త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Cabinet Decisions | ఇందిరమ్మ ఇండ్లు, కాలేజీల్లో మధ్యాహ్న భోజనం, పుష్కరాలకు నిధులు.. తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాల పూర్తి వివరాలివే

తెలంగాణ క్యాబినెట్ సంచలన నిర్ణయాలు తీసుకుంది. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు, జూనియర్ కాలేజీల్లో ఉచిత అల్పాహారం, గోదావరి పుష్కరాలకు భారీ నిధులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

J

Telangana | Published On May 23, 2026, 9.57 pm IST

Telangana Cabinet Decisions | ఇందిరమ్మ ఇండ్లు, కాలేజీల్లో మధ్యాహ్న భోజనం, పుష్కరాలకు నిధులు.. తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాల పూర్తి వివరాలివే
Advertisement

Telangana Cabinet Decisions | త్రినేత్ర.న్యూస్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధ్యక్షతన జరిగిన రాష్ట్ర క్యాబినెట్ (State Cabinet) సమావేశం ప్రజలకు వరాల జల్లు కురిపించింది. సొంతిల్లు లేని పేదలకు రెండో విడత 'ఇందిరమ్మ ఇండ్ల' (Indiramma Indlu) మంజూరుతో పాటు, విద్యార్థులకు ఉచిత అల్పాహారం, గోదావరి పుష్కరాలకు భారీగా నిధులు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పలు చారిత్రక నిర్ణయాలు తీసుకుంది. పేదల సంక్షేమమే లక్ష్యంగా తీసుకున్న ఆ కీలక నిర్ణయాల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రెండో విడత 'ఇందిరమ్మ'కు గ్రీన్ సిగ్నల్

సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర క్యాబినెట్ భారీ అడుగు వేసింది. రెండో విడత కింద ఏకంగా 2 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసింది. దీని ప్రకారం ప్రతి నియోజకవర్గానికి 2 వేల చొప్పున ఇండ్లు కేటాయించనున్నారు.

పాత ఇండ్లకూ సాయం: ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో మొదలై, మధ్యలో ఆగిపోయిన ఇందిరమ్మ ఇండ్లను పూర్తి చేసేందుకు కూడా ప్రభుత్వం సాయం ప్రకటించింది. పునాదులు పూర్తయి ఆగిన ఇండ్లకు రూ.3 లక్షలు, గోడలు పూర్తయి శ్లాబు పడని ఇండ్లకు రూ.2 లక్షల చొప్పున ఇవ్వనున్నారు. ఇలా నియోజకవర్గానికి 500 ఇండ్లకు నిధులు కేటాయిస్తారు.

జూన్‌లో గృహ ప్రవేశాలు: తొలి విడత కింద మంజూరైన ఇండ్లలో దాదాపు లక్ష ఇండ్ల గృహ ప్రవేశాలు జూన్ 2 నాటికి జరగనున్నాయి.

ఆదివాసీలకు ప్రాధాన్యం: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కొఠారి గ్రామంలో కొలాం ఆదివాసీల కోసం నిర్మించిన 28 ఇళ్లను జూన్ 1న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వయంగా ప్రారంభించనున్నారు.

గుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణ

హైదరాబాద్ (Hyderabad) పరిధిలోని 24 నియోజకవర్గాల్లో అల్పాదాయ వర్గాల (LIG) కోసం ఏకంగా లక్ష ఇండ్లు నిర్మించాలని క్యాబినెట్ నిర్ణయించింది. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా వివిధ సర్వేల ద్వారా గుర్తించిన 15 వేల గుడిసెల కుటుంబాలకు తక్షణమే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి, తెలంగాణను 'గుడిసెలు లేని ఆదర్శ రాష్ట్రం'గా నిలపాలని తీర్మానించింది.

జూనియర్ కాలేజీ విద్యార్థులకు 'ఫ్రీ బ్రేక్‌ఫాస్ట్'

విద్యా రంగానికి సంబంధించి ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ పాఠశాలలతో పాటు రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలల్లోనూ (Junior Colleges) మధ్యాహ్న భోజన పథకం (Mid-day meals) అమలు చేయనున్నారు. అంతేకాకుండా, ఉదయం పూట విద్యార్థులకు పౌష్టికమైన అల్పాహారంతో (Breakfast) పాటు పాలు అందించాలని క్యాబినెట్ నిర్ణయించింది.

ప్రాజెక్టులు, ఈవెంట్లకు భారీ నిధులు

గోదావరి పుష్కరాలు: వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జులై 7 వరకు జరగనున్న గోదావరి పుష్కరాల (Godavari Pushkaralu) ఏర్పాట్ల కోసం రూ.1000 కోట్ల భారీ నిధులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో తొలి విడతగా రూ.300 కోట్లు వెంటనే విడుదల చేయనున్నారు.

పాలమూరు-రంగారెడ్డి: ఈ ఎత్తిపోతల పథకం భూసేకరణ, పునరావాసం, ఇతర మౌలిక వసతుల కల్పన కోసం రూ.587 కోట్లు కేటాయించారు.

విద్యుత్ రంగానికి బూస్ట్: కేంద్రం అమలు చేస్తున్న ఆర్‌డీఎస్‌ఎస్ (RDSS) పథకంలో తెలంగాణ డిస్కంలు చేరేందుకు ఆమోద ముద్ర పడింది.

పాలసీలు, పరిపాలనా సంస్కరణలు

తెలంగాణను 2030 నాటికి ప్రపంచంలోని టాప్-5 లైఫ్ సైన్సెస్ (Life Sciences) హబ్‌గా నిలబెట్టే లక్ష్యంతో నెక్స్ట్ జనరేషన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026–30 కి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దావోస్‌లో లాంఛనంగా ఆవిష్కరించిన ఈ పాలసీ ద్వారా.. రాబోయే ఐదేళ్లలో ఏకంగా 25 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.2 లక్షల కోట్లు) పెట్టుబడులు ఆకర్షించడం, 5 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇకపై రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (R&D) యూనిట్లను కూడా పరిశ్రమలుగానే గుర్తించనున్నారు.

మరోవైపు, పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలోని డీసీఎంఎస్‌ (DCMS) లను మార్క్‌ఫెడ్‌ (Markfed) లో, అలాగే టీజీఆర్‌ఐసీ (TGRIC) ని హాకా (HACA) లో విలీనం చేయాలని క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.

Advertisement
Advertisement