త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

High Court Judgment | స్పీకర్ నిర్ణయం ఘోర తప్పిదం.. దానం నాగేందర్ ఇక నుంచి ఎమ్మెల్యే కాదు

High Court Judgment | ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై హైకోర్టు అనర్హత వేటు వేసింది. ఆయన విషయంలో.. స్పీకర్ ప్రకటించిన తీర్పును కొట్టివేసింది. దానం.. ఎమ్మెల్యేగా అర్హుడంటూ.. స్పీకర్ వెలువరించిన తీర్పు ఘోర తప్పిదమని చెప్పింది.

S

Telangana | Published On Sep 18, 2026, 7.08 pm IST

High Court Judgment | స్పీకర్ నిర్ణయం ఘోర తప్పిదం.. దానం నాగేందర్ ఇక నుంచి ఎమ్మెల్యే కాదు
Advertisement
  • 2024 ఏప్రిల్ 23 నుంచే ఆయన ఎమ్మెల్యేగా అనర్హుడు
  • సంచలన తీర్పును ప్రకటించిన తెలంగాణ హైకోర్టు
  • అనర్హతను నిర్ణయించిన బీఫాం

High Court Judgment | త్రినేత్ర.న్యూస్ : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై హైకోర్టు అనర్హత వేటు వేసింది. ఆయన విషయంలో.. స్పీకర్ ప్రకటించిన తీర్పును కొట్టివేసింది. దానం.. ఎమ్మెల్యేగా అర్హుడంటూ.. స్పీకర్ వెలువరించిన తీర్పు ఘోర తప్పిదమని చెప్పింది. ఆయన ఎంపీగా నామినేషన్ వేసిన తేదీ 2024 ఏప్రిల్ 23 నుంచే అమల్లోకి వస్తుందని తీర్పు వెలువరించింది. శుక్రవారం.. చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ ఘౌస్ మీరా మొహియోద్దీన్ లతో కూడిన తెలంగణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ సంచలన తీర్పును ప్రకటించింది.. బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్ని కై, ఆ తర్వాత కాంగ్రెస్‌ తరఫున సికింద్రాబాద్‌ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసిన దానంపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ట్రిబ్యునల్ ఆఫీసర్ హోదాలో స్పీకర్‌ కొట్టివేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.

నేను ఇంకా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నాను

పార్టీ ఫిరాయింపును నిర్ధారించేందుకు అసెంబ్లీ లోపల ఎమ్మెల్యే వ్యవహరించిన తీరును మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలంటూ స్పీకర్‌ వెలువరించిన తీర్పుపై పిటిషనర్లు హైకోర్టులో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మరో పార్టీ తరఫున పోటీచేయడం ద్వారా అసలు పార్టీ పట్ల తన రాజకీయ అనుబంధాన్ని వదులుకున్నట్టు స్పష్టమవుతున్నప్పుడు వేరే ఆధారాల కోసం చూడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. స్పీకర్‌ నిర్ణయం న్యాయపరమైన పరిశీలనకు లోబడి ఉంటుందని, స్పీకర్‌ అధికారాలు అపరిమితమైనవి కావని పిటిషనర్లు వాదించారు.
కాగా, పిటిషనర్ల వాదనలను దానం నాగేందర్‌ తరఫు న్యాయవాది తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన బీఆర్‌ఎస్‌ సభ్యత్వానికి రాజీనామా చేయలేదని, కాంగ్రెస్‌ ప్రాథమిక సభ్యత్వాన్ని తీసుకున్నట్టు ఎక్కడా ప్రకటించలేదని తెలిపారు.

దానం ఇప్పటికీ అసెంబ్లీ రికార్డుల్లో బీఆర్‌ఎస్‌ సభ్యుడిగానే ఉన్నారని చెప్పారు. ఆయన కాంగ్రెస్‌ నేతలను కలవడం, వారితో ఫొటోలు దిగడం, కాంగ్రెస్‌ కండువా ధరించడం లేదా ఆయన కాంగ్రెస్‌లో చేరినట్టు మీడియాలో రావడం లాంటి అంశాలు పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్టు నిర్ధారించేందుకు సరిపోవని పేరొన్నారు. దానం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్‌ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసినంత మాత్రాన అసెంబ్లీ సభ్యత్వం కోల్పోయినట్టు భావించరాదని వాదించారు.ఈ నేపథ్యంలో దానం పై వచ్చిన అనర్హత పిటిషన్ లను స్పీకర్ విచారించి కొట్టిపారేశారు. ఆయన ఇంకా బీఆర్ ఎస్ లోనే ఉన్నట్టు..కాంగ్రెస్ పార్టీలో లేరని ఈ ఏడాది మార్చి 11న తీర్పును వెలువరించారు.

దానం అనర్హతను నిర్ణయించిన బీ ఫాం

2023 డిసెంబర్ లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో బీఆర్ ఎస్ పార్టీ నుంచి ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచిన దానం నాగేందర్.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం 2024 ఏప్రిల్ నెలలో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బీ ఫాం కూడా అందుకొని పోటీ చేశారు. అయితే..ఈ బీ ఫామ్ ఇప్పుడు ఈ కేసులో అత్యంత కీలక సాక్ష్యంగా మారింది. దీని ఆధారంగానే ఆయనను ఎమ్మెల్యేగా అనర్హుడని ప్రకటించింది. అంతేకాదు... బీఆర్ ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగుతూ..కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు నామినేషన్ వేసిన తేదీ.. 2024 ఏప్రిల్ 23 నుంచే దానం.. ఎమ్మెల్యే పదవిలో కొనసాగడానికి అనర్హుడంటూ హైకోర్టు స్పష్టం చేసింది. ఏలేటి మహేశ్వర్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది వివేక్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్ రావు, స్పీకర్ కమ్ ట్రిబ్యునల్ గడ్డం ప్రసాద్ తరపున తులసీ రాజ్ గోకుల్, దానం నాగేందర్ తరపున సీనియర్ న్యాయవాది వెంకటేశ్, గౌరవ్ అగర్వాల్ లు వాదించారు.

Advertisement
Advertisement