త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Uttam Kumar Reddy | సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం కార్యాచరణ : మంత్రి ఉత్త‌మ్‌

Minister Uttam Kumar Reddy | రాష్ట్రంలోని సాగునీటి సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసి, స్వయం సమృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. రుణభారాన్ని తగ్గించడంతో పాటు తక్కువ వడ్డీతో దీర్ఘకాలిక నిధులు సమీకరించేలా 10 రోజుల్లో సమగ్ర ఆర్థిక కార్యాచరణ (ఫండింగ్‌ రోడ్‌మ్యాప్‌) సిద్ధం చేయాలని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

P

Telangana | Published On Jul 19, 2026, 4.55 pm IST

Minister Uttam Kumar Reddy | సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం కార్యాచరణ : మంత్రి ఉత్త‌మ్‌
Advertisement

Minister Uttam Kumar Reddy | రాష్ట్రంలోని సాగునీటి సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసి, స్వయం సమృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. రుణభారాన్ని తగ్గించడంతో పాటు తక్కువ వడ్డీతో దీర్ఘకాలిక నిధులు సమీకరించేలా 10 రోజుల్లో సమగ్ర ఆర్థిక కార్యాచరణ (ఫండింగ్‌ రోడ్‌మ్యాప్‌) సిద్ధం చేయాలని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని కుందన్‌బాగ్‌ క్యాంపు కార్యాలయంలో ఆదివారం సాగునీటి సంస్థల ఆర్థిక పరిస్థితి, నిధుల సమీకరణ, రుణాల పునర్వ్యవస్థీకరణపై ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ కార్యదర్శి ఈ శ్రీధర్‌, ఇంజినీర్‌-ఇన్‌-చీఫ్‌ (జనరల్‌) రమేశ్‌బాబు, జాయింట్‌ సెక్రటరీ శ్రీనివాస్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

శాశ్వత ఆదాయ వనరులు కల్పించే దిశగా..

సమీక్ష సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బడ్జెట్‌పైనే ఆధారపడే పరిస్థితికి స్వస్తి చెప్పి, సాగునీటి సంస్థలకు శాశ్వత ఆదాయ వనరులు కల్పించే దిశగా కొత్త ఆర్థిక నమూనాలను రూపొందించాలని సూచించారు. ఈ క్రమంలో సాగునీటి శాఖకు చెందిన ఖాళీ భూముల్లో సౌర విద్యుత్‌ ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం లేదా లీజుకు ఇచ్చి ఆదాయం పొందే అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. నిజాంసాగర్‌తో పాటు ఇతర జలాశయాల పరిసరాల్లో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై సాధ్యాసాధ్యాల నివేదిక రూపొందించాలని అధికారులకు సూచించారు. అయితే, ఆదాయ వనరుల పెంపు పేరుతో రైతులపై ఎలాంటి అదనపు భారం పడకూడదని మంత్రి స్పష్టం చేశారు. అన్ని ప్రతిపాదనలను చట్టపరంగా పరిశీలించిన తర్వాతే అమల్లోకి తీసుకురావాలని చెప్పారు.

రుణాల పునర్వ్యవస్థీకరణతో రూ.250 కోట్ల ఆదా

గతంలో అధిక వడ్డీతో తీసుకున్న రుణాలను తక్కువ వడ్డీ రుణాలతో పునర్వ్యవస్థీకరిస్తే ప్రభుత్వంపై పడుతున్న ఆర్థిక భారం గణనీయంగా తగ్గుతుందని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం సుమారు 11 శాతం వడ్డీతో ఉన్న రుణాలను తక్కువ వడ్డీకి మార్చగలిగితే ఏటా దాదాపు రూ.250 కోట్ల వరకు ఆదా చేసే అవకాశం ఉందని అధికారులు సమావేశంలో వివరించారు. ప్రతి సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించిన రుణాలు, వడ్డీ భారం, చెల్లింపుల స్థితి, పనుల పురోగతి, పూర్తి చేయడానికి అవసరమైన నిధుల వివరాలతో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. తక్కువ పెట్టుబడితో త్వరగా పూర్తయ్యే ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అలాగే గత రుణభారం లేని ఒక సాగునీటి సంస్థ ద్వారా కొత్త నిధులు సమీకరించే అవకాశాన్ని కూడా సమావేశంలో పరిశీలించారు.

పెండింగ్‌ ఆడిట్లు పూర్తి చేయాలి

2022-23 ఆర్థిక సంవత్సరంతో పాటు పెండింగ్‌లో ఉన్న అన్ని చట్టబద్ధ ఆడిట్లను తక్షణమే పూర్తి చేయాలని, ఆడిటర్ల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. శాఖకు చెందిన భూములు, ఇతర ఆస్తుల పూర్తి వివరాలను 15 రోజుల్లో సిద్ధం చేసి వాటిని వనరుల సమీకరణకు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భూసేకరణ పరిహారం కోసం ఇప్పటికే విడుదల చేసిన నిధులు రైతులకు ఎలాంటి జాప్యం లేకుండా అందేలా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

Advertisement
Advertisement