త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kodanda Reddy | 24 గంట‌ల క‌రెంట్ అవ‌స‌ర‌మే లేదు.. 3 గంట‌ల క‌రెంట్ చాలు : కోదండ రెడ్డి

Kodanda Reddy | తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి 24 గంట‌ల క‌రెంట్ అవ‌స‌ర‌మే లేదు.. 3 గంట‌ల క‌రెంట్ చాలు అని కాంగ్రెస్ నేత, రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి పేర్కొన్నారు. రైతు డిస్కం నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్నామ‌ని, దీని వ‌ల్ల రైతుల‌కు మేలు జ‌రుగుతుంద‌ని ఆయ‌న అన్నారు.

S

Telangana | Published On May 29, 2026, 6.15 pm IST

Kodanda Reddy | 24 గంట‌ల క‌రెంట్ అవ‌స‌ర‌మే లేదు.. 3 గంట‌ల క‌రెంట్ చాలు : కోదండ రెడ్డి
Advertisement

Kodanda Reddy | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి 24 గంట‌ల క‌రెంట్ అవ‌స‌ర‌మే లేదు.. 3 గంట‌ల క‌రెంట్ చాలు అని కాంగ్రెస్ నేత, రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి పేర్కొన్నారు. రైతు డిస్కం నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్నామ‌ని, దీని వ‌ల్ల రైతుల‌కు మేలు జ‌రుగుతుంద‌ని ఆయ‌న అన్నారు. రైతు డిస్కంపై టీజీఈఆర్సీ నిర్వ‌హించిన బ‌హిరంగ విచార‌ణ స‌మావేశానికి కోదండ రెడ్డి హాజ‌రై కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.

కోదండ రెడ్డి అభిప్రాయం.. ఆయ‌న మాట‌ల్లోనే..

తెలంగాణ రైతాంగం ఇబ్బందులు ప‌డుతున్నారు.. తెలంగాణ ప్రాంతంలో ఒకప్పుడు మోట‌బావులు, గొలుసుక‌ట్టు చెరువులు వీటి ద్వారా నీరు తోడుకుని వ్య‌వ‌సాయం చేసేవారు. ఆ ర‌కంగా దేశానికి ఆహారం అందించి నెహ్రూ లాంటి పెద్ద‌ల చేత రైతు దేశానికి వెన్నెముక, రైతు అన్న‌దాత అని ప్ర‌శంసించిన సంద‌ర్భాల‌ను గుర్తు చేస్తున్నాను. ఈ రోజు తెలంగాణ రైతు విద్యుత్ పంపిణీ సంస్థ ఏర్పాటు చేయ‌మ‌ని మా ప్ర‌భుత్వం క‌మిష‌న్‌కు ద‌ర‌ఖాస్తు పెట్టుకున్న సంద‌ర్భంగా ఈ వ్య‌వ‌స్థ ఏర్పాటు చేయ‌డ‌మ‌నేది ఒక రైతుగా, తెలంగాణ వ్య‌వ‌సాయ రైతు క‌మిష‌న్ చైర్మ‌న్‌గా నేను స‌మ‌ర్థిస్తున్నాను. దీంట్లో ఏదైనా ఒక వ్య‌వ‌స్థ కొత్త‌గా ఏర్పాటు చేసిన‌ప్ప‌డు అన్ని సంపూర్ణంగా ఏర్పాటు చేయ‌లేం. అందులో అనేక అవ‌క‌త‌వ‌క‌లు ఉంటాయి. అనుభ‌వ‌రీత్యా స‌రిచేసుకుంటూ పోతాం. విద్యుత్ పంపిణీ సంస్థ‌లో ఏవైనా లోపాలుంటే స‌రిదిద్దుకునేందుకు అవ‌కాశం ఉంది. ఆ సూచ‌న‌లు చేయ‌మ‌ని మ‌న‌వి చేస్తున్నా అని కోదండ రెడ్డి పేర్కొన్నారు.

ఉచిత విద్యుత్ ఇస్తామ‌ని మాట ఇవ్వ‌డం జ‌రిగింది..

ఇంకో నేప‌థ్యం.. స‌మైక్య‌ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో కూడా రైతులు విద్యుత్ అవ‌స‌రాల విష‌యంలో అనేక ఇబ్బందులు ప‌డ్డారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రైతాంగం త‌న బిల్లు క‌ట్ట‌లేద‌నో, లేక‌పోతే బావుల ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి మీట‌ర్లు లాక్కొని పోయిన‌ప్పుడు పెద్ద స‌మ‌స్య అయింది. రైతుమీద పోలీసులు దూసుకుప‌డ్డారు. అనేక‌మైన ఇబ్బందులు వ‌చ్చాయి. దాని త‌ర్వాత కాంగ్రెస్ పార్టీ, ఉభ‌య క‌మ్యూనిస్టు పార్టీలు కూడా బ‌షీర్‌బాగ్‌లో నిర‌స‌న తెలిపే సంద‌ర్భంగా విద్యుత్ విష‌యంలో ఆనాడు జ‌రిగిన ఉదంతం విష‌యంలో ఈ మూడు పార్టీలు వ్య‌తిరేకించాయి. అప్ప‌టికే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌తిప‌క్షంలో ఉంది. టీడీపీ అధికారంలో ఉంది. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడే ఆనాటి ప్ర‌తిప‌క్ష నేత‌ ఆ ఉద్య‌మంలో పాల్గొని వారం రోజులు ఎమ్మెల్యే క్వార్ట‌ర్స్‌లో నిర‌స‌న తెలిపి త‌ర్వాత మేం అధికారంలోకి వ‌స్తే రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇస్తామ‌ని మాట ఇవ్వ‌డం జ‌రిగింది. విద్యుత్ అవ‌స‌రం రాష్ట్ర రైతాంగానికి ఇంత ఉత్త‌మ‌మైన ఒక అవ‌స‌రంగా ఉన్న‌ప్పుడు సీఎంలు గ్ర‌హించారు. దేశంలో గ్ర‌హించారు. ఆ ర‌కంగా మేనిఫెస్టోలో పెడితే ప్ర‌జ‌లు ఆశీర్వ‌దించి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువ‌చ్చారు. ఎల్‌బీ స్టేడియం వేదిక‌గా విద్యుత్ ఉచితంగా ఇస్తామ‌ని తొలి సంత‌కం చేశారు. రైతాంగం మీద ఉన్న కేసులు విత్ డ్రా చేసుకున్నారు. రూ. 1250 కోట్లు విద్యుత్ బ‌కాయిలు మాఫీ చేశాం. అది కాంగ్రెస్ పార్టీ రైతాంగానికి విద్యుత్ విష‌యంలో చేసిన స‌హాయం అని ఆయ‌న తెలిపారు.

ఈ రాష్ట్రంలో రైతాంగానికి బేడీలు వేసింది వారే

వ్య‌వ‌సాయం, విద్యుత్ విష‌యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడ‌ల్లా అనేక సంస్క‌ర‌ణ‌లు చేసింది. కానీ కొంద‌రు నేత‌లు మాట్లాడుతూ మా ప్ర‌భుత్వాన్ని త‌ప్పుబ‌ట్టారు. రైతాంగం గురించి ఈ రోజు మాట్లాడే నైతిక హ‌క్కు వారికి లేదు. ఈ రాష్ట్రంలో రైతాంగానికి బేడీలు వేసింది వారే. ఆ బేడీలు వేసిన పెద్ద‌లు ఈరోజు రైతాంగం గురించి మాట్లాడ‌డం విచిత్రంగా ఉంది. 2014లో రాష్ట్రం ఏర్ప‌డ్డ త‌ర్వాత విద్యుత్ రంగం ఎట్ల అప్పుల పాలైంది. రాష్ట్రంలో ఈ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత విద్యుత్ అవ‌స‌రం ఎంత పెరిగింది అనేది మా నేత‌లు వివ‌రంగా చెబుతారు అని కోదండ‌రెడ్డి తెలిపారు.

3 గంట‌ల క‌రెంట్ వాడుకుంటే చాలు.. చివ‌రి మ‌డి వ‌ర‌కు నీళ్లు పోతాయి..

తెలంగాణ‌లో ఆనాటి నుంచి నేటి వ‌ర‌కు వ్య‌వ‌సాయ‌మే ప్ర‌ధానం. వ్య‌వ‌సాయ రంగంలో భూమి హ‌క్కు కానీ, రైతుకు త‌న పండించే పంట‌కు గ్యారెంటీ కానీ, అన్ని విధాలా ఈ ప్ర‌భుత్వం ఆదుకుంటున్న‌ది. నేను రైతుగా.. మోట కొట్టిన‌.. త‌ర్వాత ఆయిల్ ఇంజిన్ పెట్టుకున్నాం. క‌రెంట్ మోటార్ కూడా పెట్టుకున్నాం. 24 గంట‌ల క‌రెంట్ అవ‌స‌రం లేదు. ప్ర‌స‌ర‌మైతుంటే చాలు.. తీగ‌ల‌పై క‌రెంట్ ఉంటే చాలు.. కానీ మోటారు 24 గంట‌లు పెట్టాల్సిన అవ‌స‌ర‌మే లేదు. త‌న పొలానికి మ‌హా అంటే 3 గంట‌ల క‌రెంట్ వాడుకుంటే చాలు.. చివ‌రి మ‌డి వ‌ర‌కు నీళ్లు పోతాయి.. ఈ ర‌కంగా వ్య‌వ‌సాయం ఇప్ప‌టికీ సాగుతుంది. దీని విష‌యంలో రైతాంగాన్ని త‌ప్పుదోవ ప‌ట్టిస్తూ అదే ప‌నిగా ప్ర‌చారం చేస్తున్నారు మీట‌ర్లు పెడుతార‌ని, జైల్లో పెడుతార‌ని.. ప్ర‌తిప‌క్షంలో రాగానే రైతుల‌ను రెచ్చ‌గొట్టి మాట్లాడ‌డం స‌రికాదు. క‌మిష‌న్ వ‌ద్ద‌కు వ‌చ్చి ఆవిధంగా మాట్లాడ‌డం బాధ్య‌తారాహిత్యం. క‌మిష‌న్‌కు ప్ర‌తిప‌క్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా.. ప్ర‌తి ఏడాది ఇక్క‌డికి మేం వ‌చ్చి రైతుల గురించి మాట్లాడిన సంద‌ర్భాలు ఉన్నాయని కోదండ రెడ్డి గుర్తు చేశారు.

ఇది తెలంగాణ రైతాంగానికి సంబంధించిన స‌మ‌స్య‌..

రాష్ట్రంలో రైతుల‌కు విద్యుత్ క‌నెక్ష‌న్లు ఎన్ని ఉన్నాయో తెలియ‌దు.. ఇబ్బంది అవుతుంది. ప్ర‌తిపాద‌న పెట్టాం విద్యుత్ డిపార్ట్‌మెంట్‌కు లెక్క‌లు పెట్టాల‌ని అంటే రెండేండ్ల‌కు ఆ విధంగా లెక్క‌లు తీశారు. బోరు బావికి 30 ఛార్జీ చేయండి అని చెప్పాం. ఆ బిల్లు కూడా ఇంటికే వ‌స్తుంది.. ఆ ర‌కంగా ఆ రోజు క‌మిష‌న్ ముందు విద్యుత్ డిపార్ట్‌మెంట్‌ను డిమాండ్ చేయ‌డం వ‌ల్ల 29 ల‌క్ష‌ల 8 వేల క‌నెక్ష‌న్లు ఉన్న‌ట్టు మీరు తేల్చారు. లేక‌పోతే అది కూడా తెలిసేది కాదు. కాంగ్రెస్ పార్టీకి కుర్చీ మీద ఉన్న‌ప్పుడు ఒక మాట, లేన‌ప్పుడు ఒక మాట్లాడే చ‌రిత్ర లేదు. అనేక సంస్క‌ర‌ణ‌లు తీసుకొచ్చాం. ఇది కూడా ఒక సంస్క‌ర‌ణ‌గా భావిస్తున్నాను. త‌ప్పులుంటే సరిదిద్దుకుందాం.. దీన్ని రాజ‌కీయం చేయొద్దు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు మ‌మ్మ‌ల్ని లోప‌లికి రానివ్వ‌లేదు. అరెస్టు చేసేందుకు త‌యారయ్యారు పోలీసులు. అలాంటి వ్య‌వ‌స్థను చూశాం. క‌మిష‌న్‌ను స‌రిగ్గా ప‌ని చేయ‌నియ్య‌లేదు. మీటింగ్ అయ్యే ప‌రిస్థితి లేదు. ఇక్క‌డ ఆ మాట మాట్లాడ‌డం, ఏసీ రూముల్లో నిర్ణ‌యం చేస్తున్నార‌న‌డం స‌రికాదు.. వ్య‌వ‌స్థ‌కు గౌర‌వం ఇవ్వండి. ఇది తెలంగాణ రైతాంగానికి సంబంధించిన స‌మ‌స్య‌. ఒక విధంగా ఇది గ‌ర్వ‌కార‌ణంగా భావిస్తున్నా. విద్యుత్ పంపిణీ సంస్థ ఉండ‌డం అవ‌స‌ర‌మే. ఎందుకంటే ఆనాడు రైతుల మీద లాఠీఛార్జీలు జ‌రిగాయి. ఫైరింగ్ జ‌రిగాయి. ఇవ‌న్నీ దృష్టిలో పెట్టుకుంటే.. ఇలాంటి వ్య‌వ‌స్థ ఉంటే దీనివ‌ల్ల తెలంగాణ రైతాంగానికి ఏ అవ‌స‌రమున్నా.. వ్య‌వ‌స్థ ద‌గ్గ‌ర‌కు రావ‌డానికి, ప్ర‌శ్నించ‌డానికి అవ‌కాశం ఉంటుంది. కాంగ్రెస్ ప్ర‌భుత్వం మంచి ఆలోచ‌న‌తో ముందుకు వ‌చ్చింది. సీఎం రేవంత్ రెడ్డికి రైతాంగం అంటే ఇష్టం. ఆయ‌న‌కు అర‌మ‌రిక‌లు ఉండ‌వు.. ఆయ‌న‌ను త‌ప్పుప‌ట్టడం స‌రికాదు అని కోదండ‌రెడ్డి అన్నారు.

Advertisement
Advertisement