ఎక్స్‌క్లూజివ్: సీఎం ₹11 వేల కోట్లు ఇచ్చామన్నారు.. ఆర్టీసీ ఎండీ లేఖలో మాత్రం ₹2,607 కోట్లు బకాయి!
ఒకవైపు సీఎం గ్రాండ్ స్టేట్‌మెంట్స్.. మరోవైపు ఆర్టీసీ ఎండీ సంచలన లేఖ! వెయ్యి రోజుల పాలనలో వెలుగులోకి వచ్చిన ఈ ‘పదకొండు వేల కోట్ల’ మిస్టరీ ఏంటి?"
సంక్షిప్త సారాంశం
"సీఎం సభల్లో చెప్పే లెక్కలకు.. ఆర్టీసీ ఎండీ సచివాలయానికి పంపిన ‘సీక్రెట్ లెటర్’ లోని అంకెలకూ అసలు పొంతనే లేదు! బస్సు నడవాలంటే నెలకు రూ. 400 కోట్లు ఇచ్చి తీరాల్సిందేనని ఎండీ రాసిన లేఖ ఇప్పుడు పెను సంచలనం రేపుతోంది."
1,000 రోజుల పాలన సంబరాల్లో సర్కార్.. రూ. 2,607 కోట్ల బకాయిల్లో ఆర్టీసీ!
(త్రినేత్ర ఎక్స్‌క్లూజివ్ స్టోరీ)
చనిపోయినా అందని గ్రాట్యుటీ.. రోడ్డున పడుతున్న రిటైర్డ్ ఉద్యోగులు!
రూ. 1,771.88 కోట్ల బకాయిల కోసం హైకోర్టును ఆశ్రయించిన బాధితులు
నెలకు రూ. 400 కోట్లు ఇచ్చి ఆదుకోవాలని ఆర్టీసీ ఎండీ సంచలన లేఖ!
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ప్రభుత్వానికి రాసిన అధికారిక లేఖ త్రినేత్ర వద్దకు చేరింది.
ఆగస్టు 13న కూకట్‌పల్లి సభలో, ఇటీవల మూసారాంబాగ్–అంబర్‌పేట వంతెన ప్రారంభోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి పదేపదే ‘మహిళల ఉచిత ప్రయాణానికి రూ. 11 వేల కోట్లు చెల్లించాం’ అని చెబుతుంటే… అదే సమయంలో ఆర్టీసీ ఎండీ సచివాలయానికి రాసిన అధికారిక లేఖలో ‘మాకు ఇంకా రూ. 2,607.40 కోట్లు రావాలి’ అని రాశారు.
ప్రభుత్వం సకాలంలో రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో ఆర్టీసీ తీవ్రమైన నగదు కొరతలో (Cash Flow Deficit) కూరుకుపోయింది. ఏకంగా రూ. 2,607.40 కోట్లు బకాయి పడటంతో, దశాబ్దాల పాటు సంస్థను నమ్ముకుని పనిచేసిన విశ్రాంత ఉద్యోగుల కడుపు కొడుతోంది. "మా వద్ద నిధులు లేవు.. బకాయిలు తీర్చలేకపోతున్నాం" అని ఆర్టీసీ యాజమాన్యమే స్వయంగా సచివాలయానికి లేఖ రాయడం రవాణా శాఖలో పెను సంచలనం సృష్టిస్తోంది.
అధికారిక లేఖ వివరాలు:
లేఖ నంబర్: No.B&F/F2/52(2)/2026-27-FD
తేదీ: 03.08.2026
ఎవరి నుండి: వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ (VC & MD), TGSRTC, బస్ భవన్, ముషీరాబాద్.
ఎవరికి: ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రవాణా శాఖ, తెలంగాణ సచివాలయం, హైదరాబాద్.
ఉచిత ప్రయాణాల బకాయిలు: ఏటా ఎంత ఖర్చు? ప్రభుత్వం ఇచ్చింది ఎంత? పెండింగ్ ఎంత?
09.12.2023 నుండి 31.07.2026 వరకు ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ప్రయాణించిన టికెట్ల విలువ మొత్తం రూ. 11,707.09 కోట్లు. కానీ ప్రభుత్వం ఆర్టీసీకి విడుదల చేసింది కేవలం రూ. 9,099.69 కోట్లు మాత్రమే. ప్రభుత్వం ప్రతి నెలా ఇస్తున్న రూ. 300 కోట్ల బడ్జెట్ సాయం పెరిగిన ఉచిత ప్రయాణ ఖర్చులకు ఎంతమాత్రం సరిపోకపోవడమే ఈ భారీ వ్యత్యాసానికి కారణం.
ప్రతీ ఏడాది ఆర్టీసీకి అయిన ఖర్చు (టికెట్ల విలువ), ప్రభుత్వం ఇచ్చిన నిధులు, నిలిచిపోయిన బకాయిల వివరాలు:
2023-24 (డిసెంబర్ 23 - మార్చి 24): ఈ కాలంలో మహిళా ప్రయాణికుల ఉచిత టికెట్ల విలువ రూ. 1,163.07 కోట్లు కాగా, ప్రభుత్వం విడుదల చేసింది రూ. 1,045.00 కోట్లు. మిగిలిన బకాయి రూ. 118.07 కోట్లు.
2024-25 ఆర్థిక సంవత్సరం: ఈ సంవత్సరంలో ఉచిత టికెట్ల ఖర్చు రూ. 4,122.79 కోట్లకు చేరగా, ప్రభుత్వం ఇచ్చింది రూ. 3,616.30 కోట్లు మాత్రమే. నిలిచిపోయిన బకాయి రూ. 506.49 కోట్లు.
2025-26 ఆర్థిక సంవత్సరం: ఈ ఏడాది ఉచిత టికెట్ల బిల్లు ఏకంగా రూ. 4,755.26 కోట్లకు పెరిగింది. కానీ ప్రభుత్వం చెల్లించింది రూ. 3,850.45 కోట్లు. పెండింగ్ బకాయి రూ. 904.81 కోట్లు.
2026-27 (జూలై 2026 వరకు): కేవలం ఈ నాలుగు నెలల్లోనే (ఆన్‌లైన్ బడ్జెట్ వివరాల ప్రకారం) ఉచిత టికెట్ల ఖర్చు రూ. 1,665.97 కోట్లు కాగా, ప్రభుత్వం విడుదల చేసింది రూ. 587.94 కోట్లు మాత్రమే. మిగిలిన భారీ బకాయి రూ. 1,078.03 కోట్లు.
మొత్తం లెక్క (Total): 09.12.2023 నుండి 31.07.2026 వరకు ఆర్టీసీకి రావలసిన మొత్తం ఉచిత టికెట్ల విలువ రూ. 11,707.09 కోట్లు కాగా, ఖజానా నుండి ఆర్టీసీ ఖాతాలో పడింది రూ. 9,099.69 కోట్లు మాత్రమే. ప్రభుత్వం పెట్టిన నికర బకాయి రూ. 2,607.40 కోట్లు.
సీఎం పదేపదే చెబుతున్న ₹11 వేల కోట్లు.. ఆర్టీసీకి వచ్చింది ₹9,099 కోట్లే!
వివిధ బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న ప్రకటనలకు, ఆర్టీసీ ఎండీ లేఖలోని ఈ అధికారిక లెక్కలకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు:
ఆగస్టు 13న కూకట్‌పల్లి సభలో సీఎం మాటలు: "పొన్నం ప్రభాకర్‌కు రూ. 12 వేల కోట్లు కట్టాను."
మూసారాంబాగ్–అంబర్‌పేట వంతెన ప్రారంభోత్సవ సభలో సీఎం మాటలు: "32 నెలల్లో రూ. 11 వేల కోట్లు చెల్లించాం. మీరు ఎక్కిన ప్రతి బస్సుకు మీ తమ్ముడు పైసలు కడుతున్నాడు."
కానీ ఆర్టీసీ ఎండీ లేఖ ప్రకారం ప్రభుత్వం ఆర్టీసీకి ఖజానా నుండి విడుదల చేసింది కేవలం రూ. 9,099.69 కోట్లు మాత్రమే. తేడా ఏకంగా రూ. 1,900 కోట్లకు పైగా ఉంది. సీఎం చెప్తున్న సంఖ్య మహిళలు పొందిన ఉచిత ప్రయాణాల మొత్తం టికెట్ విక్రయం విలువకు (రూ. 11,707.09 కోట్లు) దగ్గరగా ఉందే తప్ప... ప్రభుత్వం ఆర్టీసీకి నిజంగా ఇచ్చిన నగదు కాదని ఈ స్పష్టమైన లెక్కలు వెల్లడిస్తున్నాయి.
రిటైర్డ్ ఉద్యోగుల కన్నీళ్లు: రూ. 1,771.88 కోట్ల బెనిఫిట్స్ పెండింగ్!
ప్రభుత్వం నుంచి సకాలంలో రీయింబర్స్‌మెంట్ నిధులు రాకపోవడంతో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన హక్కులను ఆర్టీసీ నిలిపివేసింది. లేఖలో పేర్కొన్న వివరాలు:
RPS-2017 బకాయిలు: రూ. 1,251.00 కోట్లు
గ్రాట్యుటీ & TLE వ్యత్యాసాలు (2017-2024): రూ. 312.00 కోట్లు
లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ (అక్టోబర్ 2024 - మే 2026): రూ. 135.02 కోట్లు
ఇటీవలి గ్రాట్యుటీ (ఫిబ్రవరి - జూన్ 2026): రూ. 73.86 కోట్లు
మొత్తం పెండింగ్: రూ. 1,771.88 కోట్లు
ప్రాణాలు పోతున్నా దక్కని పారితోషికం!
"న్యాయంగా దక్కాల్సిన హక్కుల కోసం రిటైర్డ్ ఉద్యోగులు నిత్యం ఆందోళనలు చేస్తున్నారు. చాలామంది తమ జీవితకాలంలో రూపాయి కూడా కళ్లజూడకుండానే, గ్రాట్యుటీ అందుకోకుండానే కన్నుమూస్తున్నారు" అని లేఖలో ఎండీ వ్యక్తంచేసిన ఆవేదన క్షేత్రస్థాయి దయనీయ స్థితికి అద్దం పడుతోంది. అంతేకాదు, RPS-2017, RPS-2021 బకాయిలు, గ్రాట్యుటీ వ్యత్యాసాలతో పాటు RPS-2013, 2017, 2021ల వేతన సవరణ వివరాలను పీఎఫ్ (PF) అథారిటీలకు సమర్పించకపోవడంతో ఉద్యోగుల పీఎఫ్ ప్రయోజనాలు కూడా నిలిచిపోయాయి. దీంతో 139 మందికి పైగా మాజీ ఉద్యోగులు ఇప్పటికే హైకోర్టును (WP No.23771/2026, 23899/2026 తదితరాలు) ఆశ్రయించారు.
నెలకు రూ. 400 కోట్లు ఇస్తేనే మనుగడ
గతంలో ఫిబ్రవరి, మార్చి 2026 నెలల్లో ప్రత్యేకంగా రూ. 500 కోట్లు విడుదల చేయాలని కోరినా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. ప్రస్తుతం ఇస్తున్న రూ. 300 కోట్ల బడ్జెట్ సాయం ఎంతమాత్రం సరిపోవడం లేదని, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు తీర్చేందుకు ప్రతి నెలా అదనంగా మరో రూ. 100 కోట్లు కలిపి మొత్తం రూ. 400 కోట్లు విడుదల చేయాలని లేఖలో ఆర్టీసీ ఎండీ ప్రభుత్వాన్ని స్పష్టంగా కోరారు.
నిజమేంటి? లెక్క తేలుతుందా?
ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి కూకట్‌పల్లి, మూసారాంబాగ్ సభల్లో ‘రూ. 11 వేల కోట్లు ఇచ్చేశాం’ అని చెప్తుంటే… మరోవైపు ఆర్టీసీ ఎండీ అధికారికంగా ‘మాకు రూ. 2,607 కోట్లు రావాలి’ అని లేఖ రాశారు. అసలు సీఎం చెప్పిన మాటల్లో నిజమెంత? ఆర్టీసీ ఎండీ లేఖలోని వాస్తవాలేంటి? ఒకవైపు వెయ్యి రోజుల పాలన సంబరాలు జరుపుతున్న సర్కార్.. ఆర్టీసీ లెక్క ఇప్పటికైనా తేలుస్తుందా? రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ బకాయిల లెక్కలు సరిచూస్తారా? లేదా గ్రాట్యుటీ అందక విశ్రాంత ఉద్యోగులు కన్నుమూస్తున్న దయనీయ పరిస్థితులే కొనసాగుతాయా?
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Telangana Political Survey 2026 | కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై సర్వే: షాకింగ్ రిపోర్ట్
- ●Bus Rape Case | మీ వైఫల్యాలను ఇంకెంతకాలం కప్పిపుచ్చుకుంటారు? ఢిల్లీ, యూపీ ప్రభుత్వాలను నిలదీసిన రాహుల్
- ●Tollywood | హిట్ అండ్ రన్ కేసులో ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు అరెస్ట్
- ●Employees Protest | సెక్రెటేరియట్ వద్ద ఉద్యోగుల భారీ నిరసన.. డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు
- ●P Chidambaram | డెమోక్రసీ ఇండెక్స్‌లో భారత్ ర్యాంకు పతనం
- ●HMD India | స్మార్ట్‌ఫోన్ లేకున్నా యూపీఐ పేమెంట్స్.. హెచ్ఎండీ కొత్త సదుపాయం..

Telangana Political Survey 2026 | కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై సర్వే: షాకింగ్ రిపోర్ట్

Bus Rape Case | మీ వైఫల్యాలను ఇంకెంతకాలం కప్పిపుచ్చుకుంటారు? ఢిల్లీ, యూపీ ప్రభుత్వాలను నిలదీసిన రాహుల్

Tollywood | హిట్ అండ్ రన్ కేసులో ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు అరెస్ట్

Employees Protest | సెక్రెటేరియట్ వద్ద ఉద్యోగుల భారీ నిరసన.. డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు



