త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

HYD Police | శాంతిభద్రతలు, దర్యాప్తు విభజనకు శ్రీకారం

HYD Police | శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల దర్యాప్తు విధులను వేర్వేరు చేయడంలో భాగంగా హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనరేట్‌ కీలక ముందడుగు వేసింది. సంక్లిష్టమైన, తీవ్రమైన నేరాల దర్యాప్తు కోసం ప్రత్యేకంగా ‘జోనల్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్రాంచ్‌’ను అందుబాటులోకి తెచ్చింది. పైలట్‌ ప్రాజెక్టుగా గోల్కొండ జోన్‌లో ఏర్పాటు చేసిన ఈ విభాగాన్ని నగర పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనర్‌ మంగళవారం మొహిదీపట్నంలోని గోల్కొండ జోన్‌ డీసీపీ కార్యాలయ ప్రాంగణంలో ప్రారంభించారు.

P

Hyderabad | Published On Oct 27, 2026, 7.40 pm IST

HYD Police | శాంతిభద్రతలు, దర్యాప్తు విభజనకు శ్రీకారం
Advertisement
  • గోల్కొండ జోన్‌లో జోనల్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్రాంచ్‌ ప్రారంభం
  • పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టిన హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌

HYD Police | శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల దర్యాప్తు విధులను వేర్వేరు చేయడంలో భాగంగా హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనరేట్‌ కీలక ముందడుగు వేసింది. సంక్లిష్టమైన, తీవ్రమైన నేరాల దర్యాప్తు కోసం ప్రత్యేకంగా ‘జోనల్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్రాంచ్‌’ను అందుబాటులోకి తెచ్చింది. పైలట్‌ ప్రాజెక్టుగా గోల్కొండ జోన్‌లో ఏర్పాటు చేసిన ఈ విభాగాన్ని నగర పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనర్‌ మంగళవారం మొహిదీపట్నంలోని గోల్కొండ జోన్‌ డీసీపీ కార్యాలయ ప్రాంగణంలో ప్రారంభించారు. ప్రస్తుతం పోలీస్‌ స్టేషన్లలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల దర్యాప్తు బాధ్యతలను ఒకే సిబ్బంది నిర్వహిస్తున్నారు. బందోబస్తులు, రోజువారీ విధుల ఒత్తిడి కారణంగా కీలక కేసుల దర్యాప్తుపై పూర్తిస్థాయిలో దృష్టి సారించడం కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో తీవ్రమైన కేసుల విచారణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.

15 మందితో ప్రత్యేక బృందం

గోల్కొండ జోన్‌ పరిధిలోని కీలక కేసులపై నాణ్యమైన దర్యాప్తు చేపట్టేందుకు ఇద్దరు డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్లు, ఒక ఎస్సై, ఒక హెడ్‌ కానిస్టేబుల్‌, 10 మంది కానిస్టేబుళ్లతో ఈ విభాగాన్ని ఏర్పాటు చేశారు. హెల్త్‌, ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌, న్యాయ తదితర ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ శాస్త్రీయ ఆధారాలతో దర్యాప్తు చేయనున్నారు. సకాలంలో చార్జిషీట్లు దాఖలు చేసి, నిందితులకు న్యాయస్థానాల్లో చట్టప్రకారం శిక్షలు పడేలా ఈ బృందం పనిచేయనుంది.

దర్యాప్తుపైనే ప్రత్యేక దృష్టి

ఈ సందర్భంగా సీపీ సజ్జనర్‌ మాట్లాడుతూ.. బాధితులకు సకాలంలో పూర్తిస్థాయిలో న్యాయం జరిగినప్పుడే పోలీసింగ్‌ వ్యవస్థకు అసలైన సార్థకత చేకూరుతుందన్నారు. బందోబస్తులు, రోజువారీ విధుల ప్రభావం కేసుల విచారణపై పడకూడదనే లక్ష్యంతోనే ఈ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేసు నమోదు మొదలుకుని న్యాయస్థానంలో చార్జిషీట్‌ దాఖలు చేసే వరకు ఈ బృందం కేసు పరిష్కారంపైనే పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తుందన్నారు. ఆధునిక శాస్త్రీయ ఆధారాలతో దర్యాప్తు చేసినప్పుడే న్యాయస్థానాల్లో నేర నిరూపణ సాధ్యమై దోషులకు శిక్షలు పడతాయని పేర్కొన్నారు.

నేరాల నియంత్ర‌ణ‌పై దృష్టి సారించేందుకు..

గతంలో ఏర్పాటు చేసిన ఇన్వెస్టిగేషన్‌ మానిటరింగ్‌ సెల్‌కు అనుసంధానంగా జోనల్‌ స్థాయిలో తీవ్రమైన కేసుల విచారణను పర్యవేక్షించేందుకు ఈ విభాగం తోడ్పడుతుందని చెప్పారు. దీనివల్ల పోలీస్‌ స్టేషన్ల సిబ్బందిపై దర్యాప్తు భారం తగ్గి, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణపై మరింత దృష్టి సారించే అవకాశం ఉంటుందన్నారు. గోల్కొండ జోన్‌లో చేపట్టిన పైలట్‌ ప్రాజెక్టు ఫలితాల ఆధారంగా నగరంలోని మిగతా అన్ని జోన్లలోనూ జోనల్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్రాంచ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు సీపీ వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు సీపీ తఫ్షిర్‌ ఇక్బాల్‌, గోల్కొండ జోన్‌ డీసీపీ జే రాఘవేందర్‌ రెడ్డి, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement