Kalvakuntla Kavitha | నన్ను అమరవీరుల స్థూపానికి కట్టేసి రాళ్లతో కొట్టండి.. కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి
Kalvakuntla Kavitha | తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆవిర్భావం రోజున ప్రకటించినట్టు పాంచజన్యం అమలు చేసి చూపించకపోతే.. వాటి పట్ల చిత్తశుద్ధి చూపించకపోతే అసెంబ్లీ ముందున్న అమరవీరుల స్థూపానికి నన్ను కట్టేసి రాళ్లతో కొట్టండి అని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్టు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.
Kalvakuntla Kavitha | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆవిర్భావం రోజున ప్రకటించినట్టు పాంచజన్యం అమలు చేసి చూపించకపోతే.. వాటి పట్ల చిత్తశుద్ధి చూపించకపోతే అసెంబ్లీ ముందున్న అమరవీరుల స్థూపానికి నన్ను కట్టేసి రాళ్లతో కొట్టండి అని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్టు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కవిత పాల్గొని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సవివరంగా ఆమె సమాధానం ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలో కొత్త రాజకీయ శక్తిగా వస్తామని చెప్పాం. వచ్చాం. అన్ని అడ్డంకులను దాటుకొని తెలంగాణ రక్షణ సేన పేరుతో రాజకీయ ఫ్లాట్ ఫామ్‌ను ఏర్పాటు చేసుకున్నాం. 20 ఏళ్ల పాటు సాగిన తెలంగాణ జాగృతి స్వచ్చంద సంస్థగా అలాగే కొనసాగుతుంది. రాష్ట్రంలోని అన్ని వర్గాల సమస్యలపైన తెలంగాణ రక్షణ సేన మాట్లాడుతుంది. పోరాటం చేస్తుంది. తెలంగాణ సాధించుకున్న తర్వాత మనం సర్వోదయ తెలంగాణ కావాలనుకున్నాం. ఇప్పుడు మేము సర్వోదయ తెలంగాణ లక్ష్యంగా ముందుకు వస్తున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నిండటమే సర్వోదయ తెలంగాణ లక్ష్యం. సర్వోదయ తెలంగాణ సాధించటం కోసం మేము పాంచజన్యం అనే ఐదు అంశాలను తీసుకున్నాం. ఆధర్మం పై యుద్ధం చేసేందుకు శ్రీకృష్ణుడు మోగించిన యుద్ధబేరియే పాంచజన్యం. మేము కూడా అదే స్ఫూర్తితో పాంచజన్యం పేరుతో ఐదు ప్రాధాన్యత అంశాలను తీసుకున్నాం. ఇప్పుడు ప్రతిపక్షంగా...రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇవే అంశాలను తీర్చటంలో మా ఫోకస్ ఉంటుంది అని కవిత స్పష్టం చేశారు.
కేసీఆర్‌కు, మీకు మధ్య అగాథం ఎందుకు ఏర్పడింది..?
మా నాన్నను విమర్శించలేదు. రాజకీయ నాయకుడిగా ఆయనను విమర్శించాను. మా నాన్న కేసీఆర్‌తో ఎలాంటి సమస్య లేదు.. ఆయన లేకపోతే నాకు జన్మ లేదు. తల్లిదండ్రులతో సమస్య లేదు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌తో ఐడియాలజికల్ విబేధాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా నేను ఒక్క మాట అనలేదు. కొన్ని పనులు చేయకపోవడం వల్ల విమర్శించాను. తెలంగాణలో తొలి ప్రభుత్వం బీఆర్ఎస్.. కృష్ణా, గోదావరి నీళ్లు సరిగ్గా వాడుకుంటే 2 లక్షల 50 వేల కోట్ల సంపద చేకూరేది. ఒక లక్షా 20 వేలు పెట్టి కడితే లక్ష ఎకరాలకు ఇచ్చారు.. దానికి విమర్శ చేశాను. రేపు కూడా విమర్శ చేస్తాను. 2001 నుంచి 2014 వరకు యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేదు. పదిసార్లు పేపర్ లీక్ అయింది. ప్రపంచంలోనే గొప్ప ఐటీ మినిస్టర్ అని పేరు తెచ్చుకున్న కేటీఆర్.. టీసీఎస్, జీఆర్ఈ, టోఫెల్‌తో మాట్లాడి పెట్టలేమా.. గ్రూప్ -1, టెన్త్ పేపర్ లీక్ అయింది. పదేండ్లు బీఆర్ఎస్ పాలనలో, రెండున్నరేండ్లు కాంగ్రెస్ పాలనలో.. రెండు జనరేషన్ల పిల్లలు నష్టపోయారు. లక్ష మంది ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు.
మొదట తెలంగాణ రాష్ట్ర సేన అని ప్రకటించారు.. మళ్లీ రక్షణ సేన అంటున్నారు..?
తెలంగాణ రక్షణ సేన పేరును ఎన్నికల కమిషన్ ఇచ్చింది. దరఖాస్తు చేసుకున్న పేర్లను రానివొద్దని కుట్రలు జరిగాయి. మేం వ్యూహాత్మకంగానే ముందుకు వచ్చాం. తెలంగాణ ప్రజా జాగృతితో పెట్టుకున్న దరఖాస్తుతోనే.. వ్యూహాత్మకంగా చెబుతూ వచ్చాం. ఈసీ నుంచి తెలంగాణ రక్షణ సేన అని వచ్చింది.. టీఆర్ఎస్ పేరు నాకు రాసి పెట్టినట్టు ఉంది.. దేవుడి దయ ఉంది మా మీద. ప్రజల ప్రేమను తప్పకుండా పొందుతాను.
రేవంత్ రెడ్డేమో ఉన్న పార్టీకి దిక్కు లేదు అంటున్నారు..? కొత్త పార్టీలు వస్తుంటాయి పోతుంటాయని కేటీఆర్ అంటున్నారు..? కవిత సీఎం అవుతానని అనుకోవడం జోక్ అని కోమటిరెడ్డి బ్రదర్స్ అంటున్నారు. పిట్టల దొరసాని అని ధర్మపురి అరవింద్ అంటున్నారు..?
బీజేపీకి తెలంగాణలో స్పేస్ లేదు. సామాజిక న్యాయానికి బద్ద వ్యతిరేకులు బీజేపీ నేతలు. ఒక్క రూపాయి తీసుకురాలేదు రాష్ట్రానికి. ఇప్పటికైనా ధర్మపురి అరవింద్ బుద్ధి తెచ్చుకుని రెండు రూపాయాలు తీసుకురండి. పాలమూరు ప్రాజెక్టుకు ప్రత్యేక హోదా ఇస్తా అన్నారు.. అది తీసుకురండి.. నన్ను తిడితే ఏం వస్తది. తెలంగాణ ప్రజలు ఏది చేస్తే అది అయితది. కోమటిరెడ్డి బ్రదర్స్ జోక్ అనుకున్నా.. ఏం అనుకున్నా మాకు నష్టం లేదు. పార్టీ ఉండడమే పవర్.. చిన్న పార్టీ కాదు పెద్ద పార్టీ కాదు.. సీన్సియారిటీ బట్టి పవర్ వస్తది. పవర్‌లోకి వస్తద.. ప్రతిపక్షంలో ఉంటద అనేది సెకండరీ.. జోక్ అన్న వారికి కాలమే సమాధానం చెబుతుంది. బీజేపీ నేతలకు మళ్లీ చెబుతున్నా.. 10న మోదీ వస్తున్నారు నిధులు మోసుకురమ్మనండి.. పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వమనండి. మహిళా బిల్లు విషయంలో క్లారిటీ ఇవ్వమనండి.
పాంచజన్యం ఎలా సాధ్యమవుతుంది..?
జీఎస్టీ నుంచి రూ. 60 వేల కోట్లు, ఎక్సైజ్ నుంచి రూ. 50 వేల కోట్లు, పెట్రల్ నుంచి రూ. 19 వేల కోట్లు, పరిశ్రమల నుంచి రూ. 10 వేల కోట్లు, నాన్ ట్యాక్స్ రెవెన్యూ రూ. 35 వేల కోట్లు, మైనింగ్ నుంచి రూ. 8 వేల కోట్లు వస్తాయి. ఇవన్నీ కూడితే రూ. లక్షా 80 వేల కోట్లు మన ముందు ఉన్నాయి. ఇవే కాకుండా లోటు పూరించడానికి అప్పులు తెస్తుంటాం. అప్పులు పోను, జీతాలు, పెన్షన్లు పోనూ.. లక్ష కోట్లు ప్రభుత్వం వద్ద ఉంటది.. విద్యకు, వైద్యానికి పెద్ద పీట వేయొచ్చు.. అమ్మతనం ఉంటే ఇవి ఇవ్వొచ్చు. కచ్చితంగా ప్రయివేటులో ఫీజులు పెరుగుతున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వరు.. కాంగ్రెస్‌కు దమ్ముంటే.. ఫీజులు పెంచొద్దని జీవో ఇవ్వండి. మీరే చెప్పారు నియంత్రణ చేస్తామని. విద్య, వైద్యంకు రూ. 60 వేల కోట్లు, యూత్‌కు రూ. 10 వేల కోట్లు, వ్యవసాయానికి రూ. 10 వేల కోట్లు పోయినా.. ఇంకా ఉంటాయి. చేసే చిత్తశుద్ధి ఉంటే చేయొచ్చు.. విద్య, వైద్యం పూర్తిగా ఉచితంగా అందిస్తాం.
పదేళ్లు బీఆర్ఎస్‌లోనే ఉన్నారు కదా.. మరి ఇవన్నీ చేయడానికి ఏం అడ్డు వచ్చింది..?
అవినీతిపై, అక్రమాలపై సాక్ష్యాలతో ఇచ్చాను చర్యలు తీసుకోలేదు. బాస్ నిర్ణయానికి కట్టుబడి డ్యూటీ చేశాను. అందుకే ప్రజలకు క్షమాపణ చెప్పాను. స్వరం పెంచి ప్రజల కోసం, అమరవీరుల కోసం పని చేయాల్సి ఉండే. పాంచజన్యం, భూ నిర్వాసితులు, ఉద్యమకారుల పట్ల చిత్తశుద్ధి లేకపోతే.. అసెంబ్లీ ముందున్న అమరవీరుల స్తూపానికి కట్టేసి నన్ను రాళ్లతో కొట్టమని విజ్ఞప్తి చేస్తున్నా.. నాడు ప్రశ్నించలేదు.. నేడు ప్రశ్నించలేదు అంటే కుదరదు. ప్రశ్నతోనే ప్రతిది ప్రారంభమవుతుంది. కొన్ని మార్పులు వస్తాయి.
కేసీఆర్ టీఆర్ఎస్ లాంచ్ చేసినప్పుడు ఇది ఫక్తు రాజకీయ పార్టీ కాదు.. తర్వాత రాజకీయ పార్టీ అన్నారు.. జాగృతి కల్చరల్ సంస్థ.. ఇప్పుడు పార్టీ అంటున్నారు..?
నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాను.. నా నుంచి వివరణ కోరలేదు. పైలట్ రోహిత్ రెడ్డికి షోకాజు నోటీసులు ఇచ్చారు. తప్పు చేస్తే సస్పెండ్ చేయడం సరికాదు.. నోటీసులు ఇవ్వాల్సి ఉండే. మరి నేను ఏం తప్పు చేశానో తెలియదు సస్పెండ్ చేశారు. ప్రజా జీవితంలో ఉండాలనుకున్న వ్యక్తిగా.. కాంగ్రెస్, బీజేపీ మేలు చేయదు అని నేను పొలిటికల్ పార్టీ పెట్టుకుని ప్రజల కోసం వెళ్తున్నా. బీఆర్ఎస్ పార్టీ వద్దనుకున్నది.. కానీ తెలంగాణ ప్రజల వద్దకు నేను వెళ్తున్నా.. ఆదరిస్తారనే విశ్వాసం ఉంది.
యువతకు మహిళలకు ప్రియార్టీ ఇస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు అవకాశం ఇస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఓట్లను చీల్చడానికి ప్రియార్టీగా ఉంటున్నారా..?
వేలాది మంది మా జాగృతిలో చేరారు. రక్షణ సేనలో భాగం అవుతున్నారు.. మెజార్టీ యూత్, ఉమెన్ ఉన్నారు. పిడికెడు మంది అనుభవజ్ఞులను తీసుకుంటాం. నాకు టార్గెట్ బీఆర్ఎస్, కాంగ్రెస్ కాదు.. సర్వోదయ తెలంగాణ. ఈ క్రమంలో ఎవరు అడ్డొచ్చినా విమర్శిస్తాను.
మహిళా రిజర్వేషన్లు ఎంత వరకు ఇస్తారు..?
మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయినా కాపోయినా 33 శాతానికి తగ్గకుండా సీట్లు ఇస్తాం. అవకాశం ఉంటే 50 శాతం ఇవ్వడానికి ట్రై చేస్తాం.
పాంచజన్యంలో మహిళా రిజర్వేషన్లను ఎందుకు పెట్టలేదు. జంతర్ మంతర్ వద్ద మహిళ రిజర్వేషన్ల కోసం కొట్లాడారు కదా..?
ప్రతి అంశంలో వైద్యం, విద్య, ఉపాధి, వ్యవసాయం, సామాజిక భద్రత విషయంలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తాం. మహిళ పని చేయకుండా ఒక్క గింజ బయటకు రాదు.. మహిళల కోసమే పని చేస్తది నా మైండ్. పొలిటికల్‌గా, సామాజికంగా, ఆర్థికంగా.. మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాం.
పార్టీ పెట్టడం అంటే పాన్ డబ్బా పెట్టినంత ఈజీ కాదు అని కేసీఆర్ అన్నారు.. మీ కార్యాచరణ ఎలా ఉండబోతోంది.. ఎన్నికల టైంలో ఇచ్చే మాదిరి మీ పాంచజన్యం ఉంది..?
కేసీఆర్ గారికి నా ప్లేస్‌లో కొడుకు ఉండి ఉంటే.. పార్టీ పెడితే ఈ ప్రశ్న అడిగే వారు కాదు. మహిళగా దేశాన్ని నడిపే సామర్థ్యం ఉందని ఇందిరా , జయలలిత, మమతా బెనర్జీ నిరూపించారు. అనేక మంది మహిళలు సీఎంలు, మంత్రులు అయి ఈ దేశానికి వన్నె తెచ్చారు. వారి స్పూర్తితో పని చేస్తాం. ఎవరికీ తీసిపోకుండా.. ఒక ప్రాపర్‌గా పార్టీని నడుపుతాం. పాంచజన్యం అనేది సైద్ధాంతిక పునాది.. అధర్మం, అనివీతిపై యుద్ధం. అంతకు ముందు ఆంధ్రోళ్ల మీద పంచాయతీ.. ఇప్పుడు ప్రతి పార్టీ తెలంగాణోడోది.. మనోడి మీద యుద్ధం.. సమర శంఖం పూరించాల్సిందే.
అధికారంలోకి వస్తున్నమని చెప్పారు.. ఎన్టీఆర్, ఈటెల, మీరు కూడా ఓడిపోయారు. పరిషత్, జీహెచ్ఎంసీ ఎన్నికలో మీ ప్రాధాన్యత ఏంటి..?
లీడర్ బేస్డ్ పార్టీ కాదు.. కేడర్ బేస్డ్ పార్టీ మాది.. లీడర్ అన్నది ముఖ్యం కాదు.. ప్రజలే తయారు చేస్తారు. కేడర్‌కు ఏ పార్టీలో రెస్పెక్ట్ లేదు. రక్షణ సేనలో కేడర్‌కు ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇతర పార్టీలో కేడర్‌కు ప్రాధాన్యత లేదు. ప్రతి బూత్ లెవల్‌లో కమిటీలు వేసుకుంటాం. ప్రతి జిల్లాలో ఆఫీసులు పెట్టుకుంటాం. ప్రజల ప్రేమను చూరగొంటాం.. చరిత్ర సృష్టిస్తామన్న విశ్వాసం ఉంది.
పాంచజన్యం అమలు కావాలంటే కేంద్రంతో పోరాడాలి..? మరి మీరు పోరాడుతారా..?
సొంత ప్రజలను చంపుకునే వింత ప్రభుత్వం దేశాన్ని ఏలుతుంది. నాకు బీజేపీకి డీఎన్ఏ కూడా సరిపోదు. మా తెలంగాణ సమాజానికి బీజేపీతో ఉన్న ప్రమాదం సామాజిక న్యాయం కానివ్వరు.. అందుకే బీసీ బిల్లును పాస్ కానివ్వడం లేదు. సింగిల్ రూపీ కూడా ఇవ్వలేదు. తెలంగాణకు నష్టం చేస్తున్న బీజేపీపై తప్పకుండా పోరాటం చేస్తాం.
జర్నలిస్టుల సంక్షేమ కోసం మీ రు ఏం చేస్తారు.. హరీశ్‌రావును ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..?
మీకు అన్యాయం ఎదురైంది.. పోలీసుల పిల్లలకు పెట్టిన హాస్టళ్లలో జర్నలిస్టుల పిల్లలకు అవకాశం ఇవ్వాలి. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. మీ కష్టాలు మా కష్టాలు సేమ్.. ప్రజల పక్షాన ఉండండి. జర్నలిస్టులంటే మాకు ప్రత్యేక ప్రేమ. తెలంగాణ ఉద్యమానికి ఉత్ప్రేరకాలుగా పని చేసిన మిమ్మల్ని మరిచిపోం. కలం వీరుల పిల్లలకు పోలీసుల పిల్లలకు పెట్టిన స్కూళల్లో అవకాశం కల్పిస్తాం. హరీశ్‌రావు ప్రశ్నకు సమాధానం దాట వేశారు.
తెలంగాణ రాజకీయాల్లో విలన్ ఎవరు..? మీరు సీఎం అయితే తప్ప తెలంగాణలో సామాజిక న్యాయం రాదా..?
తెలంగాణ ప్రజలకు ఎవరు విలనో.. వాళ్లే నాకు విలన్. నాకు ప్రత్యేకంగా శత్రువులు, విలన్లు ఉండరు.. పాత పార్టీ ఇబ్బంది పెట్టినా కేంద్రం ఇబ్బంది పెట్టినా అది నా పర్సనల్ ఇష్యూ. పార్టీ ప్రజల కోసం పెట్టాను. న్యూట్రల్‌గా, ధర్మంగా, న్యాయబద్ధంగా పని చేయడం నా ధర్మం. ప్రజలకు ఎవరు విలనో వారికి వ్యతిరేకంగా పని చేస్తాను. 300 ఏండ్ల నుంచి సామాజిక న్యాయం కోసం పోరాటం జరుగుతుంది. అంబేద్కర్ దయ వల్ల ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు రావడం వల్ల కొంచెం ముందడుగు పడింది. బీసీలకు కూడా రాజ్యాంగంలో బ్యాక్‌వర్డ్ క్లాసెస్ కాకుండా క్యాస్ట్ అని పెడితే లొల్లి లేకుండా పోతుండే. కాబట్టి ఇప్పుడు పోరాటం చేయాలి. బీసీలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. బీసీలకు రావాల్సిన రిజర్వేషన్లు కేంద్రం నుంచే రావాలి. మేం కూడా బీసీ రిజర్వేషన్లు సాధించేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తాం.
మావోయిస్టుల పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరి మీ పార్టీ వైఖరి ఏంటి..?
మావోయిస్టుల భావజాలాన్ని అణిచివేయడం సరికాదు. ఆపరేషన్ కగార్‌పై మొదటిసారిగా మాట్లాడింది మేమే. లొంగిపోయిన మావోయిస్టులకు వెల్‌కమ్ చెబుతున్నాం.. వారికి ఇష్టమున్న పార్టీలో చేరి ప్రజా స్రవంతిలో పోరాటం చేయొచ్చు.
ఎన్నికల ముందు పొత్తులు ఉంటాయా..?
భాసారూప్యత ఉన్న పార్టీలతో పొత్తు మంచిది. ప్రస్తుతం న్యూడెమోక్రసీ, ధర్మ సమాజ్ పార్టీతో కలిసి పని చేస్తున్నాం.. ఎన్నికల వరకు ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నాం. సింగిల్ గా టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని నమ్ముతున్నాం.
మీ వెనుకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు..?
నా వెనుక ఎవరూ లేరు.. నేనే ఉన్నా. బీఆర్ఎస్ లైట్‌గా తీసుకుంటుందా అనేది వాళ్ల విషయం. బీఆర్ఎస్, కాంగ్రెస్ విమర్శలను పక్కకు తోసి.. ప్రజా సమస్యలపై యుద్ధం చేస్తాం. నేను ఒక వ్యక్తిగా అనేక కష్టాలు పడ్డాను. ఆడబిడ్డగా పడరాని ఆగచాట్లు పడ్డాను. పొలిటికల్‌గా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిప్పులో నుంచి నడిచి వచ్చిన వ్యక్తికి ప్రపంచాన్ని ఎదుర్కొనే దైర్యం వచ్చింది. కేసీఆర్ స్ఫూర్తితోనే మేం బయటకు వచ్చాం. కానీ ఇవాళ దారులు వేరు అయ్యాయి. దేశంలో నేను మొదటి వ్యక్తిని కావొచ్చు. ఆడపిల్లల కోసం ముందుకు వెళ్తున్నా.. నా వెనుక ఎవరూ లేరు.. అలాంటి ప్రశ్నలు అడగొద్దు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



