త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vakiti Srihari | గోపాల‌మిత్ర‌ల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నం

Vakiti Srihari | పాడి రంగంలో క్షేత్రస్థాయిలో కీలక సేవలు అందిస్తున్న గోపాలమిత్రల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి తెలిపారు.

S

Telangana | Published On Sep 11, 2026, 2.10 pm IST

Vakiti Srihari | గోపాల‌మిత్ర‌ల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నం
Advertisement
  • గ్రామీణ పాడి వ్య‌వ‌స్థ బ‌లోపేతంలో వారి పాత్ర కీల‌కమైంది
  • పాడి రైతులకు గిట్టుబాటు ధర క‌ల్పిస్తున్నం
  • మధిర, కొడంగల్‌లో సెర్ప్ భాగ‌స్వామ్యంతో పాడి గేదెల పంపిణీ
  • శాసనసభలో స‌భ్యుల ప్ర‌శ్న‌ల‌కు మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి స‌మాధానం

Vakiti Srihari | త్రినేత్ర‌.న్యూస్‌: పాడి రంగంలో క్షేత్రస్థాయిలో కీలక సేవలు అందిస్తున్న గోపాలమిత్రల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి తెలిపారు. గోపాలమిత్రలకు మెడిక్లెయిమ్, వ్యక్తిగత ప్రమాద బీమా, సకాలంలో గౌరవ వేతనం, శిక్షణ, సాంకేతిక సహాయం, పర్యవేక్షణ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. పశువుల ఆరోగ్యం, పాడి రైతుల ప్రయోజనాలు, గ్రామీణ పాడి వ్యవస్థ బలోపేతంలో గోపాలమిత్రల పాత్ర కీలకమన్నారు. పాడి రైతుల‌కు గిట్టుబాటు ధ‌ర అందిస్తున్న‌ట్లు చెప్పారు. శుక్రవారం శాసనసభలో సభ్యులు పట్లోళ్ల సంజీవరెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, గండ్ర సత్యనారాయణ రావు, వీర్లపల్లి శంకరయ్య అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.

రాష్ట్రంలో పాడి పరిశ్రమను మరింత బలోపేతం చేసి, పాడి రైతులకు మెరుగైన ఆదాయం కల్పించడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని వాకిటి తెలిపారు. రాష్ట్రంలో పాల ఉత్పత్తి క్రమంగా పెరుగుతోందని మంత్రి తెలిపారు. 2024-25లో 59.35 లక్షల టన్నులు, 2025-26లో 61.75 లక్షల టన్నుల పాల ఉత్పత్తి నమోదైందన్నారు. 2026–27లో ఆరు నెలల కాలానికి సుమారు 30 లక్షల టన్నుల పాల ఉత్పత్తి జరుగుతుందని ముందస్తు అంచనా ఉన్నట్లు వెల్లడించారు.

పాడి రైతుల కష్టానికి తగిన ప్రతిఫలం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. 2026 ఆగస్టు 16 నుంచి గేదె పాలకు ప్రతి కిలో వెన్నకు రూ.914, ఆవు పాలకు ప్రతి కిలో వెన్నతో పాటు మొత్తం ఘన పదార్థాల ప్రాతిపదికన రూ.340 ధరలను నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. రైతులకు నాణ్యమైన పాల సేకరణకు అనుగుణంగా గిట్టుబాటు ధరలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని, పాడి రంగాన్ని గ్రామీణ కుటుంబాలకు స్థిరమైన ఆదాయ వనరుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు.

మధిర, కొడంగల్‌లో పాడి గేదెల పంపిణీ

పాడి రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా మధిర, కొడంగల్ నియోజకవర్గాల్లో సెర్ఫ్ భాగస్వామ్యంతో పాడి గేదెల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నామని మంత్రి తెలిపారు. పాడి పశువుల సంఖ్యను పెంచడంతో పాటు, రైతులకు నిరంతర ఆదాయం వచ్చేలా పాడి ఆధారిత జీవనోపాధిని ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు.

పశుసంవర్ధక శాఖలో సిబ్బంది సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి చెప్పారు. 1100 మందికిపైగా ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చి, బదిలీల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామని వెల్లడించారు. ఉద్యోగుల సంక్షేమంతో పాటు శాఖ పనితీరును మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

ఆక్సిటోసిన్ వినియోగంపై ప్రత్యేక ప్రతిపాదన లేదు

పాడి పరిశ్రమలో ఆక్సిటోసిన్ ఇంజిక్షన్ల వినియోగాన్ని నిరోధించేందుకు ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ప్రత్యేకమైన ప్రతిపాదన ఏదీ లేదని మంత్రి స్పష్టం చేశారు. అయితే పశువుల ఆరోగ్యం, పాల నాణ్యత, వినియోగదారుల భద్రత, పాడి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు.

విజయ డెయిరీ ఎక్కువ ధర చెల్లిస్తోంది

కర్ణాటకలోని నందిని డెయిరీతో పోలిస్తే తెలంగాణలో విజయ డెయిరీ ద్వారా పాడి రైతులకు ఎక్కువ ధరలు చెల్లిస్తున్నామని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. పాడి రైతుల ఆదాయాన్ని పెంచడం, పాల సేకరణ వ్యవస్థను బలోపేతం చేయడం, విజయ డెయిరీని మరింత బలోపేతం చేయడం ద్వారా తెలంగాణ పాడి రంగానికి కొత్త దిశను చూపిస్తామని మంత్రి పేర్కొన్నారు. “పాడి రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.. పాడి పరిశ్రమ బలోపేతమే గ్రామీణ ఆర్థికాభివృద్ధికి పునాది” అని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు.

Advertisement
Advertisement