త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vemula Prashanth Reddy | ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించిన ప్ర‌భుత్వానికి మంచి గుణ‌పాఠమిది

Vemula Prashanth Reddy | పార్టీ ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించిన కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి హైకోర్టు ఇచ్చిన తీర్పు చ‌క్క‌టి గుణ‌పాఠ‌మ‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. దానం నాగేందర్ అనర్హతపై హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టులాంటిద‌న్నారు.

S

Telangana | Published On Sep 18, 2026, 5.59 pm IST

Vemula Prashanth Reddy | ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించిన ప్ర‌భుత్వానికి మంచి గుణ‌పాఠమిది
Advertisement
  • ఎప్పటికైనా న్యాయ‌మే గెలుస్తుంది
  • హైకోర్టు తీర్పును బీఆర్ఎస్ పార్టీ స్వాగ‌తిస్తోంది
  • మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

Vemula Prashanth Reddy | త్రినేత్ర‌.న్యూస్: పార్టీ ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించిన కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి హైకోర్టు ఇచ్చిన తీర్పు చ‌క్క‌టి గుణ‌పాఠ‌మ‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. దానం నాగేందర్ (Daanam Nagendar) అనర్హతపై హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టులాంటిద‌న్నారు. బీఆర్ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఇతర ఎమ్మెల్యేలకు కూడా న్యాయస్థానంలో భంగపాటు తప్పదని హెచ్చ‌రించారు. ఎన్నటికైనా న్యాయ‌మే గెలుస్తుంద‌ని.. ఈ తీర్పును బీఆర్‌ఎస్‌ పార్టీ స్వాగతిస్తోందని పేర్కొన్నారు. ఈమేర‌కు శుక్ర‌వారం ఆయ‌న మాట్లాడారు.

బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచి, అనంతరం కాంగ్రెస్‌ పార్టీలో చేరి, అదే పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ ఎన్నికల్లో దానం నాగేంద‌ర్ పోటీ చేశారు. దీంతో ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు కీలక పరిణామం. దానం నాగేందర్‌పై అనర్హత పిటిషన్లను తిరస్కరిస్తూ అసెంబ్లీ స్పీకర్‌ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు పక్కన పెట్టింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఈ తీర్పు వెలువరించింది.

ప్రజలు ఒక పార్టీ గుర్తుపై ఓటు వేసి గెలిపించిన తర్వాత, ఆ ప్రజా తీర్పును పక్కనపెట్టి అధికార పార్టీ ప్రలోభాలకు లొంగి పార్టీ మారడం ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసే చర్య. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా వ్యవహరించింది. ఇప్పుడు హైకోర్టు తీర్పుతో పార్టీ ఫిరాయింపుల విషయంలో చట్టం, రాజ్యాంగ నిబంధనలు ఎంత కీలకమో మరోసారి స్పష్టమైంది.

బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఇతర ఎమ్మెల్యేలకు కూడా ఈ తీర్పు ఒక స్పష్టమైన గుణపాఠం. పార్టీ మారి ప్రజల తీర్పును అవమానించిన ప్రతి ఒక్కరూ చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోక తప్పదు. న్యాయస్థానంలో ఇదే గుణపాఠం మిగతా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కూడా తప్పదు.

ప్ర‌జా తీర్పును గౌర‌వించాలి..

పార్టీ ఫిరాయింపుల ద్వారా అధికారాన్ని బలోపేతం చేసుకోవచ్చని అనుకుంటే ఈరోజు హైకోర్టు తీర్పు ఆ విధానంపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలి. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, చట్టాలను గౌరవించాలి. ఇకనైనా కాంగ్రెస్‌ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం మానుకోవాలి. ప్రజల తీర్పును గౌరవించి, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలి. ప్రజల కిచ్చిన హామీలు నెరవేర్చాలి అని వేముల సూచించారు.

Advertisement
Advertisement