త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kishan Reddy | తెలంగాణ ప్ర‌భుత్వం సింగ‌రేణికి రూ.54 వేల కోట్లు బాకీ ఉంది

Kishan Reddy | మోదీ హ‌యాంలో 20 ఏండ్ల త‌ర్వాత సింగ‌రేణికి తాడిచ‌ర్ల‌-2 బ్లాక్‌ను కేటాయించామ‌ని కేంద్ర బొగ్గు గ‌నుల శాఖ మంత్రి కిష‌న్‌రెడ్డి చెప్పారు. ఇక్క‌డ ఇంకా 40 నుంచి 50 ఏండ్ల వ‌ర‌కు నాణ్య‌మైన బొగ్గు దొరుకుతుంద‌ని పేర్కొన్నారు. కాంగ్రెస్ హ‌యాంలో మ‌న్మోహ‌న్‌సింగ్ ప్ర‌ధానిగా ఉన్న‌ప్పుడు దేశంలో పెద్దఎత్తున 2 ల‌క్ష‌ల 60 వేల కోట్ల బొగ్గు కుంభ‌కోణం జ‌రిగిందని ఆరోపించారు.

S

Telangana | Published On Jul 13, 2026, 3.32 pm IST

Kishan Reddy | తెలంగాణ ప్ర‌భుత్వం సింగ‌రేణికి రూ.54 వేల కోట్లు బాకీ ఉంది
Advertisement
  • ఆరోజు ఈరోజు కూడా సింగ‌రేణిని ఆదుకున్న‌ది బీజేపీయే
  • 20 ఏండ్ల త‌ర్వాత ఇచ్చిన ఏకైక బ్లాక్ తాడిచ‌ర్ల‌-2 నే
  • ఇంకా 40 నుంచి 50 సంవ‌త్స‌రాల వ‌ర‌కు ఇక్క‌డి బొగ్గు దొరుకుతుంది
  • కేంద్రం త‌ర‌ఫున బొగ్గు కొంటాం
  • సింగ‌రేణి డ‌బ్బులు అప్పుడు సిద్దిపేట‌కు పోయిన‌య్‌, ఇప్పుడు కొడంగ‌ల్ కు పోతున్న‌య్‌
  • సింగ‌రేణి భ‌రోసా యాత్ర‌లో కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి ధ్వజం

Kishan Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: మోదీ హ‌యాంలో 20 ఏండ్ల త‌ర్వాత సింగ‌రేణికి తాడిచ‌ర్ల‌-2 బ్లాక్‌ను కేటాయించామ‌ని కేంద్ర బొగ్గు గ‌నుల శాఖ మంత్రి కిష‌న్‌రెడ్డి చెప్పారు. ఇక్క‌డ ఇంకా 40 నుంచి 50 ఏండ్ల వ‌ర‌కు నాణ్య‌మైన బొగ్గు దొరుకుతుంద‌ని పేర్కొన్నారు. కాంగ్రెస్ హ‌యాంలో మ‌న్మోహ‌న్‌సింగ్ ప్ర‌ధానిగా ఉన్న‌ప్పుడు దేశంలో పెద్దఎత్తున 2 ల‌క్ష‌ల 60 వేల కోట్ల బొగ్గు కుంభ‌కోణం జ‌రిగిందని ఆరోపించారు. బీఆర్ఎస్ హ‌యాంలో సిద్దిపేట‌కు సింగ‌రేణి డ‌బ్బులు వెళ్లాయ‌ని.. ఇప్పుడు కొడంగ‌ల్‌కు వెళ్తున్నాయ‌ని విమ‌ర్శించారు. సింగ‌రేణిని దోచుకోవ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నార‌ని మండిప‌డ్డారు. సోమ‌వారం సింగ‌రేణి భ‌రోసాయాత్ర‌లో భాగంగా కిష‌న్‌రెడ్డి మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

సింగ‌రేణి క‌ష్టాల్లో ఉంది. కార్మికులు ఆందోళ‌న‌తో ఉన్న‌రు అని అండ‌గా ఉండాల‌నే ఆలోచ‌న‌తో మోదీ ప్ర‌భుత్వం ఇచ్చింది. గ్రేడ్‌-8 బొగ్గు ఇక్క‌డ అందుబాటులో ఉంది. ఇది అత్యంత నాణ్య‌మైనది. 40 నుంచి 50 సంవ‌త్స‌రాల వ‌ర‌కు ఇక్క‌డి బొగ్గు దొరుకుతుంది. సింగ‌రేణి ఉత్ప‌త్తి, ఆదాయం ప‌డిపోయింది. కార్మికుల సంఖ్య త‌గ్గుతోంది. ఈరోజు 40 వేల మంది శాశ్వ‌త కార్మికులు ఉన్న‌రు. 30 వేల పైచిలుకు కాంట్రాక్టు కార్మికులు ఉన్న‌రు. వీళ్ల భవిష్య‌త్ కాపాడుకోవాలి. కార్మికుల‌ను కాపాడుకోవాలంటే సింగ‌రేణికి బొగ్గు బ్లాకులు కావాలి. ఈరోజు బొగ్గు బ్లాక్‌ల కోసం సింగ‌రేణి ఎదురుచూస్తోంది. ఈ ప‌రిస్థితి రావ‌డానికి బీఆర్ఎస్ ప్ర‌భుత్వమే కార‌ణం. మ‌న‌కు బొగ్గు బ్లాకులు దొర‌క‌క‌పోవ‌డానికి కార‌ణం కేసీఆర్‌. ఆయ‌న అహంకార‌పూరిత‌మైన చ‌ర్యే. ఇప్పుడున్న కాంగ్రెస్ గానీ, బీఆర్ఎస్ గానీ ఇక్క‌డ రాజ‌కీయాలు చేస్తున్న‌రు. సింగ‌రేణిని ఓటు బ్యాంకుగా చూశారే త‌ప్పా భ‌విష్య‌త్ గురించి ఆలోచ‌న చేయ‌లే అని కిష‌న్‌రెడ్డి మండిప‌డ్డారు.

కేసీఆర్‌ను అడుగుతున్నా.. ప‌దేండ్లు అధికారంలో ఉండి వేలం పాట‌లో పాల్గొన‌లేదు గ‌దా? సాధించిందేందో చెప్పాలి? సింగ‌రేణికి చేసిన మేలేంటో చెప్పాలి. జెన్‌కోకు కేంద్రం క్రాప్టివ్ మైన్ కింద కొన్ని బ్లాకులు ఇస్తే దాన్ని అమ్ముకున్న‌రు. వేల కోట్ల రూపాయ‌ల‌కు అమ్ముకున్న‌డు కేసీఆర్‌. రెండు బ్లాకులు వేలానికొస్తే సింగ‌రేణి పాల్గొన‌కుండా ఆరోజు కేసీఆర్ అడ్డుకున్న‌డు. అవి ప్రైవేట్ వాళ్లు తీసుకున్న‌రు. సింగ‌రేణి రెండు ప‌నులు చేస్త‌ది. ఒక‌టి బొగ్గు ఉత్ప‌త్తి, రెండోది విద్యుత్తు. విద్యుత్ ఉత్ప‌త్తికి క్రాప్టివ్ మైన్ కింద ఒడిశాలో నైని కోల్ బ్లాక్ తెలంగాణ విద్యుత్ అవ‌స‌రాల కోసం సింగ‌రేణికి ఇవ్వ‌డం జ‌రిగింది. అక్క‌డున్న న‌వీన్ ప‌ట్నాయ‌క్ ప్ర‌భుత్వం స‌హ‌కారం అందించ‌లే.

కేసీఆర్‌ నైని కోల్ బ్లాక్ ప‌ర్మిష‌న్ అడ‌గ‌లే..

టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్ చేస్తున్నా అని చెప్పి కేసీఆర్ న‌వీన్‌ప‌ట్నాయ‌క్‌తో మాట్లాడిండు. నువ్ నా చేతి కింద ప‌ని చేయ్ అని అడిగిండు. దేశానికి ప్ర‌ధాని అయితా.. జాతీయ పార్టీ పెడ‌తా అని ఆయ‌న‌తో మాట్లాడ‌డానికి వెళ్త‌డు. కానీ ఆ స‌మ‌యంలో నైని కోల్ బ్లాక్ ప‌ర్మిష‌న్ అడ‌గ‌డు. అనుమ‌తులు తీసుకోడు. చివ‌ర‌కు ఒడిశాలో బీజేపీ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత మోదీ సీఎంతో మాట్లాడి నైటి కోల్ బ్లాక్ అనుమ‌తులు తీసుకున్న‌డు. ఇప్పుడు అక్క‌డ టెండ‌ర్ వేస్తే అది ర‌ద్ద‌యిపోయింది. టీవీల్లో, ప‌త్రిక‌ల్లో రాయించి నైని కోల్ బ్లాక్ ను ఆపేశారు. ఈరోజు కాంట్రాక్ట్ బేస్ కింద ప‌ని జ‌రుగుతుంది. సింగ‌రేణికి ఆదాయం వ‌స్త‌ది. సంతోషంగా ఉంది.

అప్పుడు కిర‌ణ్‌కుమార్‌రెడ్డి కూడా ఢిల్లీకి ఉత్త‌రం రాసిండు మాకు తాడిచ‌ర్ల కావాల‌ని. కానీ కార్య‌రూపం దాల్చ‌లే. ఈరోజు స‌గ‌ర్వంగా చెబుతున్నా. కోల్ శాఖ మంత్రిగా మోదీని కలిసి సింగ‌రేణి క‌ష్టాల్లో ఉంది అని చెప్పాను. ఆదుకోవాల‌ని కోరాను. న్యాయ‌శాఖ అనుమ‌తులు తీసుకొని సింగ‌రేణికి తాడిచ‌ర్ల‌-2ను కేటాయించామ‌ని చెప్ప‌డానికి గ‌ర్వంగా ఉంది. అంద‌రి త‌ర‌ఫున మోదీకి ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నా. 100 శాతం కాంగ్రెస్‌, బీఆర్ఎస్ పెత్త‌నం ఉంట‌ది ఇక్క‌డ. కేంద్రంది 49 శాతం వాటా ఉంది వాళ్ల ఒపీనియ‌న్ తీసుకోవాల‌ని ఏరోజు అనుకోరు. ఈరోజు బొగ్గు మాయం అయింద‌ని హ‌రీశ్ రావు, కేటీఆర్ నాకు ఉత్త‌రాలు రాస్తున్న‌రు.

రాష్ట్ర ప్ర‌భుత్వం ఏమ‌న్నా గొడ్డు వోయిందా?

సింగ‌రేణిని బంగారు బాతు గుడ్డు లెక్క చూస్తూ కాంగ్రెస్‌, బీఆర్ఎస్ దోచుకున్నాయి. అప్పుడు ఆయ‌న‌ డ‌బ్బులు సిద్దిపేట‌కు తీసుకెళ్లిండు.. ఇప్పుడు ఈన కొడంగ‌ల్‌కు తీసుకుపోతుండు. ఎవ‌డో మెస్సీ ఆడితో సింగ‌రేణి పైస‌లు తీసుక‌పోయిర్రు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఏమ‌న్నా గొడ్డు వోయిందా? డ‌బ్బుల్లేవా? ఏ డ‌బ్బులు వ‌చ్చినా కార్మికుల‌కు చెందాలి. ఇక్క‌డ భూములు ఇచ్చిన వాళ్ల‌కు చెందాలి. అది వారి హ‌క్కు. ప‌గ‌ల‌న‌కా రాత్ర‌న‌కా బొగ్గు తీసి దేశానికి వెలుగునిస్తున్న‌రు. అందుకే ఇది బొగ్గు కాదు.. బంగారం.

సింగ‌రేణి క‌ష్టాన్ని క‌మీష‌న్ల రూపంలో దోపిడీ చేస్తున్న‌రు. ఏ అధికారిని అడిగినా చెబుతున్న‌రు. 49 శాతం వాటా ఉన్నా మాకు చిన్న ఉద్యోగిని కూడా ట్రాన్స్‌ఫ‌ర్ చేసే అధికారం ఉండదు. చిన్న నిర్ణ‌యంలో కూడా మ‌మ్మ‌ల్నీ భాగం చేయ‌రు. ఏ కార్య‌క్ర‌మం జ‌రిగినా మాకు చెప్ప‌రు. అయినా కూడా మేం కార్మికుల‌కు మేలు చేస్తున్నం. 1999లో సింగ‌రేణి మూత‌ప‌డే ప‌రిస్థితి ఉన్న‌ప్పుడు వాజ్‌పేయి 600 కోట్ల రూపాయ‌లు ఇచ్చి ఆదుకున్న‌డు. ఈరోజు కూడా బీజేపీయే సింగ‌రేణికి అండ‌గా ఉంటుంది అని కేంద్ర‌మంత్రి హామీ ఇచ్చారు.

రేవంత్‌రెడ్డికి కార్మికుల మీద ప్రేమ ఉంటే న్యాయం చేయండి. బీఆర్ఎస్ వాళ్లు ఏమొఖం పెట్టుకొని మాట్లాడుతున్న‌రు. మీ హ‌యాంలో ఎందుకు డబ్బులు ఇవ్వ‌లేదు. విద్యుత్‌, బొగ్గు తీసుకుంట‌రు. సుమారు 25 వేల కోట్లు అప్పు పెట్టి బీఆర్ఎస్ వెళ్లిపోయింది. రేవంత్ ఏమీ త‌క్కువ తిన‌లే. కేసీఆర్ హ‌యాంలో పీన‌గ‌లు తింటే ఇప్పుడు కాంగ్రెస్ హ‌యాంలో ఏనుగులు తింటున్న‌య్‌. వీళ్లు కూడా 26 కోట్ల రూపాయ‌లు అప్పులు పెట్టారు. సింగ‌రేణికి ఇయ్యాల్సిన పైస‌లు ద‌యాదాక్షిణ్యం కాదు.

కాంగ్రెస్ హ‌యాంలో సుప్రీంకోర్టు, కాగ్ ఆడిట్‌లో దోషులుగా తేలిన‌ కాంగ్రెస్ మంత్రులను చూశాం. ఆ స‌మ‌యంలోనే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కాంగ్రెస్ అక్ర‌మంగా బొగ్గు మైన్స్ కేటాయించిందో వాట‌న్నింటిని సుప్రీంకోర్టు ర‌ద్దు చేసింది. భ‌విష్య‌త్‌లో ప్ర‌భుత్వ కంపెనీలైనా, ప్రైవేట్ కంపెనీలైనా పార‌ద‌ర్శ‌క‌త‌తో వేలం ద్వారా బొగ్గు బ్లాక్‌లు ఇవ్వాల‌ని 2014లో సుప్రీం తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్ర‌కారం 11 సంవ‌త్స‌రాలుగా మోదీ ప్ర‌భుత్వం కోల్ ఇండియా కావొచ్చు ఇంకా ఏ కంపెనీలైనా గానీ, రాష్ట్ర‌, కేంద్ర ప్ర‌భుత్వం అయినా గానీ అన్ని కంపెనీల‌కు గూడా ఇవ్వాల‌ని చెప్పింది. కానీ ఈరోజు కొత్తగూడెం గ‌డ్డ నుంచి ఒక‌టి చెబుతున్నా. యాక్ష‌న్ లేకుండా మోదీ ప్ర‌భుత్వ 20 ఏండ్ల త‌ర్వాత ఇచ్చిన మొద‌టి బ్లాక్ ఈ తాడిచ‌ర్ల-2. ఏకైక బ్లాక్ ఇదే.

కేంద్రం త‌ర‌ఫున బొగ్గు కొంటాం. ఎప్ప‌టిక‌ప్పుడు ఎన్‌టీపీ బొగ్గుకు కూడా పైస‌లు చెల్లిస్తున్నం. 54 వేల కోట్ల రూపాయ‌లు తెలంగాణ ప్ర‌భుత్వం సిగ‌రేణికి బాకీ ఉంది. ఇది తెలిసిన ప్ర‌జ‌లు ముక్కున వేలు వేసుకుంటున్న‌రు. భవిష్య‌త్‌లో వేలం పాట‌లో పాల్గొని ఏ బ్లాక్ అయినా సింగ‌రేణికే చెందాలి అని కిష‌న్‌రెడ్డి పేర్కొన్నారు.

Advertisement
Advertisement