Bandi Sanjay | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ నగరంలోని పంజాగుట్టలోని శ్రీ దుర్గా భవాని ఆలయంలో కొలువైన దుర్గామల్లేశ్వర స్వామి వారిని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ శనివారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన బండి సంజయ్.. తదనంతరం ప్రధాని నరేంద్ర మోదీ గోత్రనామాలతో అర్చన చేయించారు. ఇవాళ ఉదయం ఆలయానికి వచ్చిన బండి సంజయ్‌కు ఆలయ కమిటీ ఘనస్వాగతం పలికింది. దుర్గా భవాని అమ్మవారు, మేధా దక్షిణ మూర్తి స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కేంద్ర మంత్రిని పూలమాల శాలువాతో ఆలయ కమిటీ సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. బండి సంజయ్ వెంట అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జి ఎన్‌వీ సుభాష్ ఉన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సంజయ్ మాట్లాడుతూ.. 1026లో సోమనాథ్ మహాదేవాలయంపై మహమ్మద్ గజినీ దాడి జరిగినప్పటికీ, భారతీయ ధర్మం, సంస్కృతి, ఆధ్యాత్మిక విశ్వాసాలు ఎప్పుడూ చెక్కుచెదరలేదని బండి సంజయ్ కుమార్ తెలిపారు. వెయ్యేళ్ల తర్వాత కూడా సోమనాథ్ ఆలయం భారతీయ నాగరికత శాశ్వత ప్రతీకగా నిలుస్తోందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ సంకల్పంతో పునరుద్ధరించబడిన ఆలయాన్ని 1951లో అప్పటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో భక్తుల దర్శనార్థం తెరిచారని గుర్తు చేశారు. 2026 నాటికి పునర్నిర్మాణానికి 75 సంవత్సరాలు (అమృతోత్సవం) పూర్తి అవడం, ఈ స్వాభిమాన పర్వ్‌కు ప్రత్యేక చారిత్రాత్మక ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. ప్రధాని నేతృత్వంలో జనవరి 10‑11న గుజరాత్‌లోని సోమనాథ్ క్షేత్రంలో “సహస్ర సంకల్ప యాత్ర” ప్రారంభమవుతుందని, ఇందులో 108 అశ్వాల ప్రదర్శన, ఓంకార మంత్రోచ్ఛారణ, ఆలయ దర్శనం, బహిరంగ సభలు ఉంటాయని గుర్తు చేశారు. ప్రజలందరూ ఈ మహా చారిత్రాత్మక సందర్భంలో శివాలయాల్లో ఓంకార జపం, ప్రత్యేక పూజల్లో పాల్గొని ధర్మ‑సంస్కృతి పరిరక్షణలో చైతన్యంగా భాగస్వామ్యం కావాలని, ఇది మన ధర్మాన్ని, సంస్కృతిని, భారతీయ ఆత్మగౌరవాన్ని స్మరించుకునే అవకాశం అని బండి సంజయ్ పిలుపునిచ్చారు. మహాశివుడి 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో మొట్టమొదటిదైన గుజరాత్ సోమ్ నాథ్ పై దాడి జరిగి ఈ ఏడు వెయ్యేళ్లు అవుతుంది. వెయ్యేళ్లుగా అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్న ఈ మహిమాన్విత క్షేత్రం భారత అధ్యాత్మికత, నాగరికత, వారసత్వ వైభవోపేతానికి సజీవ సాక్షిగా నిలబడింది. అంతేకాదు, ఈ ఆలయ పునర్నిర్మాణం… pic.twitter.com/4XNuu7t4xg — Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) January 10, 2026