త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mock Assembly | అసెంబ్లీ సమావేశాలను తలపించిన టీనేజ్ బాలికల రాష్ట్రస్థాయి మాక్ అసెంబ్లీ

Mock Assembly | హైదరాబాద్ జూబ్లీ హాల్‌లోని పూర్వ శాసన మండలి భవనంలో బుధవారం నిర్వహించిన టీనేజ్ బాలికల రాష్ట్రస్థాయి మాక్ అసెంబ్లీ అసెంబ్లీ సమావేశాలను తలపిస్తూ ఆకట్టుకుంది.

S

Telangana | Published On Jun 10, 2026, 5.07 pm IST

Mock Assembly | అసెంబ్లీ సమావేశాలను తలపించిన టీనేజ్ బాలికల రాష్ట్రస్థాయి మాక్ అసెంబ్లీ
Advertisement

Mock Assembly | త్రినేత్ర‌.న్యూస్ : హైదరాబాద్ జూబ్లీ హాల్‌లోని పూర్వ శాసన మండలి భవనంలో బుధవారం నిర్వహించిన టీనేజ్ బాలికల రాష్ట్రస్థాయి మాక్ అసెంబ్లీ అసెంబ్లీ సమావేశాలను తలపిస్తూ ఆకట్టుకుంది. రాష్ట్రం నలుమూలల నుంచి ఎంపికైన కిశోర బాలికలు ప్రజాప్రతినిధుల పాత్రలో పాల్గొని ప్రజా సమస్యలపై చర్చించడం, అధికార విపక్ష సభ్యులుగా వ్యవహరించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

తెల్లటి ఖాదీ దుస్తులు, కండువాలు ధరించి రాజకీయ నాయకులను తలపించేలా హాజరైన బాలికలు సభలో క్రమశిక్షణతో పాల్గొని తమ వాదనలను వినిపించారు. ఆరోగ్యం, విద్య, ఆదివాసీ సంక్షేమం, సోషల్ మీడియా ప్రభావం, యువత భవిష్యత్ వంటి పలు అంశాలపై చర్చలు నిర్వహించారు. టీనేజ్ బాలికల స్నేహ సంఘాల ఆధ్వర్యంలో ముందుగా మండల స్థాయిలో, అనంతరం జిల్లా స్థాయిలో మాక్ అసెంబ్లీలు నిర్వహించగా, అందులో ప్రతిభ కనబరిచిన బాలికలను ఎంపిక చేసి రాష్ట్రస్థాయి మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క బాలికలను అభినందించారు.

అలాంటి ఆకర్షణలకు దూరంగా ఉండి లక్ష్యాలపై దృష్టి పెట్టాలి

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు టీనేజ్ బాలికలకు ఇలాంటి వేదికలను కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సభలో మాట్లాడిన బాలికలు ఆరోగ్యం, ఆదివాసీ సంక్షేమం, సోషల్ మీడియా ప్రభావం వంటి కీలక అంశాలను ప్రస్తావించడం అభినందనీయమన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా యువతను అత్యంత వేగంగా ఆకర్షిస్తోందని, ఒక రీల్ చూడడం ప్రారంభిస్తే గంటల తరబడి సమయం వృథా అయ్యే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. అలాంటి ఆకర్షణలకు దూరంగా ఉండి లక్ష్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు.

ఈ సభ ఒక సామాజిక దేవాలయం

రాజకీయాలంటే చాలా మంది యువత వెనుకడుగు వేస్తారని, అయితే ప్రజాసేవ చేయాలనే తపన ఉన్న వారు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. మారుమూల గ్రామాల నుంచి కూడా నాయకత్వం రావాలని, ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా చూసిన వారే సమర్థవంతంగా ప్రజల తరఫున మాట్లాడగలరని అన్నారు. "ఈ సభ ఒక సామాజిక దేవాలయం. ఇది ఒకరినొకరు విమర్శించుకునే వేదిక కాదు. ప్రజల సమస్యలకు పరిష్కారాలు చూపే చట్టాలు రూపొందించే పవిత్ర స్థలం" అని మంత్రి పేర్కొన్నారు.

భవిష్యత్ సమాజ నిర్మాణంలో మీ పాత్ర ఎంతో కీలకం

చిన్న వయసులోనే బాలికలు ప్రదర్శించిన పరిణితి, అవగాహన తనను ఎంతో ఆకట్టుకుందని తెలిపారు. రాజకీయాల్లోకి రావాలంటే చదువు అవసరం లేదనే భావన సరికాదని, నాయకత్వం వహించాలంటే మంచి విద్య, నిరంతర అధ్యయనం, విజ్ఞానం అవసరమని చెప్పారు. జ్ఞానం పెరిగిన కొద్దీ సమాజ సమస్యలను అర్థం చేసుకునే సామర్థ్యం పెరుగుతుందన్నారు. కిశోర బాలికలు క్రమశిక్షణ, సంస్కారం, శ్రమ అనే మూడు విలువలను జీవితంలో అలవర్చుకోవాలని సూచించారు. పోలీసు అధికారి లేదా సైనికుడికి లభించే గౌరవం మాదిరిగానే సమాజంలో గౌరవనీయ స్థానాలను అందుకోవాలని ఆకాంక్షించారు. "మీరు మా సైనికులు. భవిష్యత్ సమాజ నిర్మాణంలో మీ పాత్ర ఎంతో కీలకం" అని అన్నారు.

మహిళలు, యువతుల ఆర్థిక సాధికారత కోసం అనేక కార్యక్రమాలు

ప్రభుత్వం మహిళలు, యువతుల ఆర్థిక సాధికారత కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని పేర్కొన్న మంత్రి, మహిళా సంఘాల ద్వారా ప్రతి నెల రూ.70 వేల వరకు ఆదాయం పొందే అవకాశాలను కల్పిస్తున్నామని తెలిపారు. వడ్డీ లేని రుణాలు అందిస్తూ స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని గ్రామీణ మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, హైదరాబాద్ హైటెక్ సిటీ ప్రాంతంలో విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసుకునే అవకాశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల్పించారని వివరించారు.

సంస్కృతిని కాపాడుకోవడం జీవితాంతం కొనసాగాలి

"మన మూలాలు గ్రామాల్లో ఉండొచ్చు. కానీ మన లక్ష్యాలు ప్రపంచాన్ని చేరుకోవాలి. Our roots are local, our vision is global" అని మంత్రి పేర్కొన్నారు. యువత తమకు నచ్చిన, సమాజానికి ఉపయోగపడే రంగాన్ని ఎంచుకుని అందులో రాణించాలని సూచించారు. చదువు ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా గౌరవప్రదంగా జీవించే అవకాశం ఉంటుందని చెప్పారు. పెద్దలను గౌరవించడం, సంస్కృతిని కాపాడుకోవడం జీవితాంతం కొనసాగాలని సూచించారు. భవిష్యత్తులో ఇదే అసెంబ్లీ హాల్‌లో ప్రజాప్రతినిధులుగా, మంత్రులుగా, స్పీకర్లుగా, ముఖ్యమంత్రులుగా మాట్లాడే స్థాయికి ఎదగాలని బాలికలను ఆశీర్వదించారు. తమ అనుభవాలు, విజయగాథలను రాసి ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలని పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement