VB-G RAM G | వీబీజీ రామ్‌జీ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాం.. కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం
VB-G RAM G | వీబీజీ రామ్‌జీ చట్టం–2025 రాష్ట్రాల రాజ్యాంగబద్ధ హక్కులను హరించే విధంగా, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గ్రామీణ పేదల ఉపాధి హక్కు, రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనా అధికారాలు, ఆర్థిక స్వయం ప్రతిపత్తిపై ప్రతికూల ప్రభావం చూపే ఈ చట్టంలోని నిబంధనలను న్యాయపరంగా, రాజ్యాంగపరంగా వ్యతిరేకించాలని కేబినెట్ సబ్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది.
నిబంధనలను వెంటనే సవరించాలి
రాష్ట్రంపై 40 శాతం భారం మోపడం సరికాదు
జూలై 2న కేబినెట్‌లో సబ్ కమిటీ సిఫార్సులపై తుది నిర్ణయం
VB-G RAM G | త్రినేత్ర.న్యూస్ : వీబీజీ రామ్‌జీ చట్టం–2025 రాష్ట్రాల రాజ్యాంగబద్ధ హక్కులను హరించే విధంగా, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గ్రామీణ పేదల ఉపాధి హక్కు, రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనా అధికారాలు, ఆర్థిక స్వయం ప్రతిపత్తిపై ప్రతికూల ప్రభావం చూపే ఈ చట్టంలోని నిబంధనలను న్యాయపరంగా, రాజ్యాంగపరంగా వ్యతిరేకించాలని కేబినెట్ సబ్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఈ మేరకు రూపొందించిన సిఫార్సులను జూలై 2న జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని సమావేశం నిర్ణయించింది.
రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన వీబీజీ రామ్‌జీ చట్టం–2025 ప్రభావాలపై కేబినెట్ సబ్ కమిటీ రెండో సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రి సీతక్క ప్రత్యక్షంగా పాల్గొనగా, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది శాఖ స్పెషల్ సీఎస్ దాన కిషోర్, కమీషనర్ దివ్యా దేవరాజన్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, నిపుణులు సమావేశంలో పాల్గొని చట్టంలోని వివిధ అంశాలపై సమగ్ర నివేదికను సమర్పించారు.
రాష్ట్రాలకు నిర్ణయాధికారం కల్పించకపోవడం తీవ్ర అభ్యంతరకరం
వీబీజీ రామ్‌జీ చట్టం ప్రకారం ఉపాధి హామీ పథకం అమలులో రాష్ట్ర ప్రభుత్వాలు సుమారు 40 శాతం వరకు ఆర్థిక భారం భరించాల్సి వస్తున్నప్పటికీ, పనుల ఎంపిక, ప్రణాళిక, ఆమోదం, అమలు, పర్యవేక్షణ వంటి కీలక అంశాలన్నింటిలోనూ రాష్ట్రాలకు నిర్ణయాధికారం కల్పించకపోవడం తీవ్ర అభ్యంతరకరమని సమావేశం అభిప్రాయపడింది. నిధుల బాధ్యత రాష్ట్రాలపై మోపుతూ, అధికారాలను పూర్తిగా కేంద్రం వద్దే కేంద్రీకరించడం భారత రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని సభ్యులు పేర్కొన్నారు.
లక్షలాది నిరుపేద కూలీ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు
గ్రామీణ పేదల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపే 60 రోజుల ఉపాధి విరామం నిబంధన ఆచరణ సాధ్యం కాదని మంత్రులు స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనుల స్వభావం, వాతావరణ పరిస్థితులు, పేద కుటుంబాల జీవనాధారాన్ని దృష్టిలో ఉంచుకుంటే 60 రోజులపాటు ఉపాధి లేకుండా ఉండడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. ఈ నిబంధన వల్ల లక్షలాది నిరుపేద కూలీ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
60 రోజుల విరామ కాలంలోనూ కూలీలకు ఉపాధి
ఈ నేపథ్యంలో 60 రోజుల విరామ కాలంలోనూ కూలీలకు ఉపాధి కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావచ్చా అనే అంశంపైనా సమావేశంలో విస్తృతంగా చర్చించారు. అయితే కేంద్రం రూపొందించిన వీబీజీ రామ్‌జీ చట్టానికి భిన్నంగా రాష్ట్రం ప్రత్యేక చట్టం అమలు చేస్తే, కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి సంబంధించిన నిధులను నిలిపివేసే అవకాశం ఉందని అధికారులు వివరించారు. దీంతో రాజ్యాంగ, న్యాయపరమైన అన్ని కోణాలను పరిశీలించి ముందుకు వెళ్లాలని సమావేశం నిర్ణయించింది.
డిమాండ్ ఆధారంగా నిధులు విడుదల చేయాలి
ప్రస్తుతం కేంద్రం అమలు చేస్తున్న నార్మెటివ్ అలొకేషన్ విధానం గ్రామీణ ప్రాంతాల వాస్తవ అవసరాలకు అనుగుణంగా లేదని సమావేశం అభిప్రాయపడింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అసలు ఉద్దేశం ప్రకారం పని కోరిన ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని సభ్యులు పేర్కొన్నారు. అందువల్ల నార్మెటివ్ పరిమితులు కాకుండా డిమాండ్ ఆధారంగా నిధులు విడుదల చేసే విధానాన్ని కేంద్రం వెంటనే అమలు చేయాలని నిర్ణయించారు.
అదనపు భారాన్ని కేంద్రమే భరించాలి..
తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పరిరక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సమావేశం నిర్ణయించింది. కొత్త చట్టం వల్ల రాష్ట్రానికి కలిగే అదనపు ఆర్థిక, పరిపాలనా భారం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం భరించాలని డిమాండ్ చేయాలని సభ్యులు అభిప్రాయపడ్డారు. అలాగే సోమవారం ఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో జరిగే సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాలు, సూచనలు, సవరణల ప్రతిపాదనలను స్పష్టంగా వినిపించాలని నిర్ణయించారు.
దీంతో పాటు వీబీజీ రామ్‌జీ చట్టంలోని అన్ని కీలక నిబంధనలను సమగ్రంగా సమీక్షించారు. గ్రామీణ ఉపాధి హక్కు, పేదల జీవనోపాధి, రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలు, అమలు వ్యవస్థ, ఆర్థిక బాధ్యతలు, కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఈ చట్టం చూపే ప్రభావాన్ని సభ్యులు విస్తృతంగా చర్చించారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వానికి పంపాల్సిన అధికారిక అభిప్రాయాలు, సవరణల సిఫార్సులను ఖరారు చేశారు.
సమీక్ష సమావేశం అనంతరం వివిధ కార్మిక సంఘాలు, పౌరసంఘాలు, ప్రజాసంఘాల ప్రతినిధులతో కేబినెట్ సబ్ కమిటీ ప్రత్యేకంగా సమావేశమైంది. వీబీజీ రామ్‌జీ చట్టంపై వారు వ్యక్తం చేసిన అభ్యంతరాలు, సూచనలు, ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను సభ్యులు శ్రద్ధగా విన్నారు. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణలో అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వంతో చర్చలు కొనసాగించడంతో పాటు, అవసరమైతే న్యాయస్థానాలను కూడా ఆశ్రయించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగాలని సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయించింది.
తాజావార్తలు
- ●CM Revanth Reddy | రేపు నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
- ●Netflix | ఓటీటీలో ప్రభాస్ డాక్యుమెంటరీ సిరీస్ ట్రెండింగ్ - హాలీవుడ్ సినిమాలను దాటేసి...
- ●Afghanistan Earthquake | ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. భారత్, పాకిస్తాన్లలో వణికిన జనం
- ●Kavitha | మహిళా రిజర్వేషన్ల అమలుకు ఢిల్లీలో భారీ సభ నిర్వహిద్దాం : కల్వకుంట్ల కవిత
- ●Allu Sneha Reddy | నిర్మాతగా అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్ - జోకర్ మూవీ లాంఛ్ ఈవెంట్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా స్నేహారెడ్డి
- ●KTR | ఆర్ఎస్పీకి భద్రత తగ్గించడం పూర్తిగా కక్ష సాధింపు చర్యే : కేటీఆర్

CM Revanth Reddy | రేపు నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

Netflix | ఓటీటీలో ప్రభాస్ డాక్యుమెంటరీ సిరీస్ ట్రెండింగ్ - హాలీవుడ్ సినిమాలను దాటేసి...

Afghanistan Earthquake | ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. భారత్, పాకిస్తాన్లలో వణికిన జనం

Kavitha | మహిళా రిజర్వేషన్ల అమలుకు ఢిల్లీలో భారీ సభ నిర్వహిద్దాం : కల్వకుంట్ల కవిత





