త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chalo Assembly Telangana | రణరంగంగా అసెంబ్లీ పరిసరాలు: ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు, విద్యార్థులు, సర్వేయర్ల ముట్టడి

పెండింగ్ బకాయిలు, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు, విద్యార్థులు, సర్వేయర్లు అసెంబ్లీని ముట్టడించారు. ఉద్రిక్తతకు దారితీసిన ఈ ఘటనల వివరాలు ఇవే.

J

Telangana | Published On Sep 8, 2026, 4.49 pm IST

Chalo Assembly Telangana | రణరంగంగా అసెంబ్లీ పరిసరాలు: ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు, విద్యార్థులు, సర్వేయర్ల ముట్టడి
Advertisement
  • సుమారు రూ.2 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల ఆందోళన
  • ఫీజు రీయింబర్స్‌మెంట్, జీవో 97 రద్దుకై విద్యార్థి సేన ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి యత్నం
  • రేవంత్ సర్కార్ వైఖరికి నిరసనగా రోడ్డెక్కి, ఆందోళన బాట పట్టిన లైసెన్స్‌డ్ సర్వేయర్లు
  • ఆందోళనకారులను అడ్డుకుని, వెంబడించి మరీ అరెస్ట్ చేసిన పోలీసులు

Chalo Assembly Telangana | త్రినేత్ర.న్యూస్ : సెప్టెంబర్ 8, 2026, మంగళవారం నాడు తెలంగాణ శాసనసభ (Assembly) పరిసరాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు, విద్యార్థి సంఘాలు, లైసెన్స్‌డ్ సర్వేయర్లు ఒకేసారి అసెంబ్లీ ముట్టడికి యత్నించడంతో వాతావరణం వేడెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వివిధ వర్గాలు రోడ్డెక్కడంతో భారీగా పోలీసులు మోహరించారు.

రోడ్డెక్కిన ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు

దశాబ్దాలుగా ఆర్టీసీకి సేవలందించి పదవీ విరమణ పొందిన ఉద్యోగులు 'చలో అసెంబ్లీ' (Chalo Assembly) కార్యక్రమానికి పిలుపునిచ్చారు. పీఆర్సీ (PRC) బకాయిలు, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ (Leave encashment) వంటి సుమారు రూ. 2,000 కోట్ల పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒక్కొక్కరికి రూ. 5 లక్షల నుంచి 10 లక్షల వరకు బకాయిలు రావాల్సి ఉందని, కొందరు బకాయిలు అందకనే మృత్యువాత పడ్డారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధాప్యంలో తమను ఆర్థికంగా ఇబ్బంది పెట్టకుండా, బతికుండగానే తమ డబ్బులు చెల్లించాలని వారు కోరారు. అసెంబ్లీ వైపు దూసుకెళ్తున్న పలువురు సీనియర్ రిటైర్డ్ ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విద్యార్థి సేన ఆందోళన

ఫీజు రీయింబర్స్మెంట్ (Fee reimbursement) బకాయిలు చెల్లించాలంటూ తెలంగాణ నవ నిర్మాణ విద్యార్థి సంఘం (విద్యార్థి సేన) నేతలు కూడా అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. జీవో 97, శక్తి స్కీమ్‌ను వెంటనే రద్దు చేసి, పాత పద్ధతిలోనే పాలిటెక్నిక్ విద్యను కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అసెంబ్లీ గేటు వద్ద ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు, వారిని అరెస్ట్ చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

సర్వేయర్లను పరుగెత్తించిన పోలీసులు

కాంగ్రెస్ సర్కార్ పాలనలో నిరుద్యోగులు ఒకవైపు, ఉద్యోగులు మరోవైపు తమ డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కుతున్నారు. ఈ జాబితాలో తాజాగా లైసెన్స్‌డ్ సర్వేయర్లు కూడా చేరారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ అసెంబ్లీని ముట్టడించిన వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఆందోళనకారులను వెంబడించి, పరుగెత్తించి మరీ పోలీసులు అరెస్ట్ చేసిన దృశ్యాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.

Advertisement
Advertisement