త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pending Election Bills | ఇబ్బంది ప‌డుతున్నాం.. ఎన్నికల పెండింగ్ బిల్లులివ్వండి

Pending Election Bills | రాష్ట్రంలో ఎన్నిక‌ల‌కు సంబంధించిన పెండింగ్‌, అద‌న‌పు బిల్లుల‌ను మంజూరు చేయాల‌ని డిప్యూటీ క‌లెక్ట‌ర్ల సంఘం రాష్ట్ర అధ్య‌క్షులు వి.ల‌చ్చిరెడ్డి (V.Lachireddy) కోరారు.

S

Telangana | Published On Nov 5, 2026, 6.58 pm IST

Pending Election Bills | ఇబ్బంది ప‌డుతున్నాం.. ఎన్నికల పెండింగ్ బిల్లులివ్వండి
Advertisement
  • సీఈవోను కోరిన డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్య‌క్షులు వి.ల‌చ్చిరెడ్డి

Pending Election Bills | త్రినేత్ర న్యూస్: రాష్ట్రంలో ఎన్నిక‌ల‌కు సంబంధించిన పెండింగ్‌, అద‌న‌పు బిల్లుల‌ను మంజూరు చేయాల‌ని డిప్యూటీ క‌లెక్ట‌ర్ల సంఘం రాష్ట్ర అధ్య‌క్షులు వి.ల‌చ్చిరెడ్డి (V.Lachireddy) కోరారు. రుణం ఇచ్చిన‌వారు అధికారుల ఇళ్ల‌కు వెళ్లి ఒత్తిడి చేస్తున్నార‌ని వాపోయారు. తెలంగాణ శాసనసభ సాధారణ ఎన్నికలు-2023, లోక్‌సభ ఎన్నికలు-2024 సందర్భంగా రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులుగా చేసిన వ్యయాలు, కేటాయించిన బడ్జెట్‌ను మించిపోయాయని గుర్తు చేశారు. అదనపు బడ్జెట్ మంజూరు చేయాలని విజ్ఞ‌ప్తి చేశారు. ఈమేర‌కు రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి సుద‌ర్శ‌న్‌రెడ్డిని డిప్యూటీ క‌లెక్ట‌ర్ల సంఘం ప్ర‌తినిధులు గురువారం క‌లిసి విన‌తి ప‌త్రం అంద‌జేశారు.

ఎన్నికల సమయంలో వివిధ ఖాతాల కింద కేటాయించిన బడ్జెట్ సరిపోకపోవడంతో పలు అసెంబ్లీ, పార్లమెంటరీ నియోజకవర్గాల్లో అదనపు ఖ‌ర్చులు చేయాల్సి వచ్చిందన్నారు. ఈ ఖర్చులను అప్పుల రూపంలో సమకూర్చుకోవాల్సి వచ్చిందని, సంబంధిత బిల్లుల చెల్లింపులు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. బకాయిల చెల్లింపుల కోసం కొందరు రుణం ఇచ్చిన‌వారు కోర్టులను ఆశ్రయించగా, మరికొందరు అప్పటి రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలు, నివాసాలకు వెళ్లి ఒత్తిడి చేస్తున్నారన్నారు. ఈ పరిణామాలు అధికారులకు ఇబ్బందికరంగా మారడమే కాకుండా వారి గౌరవానికి భంగం కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నికల అదనపు బడ్జెట్ మంజూరు కోసం సంబంధిత అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు సమర్పించినప్పటికీ, అవి వివిధ స్థాయిల్లో పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం, మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రతిపాదనలను కూడా లేఖలో ప్రస్తావించారు. ఎన్నికల నిర్వహణలో చేసిన అదనపు వ్యయాలకు సంబంధించి రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు సమర్పించిన ప్రతిపాదనలను తక్షణమే పరిశీలించి, అదనపు బడ్జెట్‌ను మంజూరు చేయాలని కోరారు.

ఈ కార్య‌క్ర‌మంలో డిప్యూటీ క‌లెక్ట‌ర్ల సంఘం నాయ‌కులు శ‌కుంత‌ల‌, లావ‌ణ్య‌, టీజీటీఏ రాష్ట్ర అధ్య‌క్షులు ఎస్‌.రాములు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ర‌మేష్ పాక‌, మ‌హిళా అధ్య‌క్షురాలు రాధ‌, శ్రీ‌కాంత్‌, వెంక‌ట‌ల‌క్ష్మి పాల్గొన్నారు.

Advertisement
Advertisement