Yamuna Pushkaralu | యమునా నదికి పుష్కర శోభ.. రేపటి నుంచే కళకళలాడనున్న తీరాలు..!
Yamuna Pushkaralu | యమునా నది పుష్కర శోభను సంతరించుకున్నది. పన్నెండేళ్లకు ఒక్కసారి వచ్చే పుష్కరాలు జూన్ 2న ప్రారంభం కానున్నాయి. హిమాలయాల్లోని యమునోత్రి నుంచి ప్రయాగలోని సంగమం వరకు యమునా నదీ తీరాలు ఇప్పటికే పుణ్యస్నానాల కోసం తరలివస్తున్న భక్తులతో కళకళలాడుతున్నాయి.
Devotional | Published On Jun 1, 2026, 8.20 pm IST
Yamuna Pushkaralu | యమునా నది పుష్కర శోభను సంతరించుకున్నది. పన్నెండేళ్లకు ఒక్కసారి వచ్చే పుష్కరాలు జూన్ 2న ప్రారంభం కానున్నాయి. హిమాలయాల్లోని యమునోత్రి నుంచి ప్రయాగలోని సంగమం వరకు యమునా నదీ తీరాలు ఇప్పటికే పుణ్యస్నానాల కోసం తరలివస్తున్న భక్తులతో కళకళలాడుతున్నాయి. గురుగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని నిర్వహించే ఈ పుష్కరాల సమయంలో నదీ స్నానాలు, పితృతర్పణాలు, దానధర్మాలకు ఎంతో విశిష్టత ఉన్నది. ఇలా చేయడం ద్వారా పుణ్యం వస్తుందని భక్తుల విశ్వాసం.
పుష్కరాల వెనుక ఉన్న పురాణ నేపథ్యం..
పుష్కరాల వెనుక ఉన్న కథ పురాణాల్లో ఆసక్తికరంగా చెబుతారు. తుందిలుడు అనే మహర్షి చేసిన ఘోర తపస్సు ఫలితంగా నీటిలో శాశ్వత స్థానం పొందాడని, ఆ శక్తినే గురుగ్రహం ప్రతి రాశి మార్పు సమయంలో నదుల్లో ప్రవేశపెడతాడని విశ్వాసం. గురుడు ఒక్కో రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కో నదికి పుష్కరాలు వస్తాయని సంప్రదాయం చెబుతుంది. ఈ కారణంగానే ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి పవిత్ర నదులు పుష్కర పవిత్రతను సంతరించుకుంటాయి.
యమునా నది ప్రాశస్త్యం
యమునా నది భారత ఉపఖండంలోని అత్యంత పవిత్ర నదుల్లో ఒకటి. సూర్య భగవానుడి కుమార్తెగా యమునాదేవిని పురాణాలు పేర్కొంటాయి. యమధర్మరాజు సోదరిగా భావించే ఈ నది, శ్రీకృష్ణుని బాల్య లీలలతో మరింత దివ్యమైన స్థానం పొందింది. ముఖ్యంగా మధుర, బృందావనం, తీరాల్లో జరిగిన కృష్ణలీలలు యమునా తీరాన్ని భక్తి కేంద్రంగా నిలిపాయి. కాళీయ మర్దనం వంటి ఘట్టాలు ఈ నదీ ప్రవాహాన్నే సాక్షిగా చేసుకున్నాయని పురాణాలు చెబుతాయి. హిమాలయాల్లోని యమునోత్రి వద్ద జన్మించే యమునా నది సుమారు 1,376 కిలోమీటర్లు ప్రయాణించి గంగలో కలుస్తుంది. యమునోత్రి వద్ద ప్రారంభమయ్యే ఈ ప్రవాహం ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ మీదుగా సాగి చివరికి ప్రయాగ వద్ద సంగమిస్తుంది.
ప్రవాహ మార్గంలో ఆధ్యాత్మిక క్షేత్రాలు..
యమునా ప్రవాహం వెంట అనేక ఆలయాలున్నాయి. యమునోత్రి చార్ ధామ్ యాత్రలో తొలి పాదం. అక్కడ ఉన్న సూర్య కుండ్ వేడి నీటి బుగ్గలు భక్తులను ఆకర్షిస్తాయి. మధురలోని విశ్రాంత ఘాట్‌కు ప్రత్యేక స్థానం ఉంది. కంసుని సంహారానంతరం శ్రీకృష్ణుడు ఇక్కడ విశ్రమించాడని విశ్వాసం. అదే విధంగా బృందావనంలో యమునా వంకరలు తిరుగుతూ ప్రవహించే దృశ్యం చూపరులను ఆకట్టుకుంటుంది. చివరికి ప్రయాగ్‌రాజ్ వద్ద గంగలో కలిసే ఈ నది, త్రివేణి సంగమంగా ప్రసిద్ధి చెందింది. యమునా నీలి-ఆకుపచ్చ నీరు గంగ తెల్లటి ప్రవాహంతో కలిసే దృశ్యం భక్తులకు అపూర్వమైన అనుభూతిని కలిగిస్తుంది.
చారిత్రక వైభవం, పర్యాటకం..
యమునా తీరం కేవలం ఆధ్యాత్మికత విలసిల్లడమే కాకుండా.. చరిత్రకూ సాక్ష్యాలుగా నిలుస్తాయి. తాజ్ మహల్ సైతం యమునా నది దక్షిణ తీరంలో నిలిచి ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తోంది. నదిలో ప్రతిబింబించే తాజ్ మహల్ దృశ్యం భారతీయ సౌందర్యానికి ప్రతీకగా నిలుస్తుంది. అదే ప్రాంతంలో ఉన్న ఆగ్రా పోర్ట్ సైతం మొఘల్ కాలపు వైభవాన్ని గుర్తు చేస్తుంది. ఒకప్పుడు ఢిల్లీ కోటల గోడలను తాకుతూ యమునా ప్రవహించేదని చరిత్ర చెబుతుంది. నేడు ప్రవాహ మార్గం కొంత మారినా, ఢిల్లీ నగర జీవనంలో యమునా ప్రభావం ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజ్ ప్రాంతం పక్షి వీక్షణకు ప్రసిద్ధి చెందగా.. పాంటా సాహిబ్ గురుద్వారా యమునా ప్రవాహంలో ఆధ్యాత్మికతను మరింత పెంచుతుంది. అక్కడి నుంచి నీటిని కాలువల ద్వారా వ్యవసాయానికి మళ్లిస్తున్నారు.
పుష్కరాలు ఇలా..
పుష్కరాలు మంగళవారం ప్రారంభమై.. జూన్ 13 వరకు కొనసాగనున్నాయి. పుష్కర కాలంలో తొలి 12 రోజులను ఆది పుష్కరాలు, చివరి 12 రోజులను అంత్య పుష్కరాలు అని పిలుస్తారు. ఈ కాలంలో భక్తులు నదీ స్నానాలు చేసి పితృ తర్పణాలు నిర్వహిస్తారు. అన్నదానం, వస్త్రదానం వంటి దానాలు చేయడం ద్వారా విశేష ఫలితం లభిస్తుందని విశ్వాసం ఉంది. సాయంత్ర వేళల్లో నదీ తీరాల్లో దీపాలు వదలడం, హారతి ఇవ్వడం పుష్కరాల ప్రత్యేకతగా నిలుస్తుంది.
ఎలా వెళ్లాలంటే..?
మధుర, ఆగ్రా ప్రాంతాలకు దేశంలోని ప్రధాన నగరాలన్నింటి నుంచి రైలు సౌకర్యం అందుబాటులో ఉంది. ఢిల్లీ నుంచి యమునా ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా కేవలం మూడు నుంచి నాలుగు గంటల్లోనే ప్రయాణం పూర్తి చేయవచ్చు. ఆగ్రాలో విమానాశ్రయం కూడా అందుబాటులో ఉండటంతో దేశ, విదేశీ భక్తులు సులభంగా చేరుకునే అవకాశం ఉంది. యమునా పుష్కరాలు కేవలం ఒక మతపరమైన కార్యక్రమంగా కాకుండా.. భారతీయ సంస్కృతి, చరిత్ర, ఆధ్యాత్మికతలను ఒకే వేదికపై కలిపే మహా సమ్మేళనంగా నిలుస్తున్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Employees Health Scheme | ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలుకు హెల్త్‌కేర్ ట్రస్ట్ .. కాంగ్రెస్ సర్కారు నిర్ణయం..
జూన్ 1, 2026

Pawan Kalyan | పవన్ కల్యాణ్‌కు తెలంగాణ పోలీసుల షాక్.. సభకు అనుమతి నిరాకరణ..!
జూన్ 1, 2026

ICC Meeting | టెస్టులు, టీ20ల్లో కీలక మార్పులు.. ఐసీసీ బోర్డు మీటింగ్ గ్రీన్ సిగ్నల్..
జూన్ 1, 2026
తాజావార్తలు
- ●Singer Sunitha | హీరోగా సింగర్ సునీత కొడుకు - బావమరదళ్ల ప్రేమకథలో మలుపు
- ●Sonal Chauhan | బాలకృష్ణ హీరోయిన్ గ్లామర్ షో
- ●Employees Health Scheme | ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలుకు హెల్త్‌కేర్ ట్రస్ట్ .. కాంగ్రెస్ సర్కారు నిర్ణయం..
- ●K Annamalai | బీజేపీకి 'సింగం' గుడ్‌బై? కొత్త పార్టీ దిశగా అన్నామలై అడుగులు.. అసలేం జరుగుతోంది?
- ●Pawan Kalyan | పవన్ కల్యాణ్‌కు తెలంగాణ పోలీసుల షాక్.. సభకు అనుమతి నిరాకరణ..!
- ●Tollywood | నాగార్జున, రాజశేఖర్ హీరోలుగా మల్టీస్టారర్ మూవీ - గ్రాండ్‌గా లాంఛ్ కానీ....

Singer Sunitha | హీరోగా సింగర్ సునీత కొడుకు - బావమరదళ్ల ప్రేమకథలో మలుపు

Sonal Chauhan | బాలకృష్ణ హీరోయిన్ గ్లామర్ షో

Employees Health Scheme | ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలుకు హెల్త్‌కేర్ ట్రస్ట్ .. కాంగ్రెస్ సర్కారు నిర్ణయం..

K Annamalai | బీజేపీకి 'సింగం' గుడ్‌బై? కొత్త పార్టీ దిశగా అన్నామలై అడుగులు.. అసలేం జరుగుతోంది?



