త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana SC ST Sub Plan | ఎస్సీ, ఎస్టీలకు గుడ్ న్యూస్: 1,300 ఎకరాల భూమి పంపిణీకి రంగం సిద్ధం

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సచివాలయంలో కీలక సమీక్ష నిర్వహించారు. అందుబాటులో ఉన్న 1,300 ఎకరాల భూమిని అర్హులకు పంచేలా చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు.

J

Telangana | Published On Oct 29, 2026, 7.21 pm IST

Telangana SC ST Sub Plan | ఎస్సీ, ఎస్టీలకు గుడ్ న్యూస్: 1,300 ఎకరాల భూమి పంపిణీకి రంగం సిద్ధం

సంక్షిప్త సారాంశం

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ, ఇంధన, వైద్య, పంచాయతీరాజ్ తదితర శాఖలతో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులపై డిప్యూటీ సీఎం సమీక్ష. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్ల ద్వారా గుర్తించిన సుమారు 1,300 ఎకరాల ఖాళీ భూమిని అర్హులైన పేద కుటుంబాలకు అందించేలా వెంటనే అనుమతులు పూర్తి చేయాలని ఆదేశం. సబ్సిడీ విత్తనాలు, రైతు భరోసా, వ్యవసాయ యాంత్రీకరణ ప్రయోజనాలపై పూర్తిస్థాయి లబ్ధిదారుల వివరాలతో డిజిటల్ డేటా సిద్ధం చేయాలని స్పష్టీకరణ. ఏజెన్సీ ప్రాంతాల్లో మొబైల్ మెడికల్ యూనిట్ల ఏర్పాటు, విద్యుద్దీకరణ, కమ్యూనిటీ హాళ్లు, శ్మశాన వాటికల అభివృద్ధికి కార్యాచరణ సిద్ధం చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వెల్లడి.

Advertisement
  • సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి కీలక నిర్ణయాలు

Telangana SC ST Sub Plan | త్రినేత్ర న్యూస్ : తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ వర్గాల సామాజిక, ఆర్థిక సమగ్ర వికాసానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. సబ్ ప్లాన్ ప్రత్యేక అభివృద్ధి నిధులు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి లబ్ధిదారుడి గడపకూ చేరాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. గురువారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి వ్యవసాయం, ఇంధనం, వైద్యారోగ్యం, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల ఉన్నతాధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

1,300 ఎకరాల భూమిపై క్లారిటీ.. ఇళ్ల స్థలాల కోసం భూసేకరణ

ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ల నుంచి అందిన డేటా ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం సుమారు 1,300 ఎకరాల ప్రభుత్వ ఖాళీ భూమి అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ భూములను త్వరితగతిన వినియోగంలోకి తెచ్చి, అర్హులైన నిరుపేద కుటుంబాలకు అందించేందుకు అవసరమైన అన్ని అనుమతులను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. అలాగే నివాస స్థలాలు లేని ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు స్థలాల కొనుగోలు, అవసరమైతే భూసేకరణ ప్రతిపాదనలను కూడా వెంటనే పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.

Telangana SC ST Sub-Plan Review Bhatti Orders Fast-Tracking of 1300 Acres

రైతు ప్రయోజనాలపై డిజిటల్ ట్రాకింగ్

రైతు భరోసా, సబ్సిడీ విత్తనాలు, వ్యవసాయ యంత్రాల పంపిణీ వంటి పథకాల అమలుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని భట్టి విక్రమార్క చెప్పారు. భూమి ఉన్న రైతులతో పాటు ఎస్సీ రైతులందరికీ పూర్తి ప్రయోజనం అందేలా నిబంధనల్లో మార్పులు అవసరమైతే ప్రత్యేక పథకాల ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. పథకాల వారీగా లబ్ధి పొందిన రైతుల పేర్లు, గ్రామాలు, సామాజిక వర్గాల వివరాలను పక్కాగా ధ్రువీకరించి, డేటాను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని స్పష్టం చేశారు.

నియోజకవర్గానికో కమ్యూనిటీ హాల్.. ఏజెన్సీలో మొబైల్ క్లినిక్‌లు

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ ప్రజల అవసరాలకు అనుగుణంగా కమ్యూనిటీ హాళ్లు, వైకుంఠ ధామాలు (శ్మశాన వాటికలు) నిర్మించాలని, మౌలిక వసతులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు.

Telangana SC ST Sub-Plan Review Bhatti Orders Fast-Tracking of 1300 Acres

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ.. గిరిజన గూడేలు, ఎస్సీ కాలనీల్లో విద్యుత్ స్తంభాలు, కొత్త వైరింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాల్లో అత్యవసర వైద్య సేవల విస్తరణకు వీలుగా 'మొబైల్ మెడికల్ యూనిట్లు' ఏర్పాటు చేసే ప్రతిపాదనలను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.

ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ప్రభుత్వ సీనియర్ ఉన్నతాధికారులు నవీన్ మిట్టల్, సందీప్ కుమార్ సుల్తానియా, సురేంద్ర మోహన్, సిక్తా పట్నాయక్, క్రిస్టినా, విజయేంద్ర బోయి, గోపి, గుగులోతు రవి నాయక్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement