త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | బ్లూజె ఏరో స్టార్టప్ ఆవిష్క‌ర‌ణ ఎంతో గ‌ర్వ‌కార‌ణం

KTR | వైమానిక రంగ భవిష్యత్తును సరికొత్తగా మారుస్తున్న టి-హబ్ (T-Hub) ఇంక్యుబేటెడ్ స్టార్టప్ విజయాన్ని చూడటం ఎంతో గర్వంగా ఉందని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌కు చెందిన బ్లూజె ఏరో (BluJ Aero) స్టార్టప్ తన రెండవ తరం (సెకండ్ జనరేషన్) ప్రోటోటైప్ విమానాన్ని ఆవిష్కరించడం సంతోష‌క‌ర‌మ‌న్నారు.

S

Telangana | Published On Jun 28, 2026, 12.58 pm IST

KTR | బ్లూజె ఏరో స్టార్టప్ ఆవిష్క‌ర‌ణ ఎంతో గ‌ర్వ‌కార‌ణం
Advertisement
  • టి-హ‌బ్ అండ‌గా నిల‌వ‌డం సంతోష‌క‌రం
  • సెకండ్ జనరేషన్ ప్రోటోటైప్ విమానంతో వేగ‌వంత‌మైన సేవ‌లు పొందొచ్చు
  • బృందం మ‌రిన్ని ఉన్న‌త శిఖ‌రాలను అధిరోహించాలి
  • ఎక్స్ వేదిక‌గా కేటీఆర్ అభినంద‌న‌లు

KTR | త్రినేత్ర‌.న్యూస్‌: వైమానిక రంగ భవిష్యత్తును సరికొత్తగా మారుస్తున్న టి-హబ్ (T-Hub) ఇంక్యుబేటెడ్ స్టార్టప్ విజయాన్ని చూడటం ఎంతో గర్వంగా ఉందని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఏరోస్పేస్ రంగ భవిష్యత్తును టి-హ‌బ్ స్టార్ట‌ప్ తిర‌గ‌రాస్తుంద‌ని కొనియాడారు. ఇటీవలే హైదరాబాద్‌కు చెందిన బ్లూజె ఏరో (BluJ Aero) స్టార్టప్ తన రెండవ తరం (సెకండ్ జనరేషన్) ప్రోటోటైప్ విమానాన్ని ఆవిష్కరించడం సంతోష‌క‌ర‌మ‌న్నారు. తన eVTOL (ఎలక్ట్రికల్ వర్టికల్ టేక్-ఆఫ్ అండ్ ల్యాండింగ్) లక్ష్యాలను మరింత విస్తరించడంలో ఇది మొద‌టి అడుగుగా ఆయ‌న అభివ‌ర్ణించారు. ఈమేర‌కు ఆదివారం ఎక్స్ వేదిక‌గా కేటీఆర్ స్పందించారు.

బ్లూజె ఏరో సంస్థ స్వల్ప శ్రేణి ప్రయాణాల కోసం హైడ్రోజన్-ఎలక్ట్రిక్, బ్యాటరీతో నడిచే VTOL విమానాలను అభివృద్ధి చేస్తోంది. ఇది సంప్ర‌దాయ‌ విమానాశ్రయాల మౌలిక సదుపాయాలు ఏవీ లేకుండానే ప్ర‌యాణికుల‌ను, కార్గో (సరుకు రవాణా) సేవలను వేగంగా చేర‌వేస్తూ సులభతరం చేస్తుంది. పూర్తిగా హైదరాబాద్‌లోనే తయారైన ఈ బ్లూజె ఏరో సంస్థకు టి-హబ్ అండగా నిలిచింది. టి-హబ్ అందించిన మార్గదర్శకత్వం (Mentorship), మార్కెట్ ప్రాప్యత (Market Access), ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ (Innovation Ecosystem) ఈ సంస్థను వైమానిక రంగంలోనే అగ్రగామి సంస్థగా ఎదగడానికి ఎంతగానో దోహదపడ్డాయి అని కేటీఆర్ కొనియాడారు.

2022లో టి-హబ్ ఫౌండేషన్ డే సందర్భంగా ఈ సంస్థకు ‘మోస్ట్ ప్రామిసింగ్ ఇన్నోవేషన్ అవార్డు’ (అత్యంత ఆశాజనకమైన ఆవిష్కరణ పురస్కారం) అందించిన జ్ఞాపకాలను ఆయ‌న గుర్తు చేసుకున్నారు. బ్లూజె ఏరో బృందం మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సంద‌ర్భంగా వారికి అభినంద‌న‌లు తెలియ‌జేశారు.

Advertisement
Advertisement