెట్టి మోదీ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని నడిపిస్తోందని ఆరోపించారు.

గతంలో ఎన్నికల సంఘం ఒక్క కమిషనర్‌ నేతృత్వంలో పనిచేసేదని, అయితే, ఈ సంస్థ‌లో మ‌రింత పార‌ద‌ర్శ‌క‌త తీసుకువ‌చ్చేందుకు ప్ర‌ధాన‌మంత్రిగా పి.వి.నరసింహారావు ఉన్న స‌మ‌యంలో ముగ్గురు కమిషనర్ల విధానాన్ని తీసుకొచ్చారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. గ‌తంలో ఎన్నికల కమిషనర్ల నియామకంలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇచ్చేవారని తెలిపారు. ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధాన ప్రతిపక్ష నేత భాగస్వామ్యంతో నియామక ప్రక్రియ సాగేదన్నారు. మోదీ ప్రభుత్వం 2023లో ఈ విధానాన్ని మార్చిందని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. క‌మిష‌న‌ర్ల నియామక ప్రక్రియలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కేంద్ర హోంమంత్రిని చేర్చారని ఆరోపించారు.

ప్రతిపక్ష పార్టీలే కాకుండా అధికార పక్షంలో ఉన్నవారు కూడా ఈ అంశంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నార‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్‌ జోషి వంటి వారు ఈ అంశంపై గొంతెత్తడమే ఇందుకు సంకేతమని సీఎం వ్యాఖ్యానించారు. జ్ఞానేశ్‌ కుమార్ నియామ‌కంలో ఎలాంటి కుట్ర లేదని మోదీ, అమిత్‌ షాలు భావిస్తే, ఆయనను తొలగించాలనే డిమాండ్లపై ఎందుకు స్పందించడం లేదని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు వారు ఎందుకు అండగా నిలుస్తున్నారో సమాధానం చెప్పాలని సీఎం డిమాండ్‌ చేశారు.

2014లో నరేంద్ర మోదీ తొలిసారి ప్రధానమంత్రి పదవికి పోటీ చేసిన సమయంలో దేశంలో సుమారు 81 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రేవంత్‌రెడ్డి తెలిపారు. 2019లో ఈ సంఖ్య సుమారు 91 కోట్లకు, 2024 ఎన్నికల నాటికి సుమారు 97 కోట్లకు చేరిందని సీఎం రేవంత్ రెడ్డి వివ‌రించారు. 2026లో ఇప్పటికే 13 కోట్ల ఓట్లను తొలగించారని ఆరోపించారు. ఈ తొల‌గించే ఓట్ల సంఖ్యను 20 కోట్లకు పెంచే కుట్ర ప్ర‌య‌త్నం జరుగుతోందని సీఎం ఆందోళన వ్య‌క్తం చేశారు. 2014లో దేశ జనాభా ఎంత? ప్రస్తుతం ఎంత? అనే వివరాలను పరిశీలించాలన్నారు. జనాభా పెరుగుతున్నప్పుడు ఓటర్ల సంఖ్య తగ్గడానికి కారణమేంటని సీఎం ప్రశ్నించారు.

ఓటు ఉన్నవారు.. లేనివారంటూ రెండు వర్గాలా?

దేశంలో ఓటు హక్కు ఉన్నవారు, ఓటు హక్కు లేనివార‌నే రెండు వర్గాలను సృష్టించే పరిస్థితి ఏర్పడుతోందని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలను శ్రీమంతులు, పేదలు అనే వర్గాలుగా విడదీసి, పేదల ఓటు హక్కును దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని సీఎం ఆరోపించారు. సంపన్నులు బీజేపీకి మద్దతుగా ఉంటారని, పేదలు ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉంటారనే రాజకీయ లెక్కలతో ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారనే అనుమానాలు ఉన్నాయన్నారు.

Advertisement
Advertisement