త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CS Sanjay Jaju | పథకాల అమలులో వేగం పెంచాలి.. అధికారులకు సీఎస్‌ సంజయ్‌ జాజు దిశానిర్దేశం

CS Sanjay Jaju | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును మరింత పటిష్ఠం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సంజయ్‌ జాజు అధికారులకు సూచించారు. వివిధ శాఖల మధ్య సమన్వయం పెరిగితేనే ప్రభుత్వ లక్ష్యాలు వేగంగా నెరవేరుతాయని ఆయన పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో సీఎస్‌ పలు అంశాలపై సమీక్షించారు.

P

Telangana | Published On Aug 3, 2026, 9.01 pm IST

CS Sanjay Jaju | పథకాల అమలులో వేగం పెంచాలి.. అధికారులకు సీఎస్‌ సంజయ్‌ జాజు దిశానిర్దేశం
Advertisement

CS Sanjay Jaju | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును మరింత పటిష్ఠం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సంజయ్‌ జాజు అధికారులకు సూచించారు. వివిధ శాఖల మధ్య సమన్వయం పెరిగితేనే ప్రభుత్వ లక్ష్యాలు వేగంగా నెరవేరుతాయని ఆయన పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో సీఎస్‌ పలు అంశాలపై సమీక్షించారు. ముఖ్యమంత్రి దార్శనికతకు అనుగుణంగా రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిని వేగవంతం చేయాలని సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాల పురోగతి, లక్ష్యాలు, అమలు స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రత్యేక డాష్‌బోర్డును ఏర్పాటు చేస్తున్నామని సీఎస్‌ తెలిపారు. పథకాలు నిర్ణీత లక్ష్యాల మేరకు అమలయ్యేలా పర్యవేక్షించేందుకు ‘స్పీడ్‌ సెల్‌’ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

త్వరలో సమీక్ష

మరో వారం రోజుల్లో ఫ్లాగ్‌షిప్‌ పథకాలు, ప్రభుత్వ శాఖల పనితీరు, లక్ష్యాలు, పురోగతి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్ర ప్రాయోజిత పథకాలపై ముఖ్యమంత్రి ప్రభుత్వ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించనున్నారని తెలిపారు. ఇందుకు అవసరమైన పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రతి శాఖలో అమలవుతున్న వినూత్న కార్యక్రమాలు, విజయగాథలపై ప్రత్యేక నివేదికలు రూపొందించాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు గ్రామ పంచాయతీలకు కూడా టీ-ఫైబర్‌ కనెక్టివిటీ అందించే చర్యలు తీసుకోవాలని సీఎస్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన విజన్‌ డాక్యుమెంట్‌-2047 లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాల్సిన వినియోగ ధ్రువీకరణ పత్రాలు (యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లు), నివేదికలు, ప్రతిపాదనలు గడువులోగా పంపించాలని అధికారులను ఆదేశించారు. తద్వారా కేంద్ర నిధుల విడుదలకు ఆటంకాలు లేకుండా చూడాలన్నారు.

ఖేలో ఇండియాకు భారీ ఏర్పాట్లు

నవంబర్‌ 14 నుంచి రాష్ట్రంలో నిర్వహించనున్న ఖేలో ఇండియా క్రీడోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు వివిధ కమిటీలను ఏర్పాటు చేయాలని సీఎస్‌ సూచించారు. ఈ క్రీడల్లో 7 వేలకు పైగా క్రీడాకారులు, అధికారులు, కోచ్‌లు పాల్గొంటారని తెలిపారు. 26 క్రీడాంశాల్లో పోటీలు 11 వేదికల్లో నిర్వహించనున్న నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు పక్కాగా ఉండాలని ఆదేశించారు.

ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన

నగర ప్రాంతాల్లో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు డీజిల్‌తో నడిచే ఆటోలకు ఎలక్ట్రిక్‌ ఇంజన్లు అమర్చే పథకాన్ని వేగవంతం చేయాలని సీఎస్‌ సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వరి సాగుకు అవసరమైన స్థాయిలో నీటి లభ్యత ఉండకపోవచ్చని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జయేశ్‌ రంజన్‌, వికాస్‌రాజ్‌, మహేష్‌దత్‌ ఎక్కా, సవ్యసాచి ఘోష్‌, అహ్మద్‌ నదీమ్‌, నవీన్‌ మిట్టల్‌, ప్రత్యేక కార్యదర్శులు సందీప్‌ సుల్తానియా, క్రిస్టినా చోంగ్తూ, వాణి ప్రసాద్‌, దాన కిశోర్‌, రఘునందన్‌రావు పాల్గొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement