Uttam Kumar Reddy | జాతీయ సమైక్య పోరాటంలో రాహుల్ వెంటే ఉందాం
Uttam Kumar Reddy | దేశ ప్రజలు బీజేపీ, ప్రధాని మోదీకి ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారని.. జాతీయ సమైక్య పోరాటంలో రాహుల్ గాంధీ వెంట నడవాలని మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.
- ప్రజల్లో కాంగ్రెస్‌కు మద్దతు పెరుగుతుంది
- వారు బీజేపీకి ప్రత్యామ్నాయం చూస్తున్నారు
- ఇదే రాజకీయ మార్పుకు సంకేతం
- రాజీవ్‌గాంధీ సద్భావన యాత్ర స్మారక సమావేశంలో మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
Uttam Kumar Reddy | త్రినేత్ర న్యూస్: దేశ ప్రజలు బీజేపీ, ప్రధాని మోదీకి ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారని.. జాతీయ సమైక్య పోరాటంలో రాహుల్ గాంధీ వెంట నడవాలని మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Uttam Kumar Reddy )పేర్కొన్నారు. ప్రజల్లో కాంగ్రెస్‌కు పెరుగుతున్న మద్దతే రాజకీయ మార్పునకు సంకేతమన్నారు. తెలంగాణలో పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇవ్వాలన్నారు. చార్మినార్ వద్ద సోమవారం నిర్వహించిన రాజీవ్‌గాంధీ సద్భావన యాత్ర (Rajeev Sadbhavana Yatra) స్మారక దినోత్సవం, రాజీవ్ సద్భావన పురస్కార ప్రదానోత్సవానికి అధ్యక్షత వహించిన అంనంతరం ఆయన మాట్లాడారు.
రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా నిశ్శబ్ద విప్లవం సాగుతోంది. రాహుల్, కాంగ్రెస్‌కు పెరుగుతున్న ప్రజామద్దతు జాతీయ స్థాయిలో రాజకీయ మార్పు పట్ల ప్రజల్లో ఉన్న ఆకాంక్షకు నిదర్శనం. క్లిష్ట పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌కు రాహుల్ సమర్థ నాయకత్వాన్ని అందించారు. దేశవ్యాప్తంగా పార్టీ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం పెరగడం రాజకీయ మార్పునకు సంకేతం. బీజేపీని ఓడించి, లౌకికవాదం, ప్రజాస్వామ్యం, జాతీయ సమైక్యతను బలోపేతం చేసే పోరాటంలో కార్యకర్తలు రాహుల్‌కు అండగా నిలవాలి.
గత బీఆర్‌ఎస్ పాలనలో అనేక ఇబ్బందులను ఎదుర్కొని పార్టీ కోసం పనిచేసిన క్షేత్రస్థాయి కార్యకర్తలకు కాంగ్రెస్ ప్రభుత్వం మరింత గుర్తింపు ఇవ్వాలి. వారి పట్టుదల, త్యాగాలు, నిరంతర కృషి తెలంగాణలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు. వారి సేవలను మరువొద్దు. పార్టీ ముఖ్య కార్యక్రమాలకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మరింత ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రజాప్రతినిధులు విస్తృతంగా పాల్గొనడం ద్వారా కార్యకర్తలకు గుర్తింపు లభించడంతోపాటు సంస్థాగతంగా పార్టీ బలోపేతమవుతుంది. ప్రభుత్వం, పార్టీ మధ్య సన్నిహిత సమన్వయం అవసరం.
మతసామరస్యం, జాతీయ సమైక్యత సందేశంతో రాజీవ్‌గాంధీ చేపట్టిన సద్భావన యాత్రను స్మరించుకుంటూ 1990 నుంచి ఏటా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు, రాజీవ్ సద్భావన పురస్కార కమిటీకి అభినందనలు. పదవులతో నిమిత్తం లేకుండా తాను ఈ కార్యక్రమానికి క్రమం తప్పకుండా హాజరవుతున్నా అని ఉత్తమ్ తెలిపారు.
ఏఐసీసీ కార్యదర్శి సచిన్ ఎం. సావంత్ మాట్లాడుతూ.. జాతీయ సమైక్యత, మతసామరస్యం, సమాచార సాంకేతిక రంగం, పంచాయతీరాజ్, యువత సాధికారతకు రాజీవ్‌గాంధీ చేసిన కృషిని కొనియాడారు. ఐక్యత, పరస్పర గౌరవం, రాజకీయాలకు అతీతంగా జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వడం రాజీవ్ ఆశయాలని పేర్కొన్నారు. కంప్యూటరీకరణ, సమాచార సాంకేతిక పరిజ్ఞానం ప్రాధాన్యాన్ని ఆయన ముందుగానే గుర్తించారని అన్నారు. పంజాబ్, అసోం, మిజోరంలలో శాంతి పునరుద్ధరణకు రాజీవ్ కృషి చేశారని సావంత్ గుర్తుచేశారు.
పంచాయతీరాజ్ సంస్థల బలోపేతం, స్థానిక పాలనలో మహిళల భాగస్వామ్యం పెంపునకు చొరవ చూపారని చెప్పారు. ఓటు హక్కు వయసును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించి యువతకు ప్రజాస్వామ్య ప్రక్రియలో విస్తృత భాగస్వామ్యం కల్పించారని పేర్కొన్నారు. కులం, మతం పేరుతో సమాజంలో పెరుగుతున్న విభజనలపై సావంత్ ఆందోళన వ్యక్తం చేశారు. మతపరమైన విభజనలు దేశాన్ని బలహీనపరుస్తాయని అన్నారు. ప్రేమ, సామరస్యం, జాతీయ సమైక్యత విలువలను కాపాడాలని కోరారు. విద్వేషాన్ని ఎదుర్కొని సామాజిక ఐక్యతను పెంపొందించేందుకు రాహుల్ చేస్తున్న ప్రయత్నాలకు కార్యకర్తలు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా సమాజానికి అందిస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా హైదరాబాద్‌లోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ సి. మల్లికార్జునను ఈ కార్యక్రమంలో సత్కరించారు. ప్రజాసేవకు అంకితమైన వ్యక్తులను గుర్తిస్తూ ఏటా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న నిర్వాహకులను వక్తలు అభినందించారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ ఎం. సావంత్, మాజీ పీసీసీ అధ్యక్షుడు వి. హనుమంతరావు, మాజీ మంత్రి గీతారెడ్డి, ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్, సీనియర్ నాయకులు అంజన్‌కుమార్‌యాదవ్, ఫిరోజ్‌ఖాన్, డాక్టర్ సి. మల్లికార్జునతోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, పార్టీ బాధ్యులు, రాజీవ్ సద్భావన పురస్కార కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Telangana | ఎల్ నినోపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
- ●Rashmika Mandanna | తెలంగాణ కోడలిగా రష్మిక బతుకమ్మ సంబురం - ఫొటోలు చూశారా
- ●Chariot Festival | స్వర్ణరథంపై శ్రీనివాసుడి దర్శనం.. గోవింద నామస్మరణలతో మార్మోగిన తిరుమాడ వీధులు
- ●Southern Railway | రైళ్లలో గట్టిగా పాటలు వింటున్నారా.. అయితే మీకు జైలు శిక్ష తప్పదు
- ●US Middle East Travel Alert 2026 | మిడిల్ ఈస్ట్‌లో ముదురుతున్న సంక్షోభం: సౌదీ, యూఏఈ సహా 12 దేశాలకు అమెరికా 'సెక్యూరిటీ అలర్ట్'
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ..

Telangana | ఎల్ నినోపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు

Rashmika Mandanna | తెలంగాణ కోడలిగా రష్మిక బతుకమ్మ సంబురం - ఫొటోలు చూశారా

Chariot Festival | స్వర్ణరథంపై శ్రీనివాసుడి దర్శనం.. గోవింద నామస్మరణలతో మార్మోగిన తిరుమాడ వీధులు

Southern Railway | రైళ్లలో గట్టిగా పాటలు వింటున్నారా.. అయితే మీకు జైలు శిక్ష తప్పదు





