త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLC Kavitha | బీఆర్ఎస్ హ‌యాంలోనే రైతుల‌కు బేడీలు.. ఎమ్మెల్సీ క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

MLC Kavitha | బీఆర్ఎస్ హ‌యాంలోనే భువ‌న‌గిరి రైతుల‌కు బేడీలు వేశార‌ని తెలిసింద‌ని తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అయితే ఆ స‌మ‌యంలో తాను బీఆర్ఎస్‌లో ఉన్నాను కాబ‌ట్టి ఆ పాపంలో త‌న‌కు కూడా భాగం ఉన్న‌ట్లే అని ఆమె పేర్కొన్నారు.

S

Telangana | Published On Dec 24, 2025, 2.42 pm IST

MLC Kavitha | బీఆర్ఎస్ హ‌యాంలోనే రైతుల‌కు బేడీలు.. ఎమ్మెల్సీ క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Advertisement

MLC Kavitha | త్రినేత్ర‌.న్యూస్ : బీఆర్ఎస్ హ‌యాంలోనే భువ‌న‌గిరి రైతుల‌కు బేడీలు వేశార‌ని తెలిసింద‌ని తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అయితే ఆ స‌మ‌యంలో తాను బీఆర్ఎస్‌లో ఉన్నాను కాబ‌ట్టి ఆ పాపంలో త‌న‌కు కూడా భాగం ఉన్న‌ట్లే అని ఆమె పేర్కొన్నారు. ఓ మంత్రి వాహనాన్ని అడ్డుకున్నందుకు రైతులకు పట్టుబట్టి బేడీలు వేయించారని చెబుతున్నారు. ఏదీ ఏమైనా ప్రజలకు అన్యాయం జరిగింది. అందుకు క్షమాపణలు చెబుతున్నా. ఐతే ఇప్పుడు ప్రజలు నా మాట నమ్మకపోవచ్చు. కానీ నా ప్రవర్తనను బట్టి తెలుస్తుంది.
కానీ దానికి కొంచెం సమయం పట్టొచ్చ‌ని క‌విత పేర్కొన్నారు. యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో నిర్వ‌హించిన జ‌నం జాగృతి బాట కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా క‌విత మీడియాతో మాట్లారు.

19 ఏళ్లుగా జాగృతి పేరుతో నేను ప్రజల్లోనే ఉన్నా. ప్రజలకు నేను కొత్త కాదు. బీఆర్ఎస్‌తో విబేధాల కారణంగా పెట్టిన సంస్థ కాదు. ఉద్యమకాలం నుంచి మన భాష, యాస మీద పోరాటం చేశాం. బతుకమ్మ, బోనాలు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా చేసుకునేలా కృషి చేశాం. మేము ఓట్ల కోసం రాలేదు. పల్లెల్లో ఓట్లు ఉంటే పట్నంలో జనం బాట చేశాం. ఓట్లప్పుడు మాత్రమే నాయకులు ప్రజల్లోకి వచ్చే సంస్కృతి మారాలి. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన నోటీసులు ఊహాజనితమే. దానిపై నేను మాట్లాడలేను. నేను తెలంగాణ ప్రజల బాణాన్ని. నన్ను ఎవరో ఆపరేట్ చేసే సీన్ లేదు. బీఆర్ఎస్‌లో ఎప్పుడు నేను కీలకంగా లేను. టీచర్‌ను కూడా ట్రాన్స్‌ఫ‌ర్ చేయించుకోలేకపోయాను. నేను పొజిషన్‌లో ఉన్న ఐదేళ్లు కూడా నిజామాబాద్‌కే పరిమితమయ్యాను అని క‌విత పేర్కొన్నారు.

ఉరి వేసే వ్యక్తికి కూడా కారణం చెబుతారు..

బీఆర్ఎస్ నుంచి నన్ను ఎందుకు సస్పెండ్ చేశారో నాకు కూడా కారణం తెలియటం లేదు. ఉరి వేసే వ్యక్తికి కూడా కారణం చెబుతారు. కానీ నన్ను మాత్రం ఏమీ అడగకుండానే సస్పెండ్ చేశారు. నా ఆత్మగౌరవం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కాలేను. నేను ఏ తప్పు చేయలేదు. పార్టీ కూడా నన్ను కారణం అడగలేదు. 2029లో ఎన్నికలు వస్తాయని భావిస్తున్నా. అప్పుడు కచ్చితంగా మేము బరిలో ఉంటామ‌ని క‌విత స్ప‌ష్టం చేశారు.

మొల్లమంబా అంటే నాకు ప్రత్యేక అభిమానం..

సాయుధ రైతాంగ పోరాటం, భూదాన్ ఉద్యమానికి నెలవైన జిల్లా భువనగిరి. భువనగరి కోటను ఎన్నో సార్లు ఎందరో ఆక్రమించాలని భావించనప్పటికీ ప్రజలు మాత్రం మంచి పరిపాలన అందించే వారికే అవకాశం ఇచ్చారు. భువనగిరి జిల్లాకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఎవరెస్ట్ ఎక్కిన వారికి కూడా భువనగిరి కోట మీద ట్రైయినింగ్ ఇచ్చారు. కుమ్మరి వాడలో మొల్లమంబా విగ్రహాన్ని సందర్శిస్తాం. ఆమె అంటే నాకు ప్రత్యేక అభిమానం. మహిళలు చదువుకోలేని సమయంలో కవిగా రామాయణం రాసి ఆమెను ఆమె ప్రూవ్ చేసుకున్నారు అని క‌విత తెలిపారు.

ఎయిమ్స్‌లో స్థానికుల‌కే 80 శాతం ఉద్యోగాలివ్వాలి..

ఆలేరు, భువనగిరి ప్రాంతంలో నీటి కరువు చాలా ఉండేది. తెలంగాణ వస్తే నీటి పారుదల రంగం ముందుకు పడుతుందని ఆశతో ఇక్కడ ప్రజలు తెలంగాణ కోసం ఉద్యమించారు. తెలంగాణ వచ్చాక మేము పార్లమెంట్‌లో ఎయిమ్స్ కావాలని ఫైట్ చేశాం. మనకు నిమ్స్‌నే ఎయిమ్స్‌గా మార్చారు. దేశంలోనే తొలి బ్రౌన్ ఫీల్డ్ ఎయిమ్స్ ఇది. దాదాపు 2015 నుంచి ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఎమర్జెన్సీ మందులు లేని పరిస్థితి ఉంది. కేంద్రం నుంచి రూ. 750 కోట్లు వచ్చినప్పటికీ భవన నిర్మాణాలను కాంట్రాక్టర్ లేట్ చేస్తున్నాడని చెబుతున్నారు. దీని పై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కాంట్రాక్టర్‌ను పిలిచి మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నా. ఎయిమ్స్ ద్వారా చాలా జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ జాబ్స్‌లో స్థానికులకే 80 శాతం వచ్చేలా మంత్రి కృషి చేయాలి. ఎయిమ్స్ విజిట్ చేసిన సందర్భంగా నేను రెండే అంశాలు డిమాండ్ చేశాను. భవనాలను త్వరగా పూర్తి చేయటంతో పాటు స్థానికులకే 80 శాతం ఉద్యోగాలు వచ్చేలా చేయాలి అని క‌విత డిమాండ్ చేశారు.

సీఎం రేవంత్ మాట త‌ప్పారు..

ఇక ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే చెల్లించాలని మేము భువనగిరిలో ఆందోళన చేపట్టాం. ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకుండా పేద విద్యార్థులకు రేవంత్ రెడ్డి ద్రోహం చేస్తున్నాడు. ఫీజు కట్టని విద్యార్థులను కాలేజీల్లో యాజమాన్యం అవమానిస్తోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం మండలిలో నేను ప్రభుత్వాన్ని నిలదీశాను. దానికి ముఖ్యమంత్రి స్పందిస్తూ నెల నెల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లిస్తామని చెప్పారు. కానీ అన్ని మాటలు తప్పినట్లే ఈ విషయంలోనూ మాట తప్పార‌ని క‌విత ధ్వ‌జ‌మెత్తారు.

అవినీతి కోస‌మే అలైన్‌మెంట్ మార్పు

భువనగిరి ఎల్మమ్మ వారిని మేము దర్శించుకున్నాం. అమ్మ వారి దయ వల్ల ఈ ప్రాంతంలో నేతలకు బుద్ది రావాలని కోరుకుంటున్నా. భువనగరి మున్సిపాలిటీలో ఉన్న రాయగిరి ప్రజల పరిస్థితి దయనీయం. ఇప్పటికే ఆరేడు ప్రాజెక్ట్ ల కోసం ఈ ప్రాంతం ప్రజలు తమ భూములు ఇచ్చారు. మళ్లీ ట్రిపుల్ ఆర్ కోసం వారి భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడున్న ఎమ్మెల్యే కుంభం అనిల్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉర్రూతలూగి ఇక్కడి ప్రజలకు న్యాయం చేస్తానని మాట ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఆయన ప్రజలకు ఇచ్చిన హామీని మర్చిపోయారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ప్రజలకు మాట ఇచ్చి ఇప్పుడు పట్టించుకోవటం లేదు. అసలు రింగ్ రోడ్డు అంటే పట్ణణాల చుట్టూ నుంచి వెళ్లేది. కానీ ట్రిపుల్ ఆర్ విషయంలో మాత్రం దాని విరుద్ధంగా చేస్తున్నారు. భువనగిరి, ఆలేరు, చౌటుప్పల్ ఇలా చాలా ప్రాంతాల్లో ఈ రోడ్డు ఊర్లో నుంచి వెళ్తోంది. ట్రిపుల్ ఆర్ ఉత్తర, దక్షిణ ప్రాంతంలో ఇప్పటికే మూడు నాలుగు సార్లు ఆలైన్‌మెంట్ మార్చారు. మేము నేషనల్ హైవే వాళ్లను అడిగినప్పుడు వాళ్లు శాటిలైట్ మ్యాప్ ద్వారా సర్వే చేస్తున్నామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మున్సిపాలిటీల్లో ప్రజలకు ఇబ్బంది ఉండదని, దీన్ని మార్చటం సాధ్యం కాదని అన్నారు. కానీ నాయకుల అవినీతి కోసం ఆలైన్‌మెంట్‌ను చాలా సార్లు మార్చారు. ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్ ఉన్న 8 జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంది. పెద్దల భూములను రక్షించేందుకు పేదల భూములను బలి పెడుతున్నారు. ఈ అవినీతిలో భాగమైన వారి పేర్లు చెబితే నన్ను బద్నాం చేస్తున్నారు. ఇన్నిసార్లు ఆలైన్‌మెంట్ మార్చవద్దని హైకోర్టు ఆర్డర్ కూడా ఉంది. ఇప్పుడైనా సరే ముఖ్యమంత్రి జోక్యం చేసుకోని పేదలకు అన్యాయం జరగకుండా చూడాలి. నితిన్ గడ్కరీ కూడా ఈ ప్రాజెక్ట్ మున్సిపాలిటీలో నుంచి పోదు అన్నారు. బీజేపీ ఎంపీలు 9 మంది సంతకం చేసిన తర్వాత కూడా ఆలైన్‌మెంట్ మార్చుతున్నారు. దీనిపై జాగృతి తరఫున ఆన్‌లైన్ మూమెంట్ చేస్తాం. బాధిత రైతులతో జనవరి 5న హైదరాబాద్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామ‌ని క‌విత తెలిపారు.

అన్యాయం జరగుతుంటే చూస్తూ ఊరుకోలేం..

ఇక ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో బస్వాపూర్ చిన్న చెరువుగా ఉండే. కానీ రీ డిజైన్‌లో భాగంగా చుట్టుపక్కల గ్రామాలను కలుపుకొని 5 వేల ఎకరాలు సేకరించారు. 11.7 టీఎంసీ కెపాసిటీ పెంచారు. కానీ నిర్మాణం, నీళ్లు ఇచ్చే విషయంలో ఫోర్స్‌ఫుల్‌గా పనిచేయలేదు. ఇప్పటి వరకు కెనాల్స్, డిస్ట్రిబ్యూటరీ ఛానెల్స్ పూర్తి కాలేదు. చుక్క నీరు కూడా రాలేదు. పైగా ఊట కారణంగా అక్కడున్న పొలాలకు నీళ్లు వస్తున్నాయి. ఇక్కడి ప్రజలకు సరైన పరిహారం అందలేదు. పైగా 96 ఎకరాలను ఎలాంటి పరిహారం ఇవ్వకుండా తీసుకున్నారు. ప్రజాస్వామ్య దేశంలో కళ్ల ముందు ఇంతటి అన్యాయం జరగుతుంటే చూస్తూ ఊరుకోలేం. కలెక్టర్ చొరవ చూపి 96 ఎకరాల రైతులకు కూడా పరిహారం అందించాలి అని క‌విత డిమాండ్ చేశారు.

ఆలేరు ప్రజలకు మాత్రం నా సెల్యూట్..

ఆలేరులో 30 పడకల హాస్పిటల్‌ను 100 పడకలుగా మార్చాలని 40 ఏళ్లుగా డిమాండ్ ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఈ హాస్పిటల్ మాత్రం కట్టించలేదు. అయిన సరే ఈ పార్టీలను భరిస్తున్న ఆలేరు ప్రజలకు మాత్రం నా సెల్యూట్. ఈ ప్రాంతం హైవే కావటంతో హెవీ లోడ్ వెహికిల్స్ వస్తూ ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలా మంది ప్రాణాలు పోతున్నాయి. వెంటనే ఇక్కడ 100 పడకల హాస్పిటల్‌ను కట్టాలి. ఆలేరు- జనగాం మధ్యలో కొత్త బ్రిడ్జిని వెంటనే నిర్మించాలి. దసరా, బతుకమ్మ వేడుకలు ఇదే ప్రాంతంలో జరుగుతాయని చెబుతున్నారు. కానీ ఈ ప్రాంతమంతా చెత్తతో నిండిపోయింది. మొత్తం క్లీన్ చేసి లైట్లను ఏర్పాటు చేయాలి. ఇక మోటకొండూరులో సర్వే నంబర్ 950లో 600 ఫ్లాట్లు ఉన్నాయి. చామల లక్ష్మీ నరసింహా రెడ్డి అనే పెద్ద మనిషి అప్పట్లోనే ఈ భూములకు ఫార్మాలైజ్ చేశారు. కానీ ఏ ప్రభుత్వం కూడా ఇక్కడ ప్రజలకు పట్టాలు ఇవ్వటం లేదు. వాళ్లకు పట్టాలు వచ్చే వరకు కూడా జాగృతి తరఫున పోరాటం చేస్తుంటాం. చందుపట్ల కో ఆపరేటివ్ బ్యాంక్ లో 18 వందల మందికి రుణమాఫీ కాలేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు ప్రభుత్వాల రుణమాఫీ వాళ్లకు కాలేదు. ఎందుకు అని అడిగితే కలెక్టర్, అధికారులు ఎవరు సమాధానం చెప్పటం లేద‌ని క‌విత తెలిపారు.

రాయ‌గిరి స్టేడియం ప‌నులు ఎక్క‌డ‌..?

సౌతాఫ్రికాలో ఉగ్రవాదుల చెరలో ఉన్న సుదగాని ప్రవీణ్ కుటుంబంతో మాట్లాడాం. ఉగ్రవాదులతో ఐదారు రోజుల్లో చర్చలు జరుపుతామని చెబుతున్నారు. బాలి అంబాసిడర్‌తో ఈ అంశాన్ని నేనే ఫాలో అప్ చేస్తాను. లింగం హోటల్ వద్ద ఛాయ్ పే చర్చా కార్యక్రమం నిర్వహించాం. డాక్టర్లు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, విద్యావేత్తలు మాతో మాట్లాడారు. ఇక్కడి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కావాలని వారంతా బలంగా కోరుకుంటున్నారు. ఇక సీఎస్ఆర్ ఫండ్స్ 3 కోట్లతో స్టేడియం నిర్మాణం అని చెప్పారు. కానీ ఫ్లెక్సీ మాత్రమే ఉన్నాయి. స్టేడియం లేదు. గతంలో ఉన్న ప్రజాప్రతినిధులు దీనిపై సమాధానం చెప్పాలి. స్టేడియం కోసం రాయగిరిలో పది ఎకరాలు కేటాయించారు. కానీ స్టేడియం పనులు ప్రారంభం కాలేదు. ఇక్కడి యువమిత్రులు ఆగ్రహంతో విప్లవం తెచ్చే వరకు ప్రభుత్వం స్పందించదేమో? అని క‌విత పేర్కొన్నారు.

స్వ‌ర్ణ‌కారుల‌ను ఇబ్బంది పెడుతున్న పోలీసులు..

ఇక మేము ఇవ్వాళ స్వర్ణకారులను కలుస్తాం. వారి పరిస్థితి మాత్రం అన్యాయం. పెద్ద షాపులు వచ్చిన తర్వాత వారికి గిరాకీ లేకుండా పోయింది. మట్టెలు, పుస్తెల కోసం మాత్రం స్వర్ణకారుల వద్దకు వెళ్లే పరిస్థితి వచ్చింది. దొంగ బంగారం పేరుతో కూడా స్వర్ణకారులను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు. నిజామాబాద్ ఎంపీగా ఉన్న సమయంలో అప్పటి ఎస్పీతో స్వర్ణకారులను ఇబ్బంది పెట్టవద్దని చెప్పాను. ఈ విషయంలో స్వర్ణకారులను ఇబ్బంది పెడితే వాళ్లు సైనెడ్ మింగి ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పిన‌ట్లు క‌విత పేర్కొన్నారు.

చేనేతలకు ఇచ్చే రూ. 24 వేలు ఎగ్గొట్టింది..

ఇక జియాపల్లిలో క్రషర్ కారణంగా అక్కడ ఇళ్లు డ్యామేజ్ అవుతున్నాయి. అక్కడ ప్రజలను కూడా కలవబోతున్నా. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. పోచంపల్లిలో 3 వేల 5 వందల జియో ట్యాగ్ మగ్గాలు ఉన్నాయి. మొత్తంగా 9 వేల మంది మంది చేనేత కార్మికులు ఉన్నారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం చేనేతలకు ఇచ్చే రూ. 24 వేలు ఎగ్గొట్టింది. బీసీ రుణాలను చేనేతలకు మాఫీ చేస్తామని చెప్పి చేయలేదు. మేము ఒత్తిడి పెడితే రూ. 33 కోట్లు రిలీజ్ చేశామన్నారు. కానీ ఒక్క పైసా రాలేదు. వెంటనే రూ. 50 కోట్ల నిధులు విడుదల చేసి చేనేత లకు రుణమాఫీ చేయాలి. చౌటుప్పల్ లో భూ నిర్వాసితులతో పాటు కెమికల్ ఫ్యాక్టరీకి బాధితులను పరామర్శిస్తాం. ఒక్కొక్కటిగా క్షేత్రస్థాయిలో తెలుసుకుంటే చాలా సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వాల నిర్లక్ష్యం కొట్టిచ్చినట్లు కనబడుతోంది అని క‌విత మండిప‌డ్డారు.

అసలు కెనాల్స్ గురించి తెలుసో లేదో?

భువనగిరిలో లక్ష‌కు పైగా ఎకరాలకు నీళ్లిస్తామని లక్ష్యం పెట్టుకొని ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు. దేవాదుల నుంచి 62 వేల ఎకరాల లక్ష్యం పెట్టుకోని 12 ఏళ్లలో 12 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారు. అంటే ప్రభుత్వాల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 16 జిల్లాల్లో మేము కాల్వలను పరిశీలిస్తే అసలు సరైన మెయింటెనెన్స్ లేదు. దీంతో టెయిల్ ఎండ్ వరకు నీళ్లు వెళ్లే పరిస్థితి ఉండదు. ఆంధ్రాలో కాల్వల మెయింటెనెన్స్ ను ఎమ్మెల్యేలు కచ్చితంగా బాగుండేలా చూస్తారు. కానీ మన ప్రజాప్రతినిధులకు అసలు కెనాల్స్ గురించి తెలుసో లేదో? జూలూరు- రుద్రవల్లిలో లెవల్ క్వాల్వర్టు పొంగితే బీబీ నగర్- పోచంపల్లి రాకపోకలు బంద్ అవుతున్నాయి. ఈ బ్రిడ్జిని వెంటనే నిర్మించాలని మంత్రి కోమటి రెడ్డిని కోరుతున్నా అని క‌విత తెలిపారు.

మన సీఎం అంటేనే ఆర్ఎస్ఎస్ సీఎం..

ఇక మన సీఎం అంటేనే ఆర్ఎస్ఎస్ సీఎం. ఇంటర్న‌ల్‌గా ఆయన బీజేపీతో కుమ్మక్కు అయ్యారు. ఇక్కడ డ్రై పోర్ట్ కోసం 3 వందల ఎకరాలు తీసుకున్నారు. కానీ ఇందులో అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ కోసం 65 ఎకరాల్లో పర్మిషన్ ఇస్తారంట. దీంతో భూనాది గన్ కాలువ కలుషితం అవుతుంది. మూసీని కూడా ఇలాగే పరిశ్రమలకు పర్మిషన్లు ఇచ్చి కలుషితం చేశారు. ప్రభుత్వం వచ్చి అన్ని కొత్తగా నిర్మిస్తామని చెబుతోంది. కానీ పాత వాటిని, పాత స్కూళ్లను ముందు రిపేర్ చేయాల్సి ఉంది. ఆలేరును రెవెన్యూ డివిజన్ చేస్తామని కాంగ్రెస్ మాట ఇచ్చింది. ఆ మాట నిలబెట్టుకోవాలి. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ యూనివర్సిటీని భూదాన్ పోచంపల్లిలో ఏర్పాటు చేయాలి. ప్యూచర్ సిటీ లో దీన్ని పెట్టాలని సీఎం ప్లాన్ చేస్తున్నారు. ఆ ఆలోచన విరమించుకోవాలి. తుర్కపల్లి గ్రీన్ ఇండస్ట్రీ పార్క్ కోసం 93 ఎకరాలు తీసుకున్నారు. చుట్టు పక్కల 61 ఎకరాలను నోటిఫై చేయటంతో అక్కడ రైతుల భూములకు ధర రావటం లేదు. కలెక్టర్ ఈ విషయంలో అక్కడి ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి. జాగృతి ఏ జిల్లాలో పర్యటన చేసిన సరే అక్కడి సమస్యలను ఫాలో అప్ చేస్తాం. పటిష్టమైన క్యాడర్‌ను నిర్మించి ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటాం అని క‌విత తేల్చిచెప్పారు.

Advertisement

తాజావార్తలు

Advertisement