త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhatti Vikramarka | కృష్ణా జలాల్లో న్యాయమైన వాటానే కోరుతున్నాం

Bhatti Vikramarka | కృష్ణా జ‌లాల విష‌యంలో ప్ర‌త్యేకంగా ఏం కోరుకోవ‌డం లేద‌ని, కేవ‌లం న్యాయ‌మైన వాటానే కోరుతున్నామ‌ని రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క పేర్కొన్నారు. కాళేశ్వ‌రం, పాల‌మూరు ఎత్తిపోత‌ల‌కు ఆర్థిక సాయం అందించాల‌ని కేంద్రాన్ని ఆయ‌న కోరారు.

S

Telangana | Published On Aug 20, 2026, 6.34 pm IST

Bhatti Vikramarka | కృష్ణా జలాల్లో న్యాయమైన వాటానే కోరుతున్నాం
Advertisement

దిగువ రాష్ట్రాల హ‌క్కుల‌కు న‌ష్టం క‌లిగించొద్దు
ఏక‌ప‌క్ష చ‌ర్య‌ల‌ను అడ్డుకోవాలి
కాళేశ్వ‌రం, పాల‌మూరుకు ఆర్థిక సాయం అందించండి
ఏపీ పునర్వ్యవస్థీకరణ సమస్యలకు త్వరగా ముగింపు
దక్షిణాది రాష్ట్రాల సమస్యలకు చర్చలతోనే పరిష్కారం
31వ సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో
తెలంగాణ డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క కీలక వ్యాఖ్యలు

Bhatti Vikramarka | త్రినేత్ర‌.న్యూస్ : కృష్ణా జ‌లాల విష‌యంలో ప్ర‌త్యేకంగా ఏం కోరుకోవ‌డం లేద‌ని, కేవ‌లం న్యాయ‌మైన వాటానే కోరుతున్నామ‌ని రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క పేర్కొన్నారు. కాళేశ్వ‌రం, పాల‌మూరు ఎత్తిపోత‌ల‌కు ఆర్థిక సాయం అందించాల‌ని కేంద్రాన్ని ఆయ‌న కోరారు. కేంద్రం–రాష్ట్రాల మధ్య, రాష్ట్రాల పరస్పర సమస్యల పరిష్కారంలో సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ కీలక వేదికగా నిలుస్తుందన్నారు. సహకార సమాఖ్య విధానంలో భాగంగా సమస్యలను సుదీర్ఘ చర్చలకే పరిమితం చేయకుండా నిర్ణయాలు తీసుకుని, వాటిని వేగంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.

మహాబలిపురంలోని చారిత్రక నిర్మాణాలను ప్రస్తావించిన భట్టి విక్రమార్క.. ఒక బలమైన నిర్మాణానికి ప్రతి భాగం ఒకేలా ఉండాల్సిన అవసరం లేదని, ప్రతి భాగం తన వంతు భారాన్ని మోస్తేనే నిర్మాణం బలంగా ఉంటుందని అన్నారు. భారత సమాఖ్య వ్యవస్థను కూడా ఇదే స్ఫూర్తితో చూడాలని సూచించారు. ప్రతి విషయంలో ఏకాభిప్రాయం ఉన్నప్పుడే సమాఖ్య వ్యవస్థకు పరీక్ష కాదని, రాష్ట్రాల ప్రయోజనాలు భిన్నంగా ఉన్నప్పుడు న్యాయబద్ధమైన పరిష్కారాన్ని కనుగొనడమే అసలు పరీక్ష అని చెప్పారు.

పోటీతో పాటు సహకారం అవసరం

పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు, ప్రతిభ కోసం రాష్ట్రాల మధ్య పోటీ సహజమేనని భట్టి విక్రమార్క అన్నారు. అయితే నదులు, విద్యుత్‌ గ్రిడ్లు, కార్మికులు, వ్యాపారాలు రాష్ట్ర సరిహద్దులను దాటి ప్రయాణిస్తాయని గుర్తుచేశారు.
“ప్రభుత్వ ఫైళ్ల కంటే సమస్యలు సరిహద్దులను వేగంగా దాటుతాయి” అని ఆయన చమత్కరించారు. తెలంగాణ దృష్టిలో సహకార సమాఖ్య విధానం అంటే.. నిబంధనలు స్పష్టంగా ఉండటం, వివాద పరిష్కారానికి ఏర్పాటు చేసిన సంస్థలను గౌరవించడం, అన్ని రాష్ట్రాలకు ఒకే నిబంధనలు వర్తింపజేయడమని వివరించారు.

కృష్ణా జ‌లాల్లో ఎలాంటి ప్ర‌త్యేక ప్రయోజ‌నం కోర‌డం లేదు

కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ఎలాంటి ప్రత్యేక ప్రయోజనాన్ని కోరడం లేదని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికే ఏర్పాటైన న్యాయపరమైన వ్యవస్థల ద్వారా రాష్ట్రానికి దక్కాల్సిన న్యాయమైన వాటాను మాత్రమే కోరుతున్నామని చెప్పారు. దిగువ రాష్ట్రాల హక్కులకు నష్టం కలిగించే ఏకపక్ష చర్యలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కృష్ణా జలాల పంపకాల అంశం ఇప్పటికే KWDT-II పరిధిలో పరిశీలనలో ఉన్నందున, పాలమూరు–రంగారెడ్డి, నక్కలగండి ఎత్తిపోతల పథకాల అంశాలను కూడా ఏర్పాటు చేసిన న్యాయ ప్రక్రియ ద్వారానే పరిష్కరించాలని తెలంగాణ కోరుతోందన్నారు.

కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డికి కేంద్ర సాయం కోరిన తెలంగాణ

కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు కేంద్ర ఆర్థిక సహకారం అందించాలని భట్టి విక్రమార్క కోరారు. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ చర్యలు కొనసాగుతున్నాయని, తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును పునరుద్ధరించే ప్రక్రియను కూడా ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో మిగిలిన పనులను పూర్తి చేసి, పథకాన్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్రం సహకరించాలని కోరారు.

ఏపీ పునర్వ్యవస్థీకరణ సమస్యలకు త్వరగా ముగింపు

ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014 అమలుకు 12 ఏళ్లు పూర్తవుతున్నా తెలంగాణ–ఆంధ్రప్రదేశ్‌ మధ్య ఇంకా అనేక సమస్యలు పరిష్కారం కాలేదని భట్టి విక్రమార్క అన్నారు. ఈ సమస్యలకు చట్టం, న్యాయపరమైన నిబంధనలకు అనుగుణంగా తుది పరిష్కారం చూపాలని కోరారు. పరిష్కారం పేరుతో అంతులేని ఉత్తర ప్రత్యుత్తరాలు, కొన్నేళ్లకొకసారి కొత్త వివరణలు ఉండకూడదని స్పష్టం చేశారు.

షెడ్యూల్‌-9 సంస్థల విభజనపై తెలంగాణ వైఖరి

షెడ్యూల్‌-9లోని ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్ల విభజన అంశం ఇంకా పెండింగ్‌లోనే ఉందన్నారు. ప్రధాన కార్యాలయాలు, ఇతర అంశాలపై విభేదాల కారణంగా ప్రక్రియ పూర్తికాలేదని తెలిపారు. 23 షెడ్యూల్‌-9 సంస్థలపై తెలంగాణ తన అభిప్రాయాలను ఇప్పటికే కేంద్ర హోంశాఖకు సమర్పించిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014, కేంద్ర హోంశాఖ మరియు కేంద్ర హోంమంత్రి సూచించిన విధానానికి అనుగుణంగా సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందన్నారు.

షెడ్యూల్‌-10 సంస్థలపై చట్ట ప్రకారమే పరిష్కారం

కొన్ని షెడ్యూల్‌-10 సంస్థల ఆస్తుల విభజనకు ఆంధ్రప్రదేశ్‌ కోరిన అంశాలను తెలంగాణ వ్యతిరేకించింది. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ 75 కింద సౌకర్యాల కొనసాగింపు మినహా ఆస్తుల విభజనకు చట్టంలో ఆధారం లేదని తెలంగాణ తన వైఖరిని వెల్లడించింది. ఈ అంశం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో కూడా పెండింగ్‌లో ఉన్నందున, న్యాయ ప్రక్రియకు అనుగుణంగానే పరిష్కరించాలని తెలంగాణ కోరింది.

దక్షిణాది రాష్ట్రాల భవిష్యత్‌ సవాళ్లు

రాబోయే రోజుల్లో దక్షిణాది రాష్ట్రాల మధ్య సహకారం మరింత పెరగాల్సిన అవసరం ఉందని భట్టి విక్రమార్క అన్నారు. నీటి భద్రత, ఇంధనం, వాతావరణ మార్పులను ఎదుర్కొనే సామర్థ్యం, పట్టణీకరణ, లాజిస్టిక్స్‌, ఆర్థిక పోటీతత్వం వంటి అంశాలు రాష్ట్రాల సరిహద్దులను దాటి ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. “దక్షిణ భారతదేశం కలిసి అభివృద్ధి చెందితే.. భారత్‌ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది” అని ఆయన అన్నారు.

32వ సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌కు హైదరాబాద్‌ ఆతిథ్యం

తదుపరి 32వ సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని భట్టి విక్రమార్క ప్రకటించారు. కృష్ణా జలాల వంటి అంశాలు ట్రిబ్యునల్‌కు వెళ్లకుండా, కమిటీ అవసరం లేకుండా, మరో దఫా ఉత్తర ప్రత్యుత్తరాలు లేకుండానే పరిష్కారం కావాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ అన్ని దక్షిణాది రాష్ట్రాలకు ఆతిథ్యం, సహకారంతో స్వాగతం పలుకుతుందని తెలిపారు.

తెలంగాణ సందేశం స్పష్టం

సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో భట్టి విక్రమార్క ప్రసంగం ద్వారా తెలంగాణ తన హక్కుల విషయంలో స్పష్టమైన వైఖరిని, పరిష్కారాల విషయంలో నిర్మాణాత్మక దృక్పథాన్ని వెల్లడించింది. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా, ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర సహకారం, పెండింగ్‌ పునర్వ్యవస్థీకరణ సమస్యలకు కాలపరిమితిలో పరిష్కారం, పునర్వ్యవస్థీకరణ చట్టం–2014కు కట్టుబాటు, అన్ని రాష్ట్రాలకు సమాన నిబంధనలు, దక్షిణాది రాష్ట్రాల మధ్య మరింత సహకారం.. ఇవే తెలంగాణ ప్రధాన డిమాండ్లుగా ఆయన ప్రసంగంలో స్పష్టం చేశారు. విభిన్న ప్రయోజనాలు ఉండటం సమాఖ్య విధానానికి సమస్య కాదు.. ఆ విభిన్న ప్రయోజనాలను న్యాయబద్ధంగా, సమర్థంగా సమన్వయం చేసే సంస్థలు ఉండటమే అసలైన సహకార సమాఖ్య విధానం అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Advertisement
Advertisement