త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | టపాసుల కంటే ప్రజారోగ్యమే ముఖ్యం!

Supreme Court | మత విశ్వాసాలకు గౌరవం ఇస్తూనే ప్రజారోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో వాయు కాలుష్యానికి కారణమవుతున్న టపాసుల వినియోగంపై సోమవారం విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. పండుగలను తక్కువ కాలుష్యం కలిగించే ప్రత్యామ్నాయ మార్గాల్లో జరుపుకునేలా ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించింది. ఇందుకోసం ప్రతిసారీ కఠిన ఆదేశాలు జారీ చేసే పరిస్థితి రాకూడదని అభిప్రాయపడింది.

P

National | Published On Oct 12, 2026, 7.09 pm IST

Supreme Court | టపాసుల కంటే ప్రజారోగ్యమే ముఖ్యం!
Advertisement
  • మత విశ్వాసాలకు గౌరవం..
  • పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం
  • టపాసుల వినియోగంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
  • పండుగలను కాలుష్య రహితంగా జరుపుకోవాలని సూచన
  • ఒకటి, రెండు గంటల ఆంక్షలతో సమస్య పరిష్కారం కాదని అభిప్రాయం
  • పంట వ్యర్థాల నిర్వహణపైనా కేంద్రం నుంచి నివేదిక

Supreme Court | మత విశ్వాసాలకు గౌరవం ఇస్తూనే ప్రజారోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో వాయు కాలుష్యానికి కారణమవుతున్న టపాసుల వినియోగంపై సోమవారం విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. పండుగలను తక్కువ కాలుష్యం కలిగించే ప్రత్యామ్నాయ మార్గాల్లో జరుపుకునేలా ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించింది. ఇందుకోసం ప్రతిసారీ కఠిన ఆదేశాలు జారీ చేసే పరిస్థితి రాకూడదని అభిప్రాయపడింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌, న్యాయమూర్తులు జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వీ మోహనలతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టింది. మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదని, అయితే టపాసుల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించడం కూడా అంతే ముఖ్యమని సీజేఐ పేర్కొన్నారు. మత విశ్వాసాలు ముఖ్యమే అయినప్పటికీ, వాటి కోసం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టకూడదని అభిప్రాయపడ్డారు.

మతపరమైన అంశం ఏముంది?

విచారణ సందర్భంగా జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చి కీలక ప్రశ్నను లేవనెత్తారు. టపాసులు పేల్చడంలో మతపరమైన అంశం ఏముందని ప్రశ్నించారు. ఈ కేసులో కోర్టుకు సహకరిస్తున్న అమికస్‌ క్యూరీ, సీనియర్‌ న్యాయవాది అపరాజితా సింగ్‌ వాయు కాలుష్యం వల్ల చిన్నారులు, వృద్ధులు, ఇప్పటికే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. దేవుడి పేరుతో నిర్వహించే వేడుకల కారణంగా చిన్నారులు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిస్తే దేవుడు కూడా బాధపడతాడని ఆమె వ్యాఖ్యానించారు. టపాసులు కాల్చేందుకు ఒకటి, రెండు గంటల సమయం కేటాయించడం ఆచరణలో ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చని అమికస్‌ క్యూరీ అభిప్రాయపడ్డారు. ప్రతి వీధిలోనూ, ప్రతి సమయంలోనూ పోలీసులు పర్యవేక్షణ చేయడం సాధ్యం కాదని వివరించారు. కేవలం సమయ పరిమితులు విధించడం వల్ల సమస్య పూర్తిగా పరిష్కారం కాదన్నారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ.. క్షేత్రస్థాయిలో అమలు చేయడం కష్టమైన ఆదేశాలు జారీ చేసే ముందు కోర్టు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అమలు సాధ్యం కాని ఆదేశాలు ప్రజలకు బలవంతపు చర్యలుగా కనిపించే ప్రమాదం ఉందన్నారు.

గ్రీన్ టపాసులను ప్రోత్సహించాలి

టపాసుల్లో ఏవి ఎక్కువ కాలుష్యాన్ని వెదజల్లుతాయి? ఏవి తక్కువ కాలుష్యానికి కారణమవుతాయనే అంశంపై ప్రజలకు అవగాహన కల్పించాలని ధర్మాసనం సూచించింది. సాంప్రదాయ పద్ధతులకు ప్రత్యామ్నాయంగా దీపాలు వెలిగించడం, తక్కువ కాలుష్యం కలిగించే మార్గాల్లో పండుగలు జరుపుకోవడం వంటి అంశాలనూ పరిశీలించింది. అధిక కాలుష్యాన్ని కలిగించే టపాసుల విక్రయాలను నియంత్రించడం, అనుమతించిన సమయాల్లోనే వాటిని వినియోగించేలా చూడటంపైనా చర్చించింది. ఈ అంశాలకు సంబంధించిన సూచనలను ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ పరిధిలో గాలి నాణ్యతను పర్యవేక్షించే కమిషన్‌ ఫర్‌ ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ (సీఏక్యూఎం) ముందుంచే అవకాశాన్ని ధర్మాసనం పరిశీలించింది.

పంట వ్యర్థాల నిర్వహణపైనా చర్చ

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో కాలుష్యానికి మరో ప్రధాన కారణమైన పంట వ్యర్థాల దహనంపైనా విచారణలో చర్చ జరిగింది. పంట అవశేషాలను కొనుగోలు చేసి వాణిజ్య అవసరాలకు వినియోగించే అవకాశాలను పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాల పథకాల గురించి జస్టిస్‌ బాగ్చి ప్రస్తావించారు. పంట వ్యర్థాలకు ప్రస్తుతం వాణిజ్య విలువ పెరుగుతోందని, వాటి ద్వారా రైతులకు ఆర్థిక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉందని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. పంట అవశేషాలకు మార్కెట్‌ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భాటి స్పందిస్తూ.. పంట అవశేషాల నిర్వహణకు పొలాల్లో, పొలాల వెలుపల అమలు చేయాల్సిన విధానాలు ఇప్పటికే ఉన్నాయని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు తీసుకున్న చర్యల వివరాలతో కేంద్రం సమగ్ర అఫిడవిట్‌ దాఖలు చేస్తుందని వెల్లడించారు. పంట వ్యర్థాల దహనాన్ని నివారించేందుకు ప్రభుత్వం పలు పథకాలు, ఆర్థిక ప్రోత్సాహకాలు అమలు చేస్తోందని అమికస్‌ క్యూరీ సైతం ప్ర‌స్తావించారు. ఇప్పటివరకు చేపట్టిన చర్యలు, ముందస్తు నివారణ చర్యలు, భవిష్యత్‌ ప్రణాళికలతో కూడిన తాజా నివేదికను కేంద్రం కోర్టుకు సమర్పించనుంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో వాయు కాలుష్యానికి సంబంధించి టపాసులు, పంట వ్యర్థాల దహనం, ఘన వ్యర్థాల నిర్వహణ తదితర అంశాలపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపడుతోంది. ఈ కేసులో తదుపరి విచారణను అక్టోబర్‌ 15కు వాయిదా వేసింది.

Advertisement
Advertisement