త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana | కరువు.. అప్పులు.. సర్కారును కలవరపెడుతున్న కష్టాల సుడిగుండాలు

Telangana | ఓ వైపు ప్రకృతి మోసుకొచ్చిన కరువు( Drought ). ఇంకోవైపు ..పెను భారంగా మారిన పాత, కొత్త అప్పులు( Debts ). ఇప్పుడు ఈ రెండు అంశాలే రాష్ట్ర ప్రభుత్వాన్ని వణికిస్తున్నాయి. సాగునీటికి, తాగునీటికి ఏర్పడిన కొరతతో గ్రామీణ, వ్యవసాయ సంక్షోభం 2027లో కూడా కొనసాగితే.. అది తప్పకుండా 2028 ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపనున్నదని సీనియర్ మంత్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ సుడిగండాల అనిశ్చితికి ఏదో రకంగా ముగింపు పలకపోతే ప్రభుత్వానికి ముప్పు తప్పదని భావిస్తున్నారు.

S

Telangana | Published On Oct 24, 2026, 7.30 pm IST

Telangana | కరువు.. అప్పులు.. సర్కారును కలవరపెడుతున్న కష్టాల సుడిగుండాలు
Advertisement
  • దాదాపుగా ఎండిపోయిన వ్యవసాయ పంపుసెట్లు
  • సంక్షోభం స్థాయికి పడిపోయిన
    సాగునీటి, తాగునీటి మట్టాలు
  • 2027లో కూడా కరువు కొనసాగితే
    2028 ఎన్నికలపై తీవ్ర ప్రభావం
  • ప్రకృతి విపత్తుపై అంతర్మథనంలో మంత్రివర్గం
  • 33 శాతం రాబడి.. 77 శాతం అప్పులు
  • 9 లక్షల కోట్లు దాటిన అప్పులు
  • అసలు, వడ్డీలు చెల్లింపులకే సరిపోతున్న ఆదాయం

Telangana | త్రినేత్ర న్యూస్ : ఓ వైపు ప్రకృతి మోసుకొచ్చిన కరువు( Drought ). ఇంకోవైపు ..పెను భారంగా మారిన పాత, కొత్త అప్పులు( Debts ). ఇప్పుడు ఈ రెండు అంశాలే రాష్ట్ర ప్రభుత్వాన్ని వణికిస్తున్నాయి. సాగునీటికి, తాగునీటికి ఏర్పడిన కొరతతో గ్రామీణ, వ్యవసాయ సంక్షోభం 2027లో కూడా కొనసాగితే.. అది తప్పకుండా 2028 ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపనున్నదని సీనియర్ మంత్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ సుడిగండాల అనిశ్చితికి ఏదో రకంగా ముగింపు పలకపోతే ప్రభుత్వానికి ముప్పు తప్పదని భావిస్తున్నారు.

358 మండలాల్లో కరువు..

ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ద్వారా విడతల వారీగా మొత్తం 81.2 సెంటిమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. అక్టోబర్ చివరి నాటికి కేవలం 61.8 సెంటిమీటర్ల వద్దే ఆగిపోయింది. రాష్ట్ర సగటుగా చూస్తే ఇది 20 శాతం లోటు. కానీ జిల్లాల వారీగా, మండలాల వారీగా ఈ లోటు తీవ్రంగా ఉన్నట్టు గణాంకాలు ధ్రువీకరిస్తున్నాయి. అత్యధికంగా.. జోగుళాంబ గద్వాలలో 41 శాతం, నారాయణపేట, హనుమకొండ జిల్లాల్లో 35 శాతం, నల్లగొండ జిల్లాల్లో 37 శాతం లోటు వర్షపాతం నమోదైంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుక్రవారం (అక్టోబర్ 23న) తెలిపిన గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో 358 మండలాల్లో కరువు పరిస్థితి నెలకొన్నది. వాటిలో 324 మండలాల్లో భూగర్భ జలాలు వేగంగా అడుగంటి పోతున్నాయి. రాష్ట్ర రిజర్వాయర్లలో గత ఏడాది ఇదే సమయానికి 470 టీఎంసీల నీటి నిల్వ ఉంటే..ఈ సారి కేవలం 170 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

సగానికి పడిపోయిన సాగు..

ఎల్ నినో ప్రభావం రైతులపైనే ఎక్కువగా పడింది. సాధారణంగా రాష్ట్రంలో 139 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతూ ఉంటుంది. ఈ ఏడాది తాజా గణాంకాల ప్రకారం 67 లక్షల ఎకరాలకే పరిమితమైంది. గత ఏడాది వరి 69 లక్షల ఎకరాల్లో సాగు చేయగా.. ఈ సారి అది 38 లక్షల ఎకరాలకే పరిమితమైంది. పత్తి, మొక్కజొన్న సాగు కూడా ఈ సారి పడిపోయింది. రాష్ట్రంలో వ్యవసాయంపై ఆధారపడిన 65 లక్షల మంది రైతులు.. 30 లక్షల మంది రైతు కూలీల కుటుంబాలపై ఈ కరువు తీవ్ర ప్రభావం చూపుతున్నది.

9 లక్షల కోట్లు దాటిన అప్పులు

ప్రకృతి.. ఎల్ నినో రూపంలో వైపరీత్యాన్ని మోసుకొస్తే.. మరోవైపు ప్రభుత్వాన్ని అప్పుల కుప్ప తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తున్నది. రాష్ట్రానికి వస్తున్న ఆదాయానికి చేస్తున్న అప్పులకు మధ్య అంతరం బాగా పెరుగుతున్నది. ఇటీవల కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్ర రెవెన్యూ రాబడి 33 శాతం ఉంటే అప్పులు మాత్రం 73 శాతానికి పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన పన్నేతర ఆదాయం రూ.35,730.20 కోట్లలో ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం రూ.5,754.24 కోట్లు మాత్రమే సాధించడం ఆందోళన క‌లిగించే విషయం. 2026 మార్చి 31 నాటికి రాష్ట్రంపై ఉన్న మొత్తం అప్పు 8.64 లక్షల కోట్లు కాగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 60 వేల కోట్ల అప్పులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇవన్నీ కలిపితే.. అప్పులన్నీ కలిపి.. 9 లక్షల కోట్లు దాటే ప్రమాదం ఉంది.

సంక్షోభాన్ని అధిగమిస్తారా?

తగినంత వర్షపాతం లేకపోవడం.. రిజర్వాయ‌ర్లలో నీటి మట్టాలు అడుగంటడం, సాగు తీవ్రంగా క్షీణించడం వంటి కారణాలు రాష్ట్రంలో గ్రామీణ సంక్షోభాన్ని ప్రతిబింబిస్తున్నాయి. పంట నష్టాలతో రైతు కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం కనిపిస్తున్నది. ప్రభుత్వం ఎల్ నినో విషయంలో ఓ వైపు ఊరట కలిపిస్తున్నా.. గ్రామాల్లో రానురానూ పరిస్థితి ఆందోళన స్థాయికి దిగజారుతున్న నేపథ్యంలో సీనియర్ మంత్రుల్లో ఈ విషయంపై చర్చ మొదలైంది. గ్రామాల్లో నెలకొని ఉండే పరిస్థితులే రాజకీయ పార్టీల విజయ అవకాశాలను నిర్దేశిస్తాయి. ఈ ఎల్ నినో ప్రభావం వచ్చే ఏడాది వరకు కొనసాగితే.. అటు తర్వాత వచ్చే ఎన్నికలపై ఈ కరువు ప్రభావం చూపుతుందేమోనని కలవరం చెందుతున్నారు.

Advertisement
Advertisement