త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Employees Health Scheme | ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలుకు హెల్త్‌కేర్ ట్రస్ట్ .. కాంగ్రెస్ స‌ర్కారు నిర్ణ‌యం..

Employees Health Scheme | తెలంగాణ సచివాలయంలో మంగళవారం జరిగిన ఉద్యోగుల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) అమలుపై ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఈ ప‌థ‌కాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న “ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్” ద్వారా అమలు చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వెల్లడించారు.

P

Telangana | Published On Jun 1, 2026, 7.27 pm IST

Employees Health Scheme | ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలుకు హెల్త్‌కేర్ ట్రస్ట్ .. కాంగ్రెస్ స‌ర్కారు నిర్ణ‌యం..
Advertisement

Employees Health Scheme | తెలంగాణ సచివాలయంలో మంగళవారం జరిగిన ఉద్యోగుల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) అమలుపై ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఈ ప‌థ‌కాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న “ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్” ద్వారా అమలు చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వెల్లడించారు. ఈ ట్రస్ట్‌ను వచ్చే రెండు రోజుల్లోనే ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ట్రస్ట్ ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాలను, వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధుల సూచనలు, సిఫార్సులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఖరారు చేయనున్నట్లు చెప్పారు. ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించడంపై సమావేశంలో ప్ర‌ధానంగా చ‌ర్చించారు.

ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు నాణ్యమైన, సులభంగా అందుబాటులో ఉండే ఆరోగ్య సేవలను అందించేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రతిపాదిత ట్రస్ట్ ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా అమలు చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ట్రస్ట్ కోసం ప్రత్యేక బ్యాంక్ ఖాతా ఏర్పాటు చేయనున్నట్లు, ప్రభుత్వంతో పాటు ఉద్యోగుల సమాన ఆర్థిక భాగస్వామ్యంతో ఇది నిర్వహించబడుతుందని వివరించారు. అలాగే ట్రస్ట్‌కు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుందని తెలిపారు. ట్రస్ట్ నిర్వహణకు సంబంధించిన ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి, ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన సూచనలను కూడా విధివిధానాల్లో చేర్చనున్నట్లు రామకృష్ణారావు హామీ ఇచ్చారు.

ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను ఉద్యోగ సంఘాల ప్రతినిధులు స్వాగతించారు. ట్రస్ట్ పరిపాలన, ఆర్థిక నిర్వహణ, సేవల అమలు విధానం, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ వంటి అంశాలపై వారు పలు సూచనలు చేశారు. ఈ సమావేశానికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు మహేశ్‌ ఎక్కా, దాన కిషోర్, ప్రధాన కార్యదర్శులు సందీప్ కుమార్ సుల్తానియా, క్రిస్టినా, యోగితా రాణా, రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్‌తో పాటు పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.

Advertisement
Advertisement