త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | తెలంగాణ ప్ర‌భుత్వానికి ‘సుప్రీం’ షాక్‌..!

Supreme Court | పోల‌వ‌రం-న‌ల్ల‌మ‌ల సాగ‌ర్ ప్రాజెక్టును స‌వాల్ చేస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై సుప్రీంకోర్టు సోమ‌వారం సంచ‌ల‌న తీర్పును వెలువరించింది. కాంగ్రెస్ స‌ర్కారు దాఖ‌లు చేసిన రిట్ పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు విచారించింది.

P

Telangana | Published On Jan 12, 2026, 4.39 pm IST

Supreme Court | తెలంగాణ ప్ర‌భుత్వానికి ‘సుప్రీం’ షాక్‌..!
Advertisement
  • పోల‌వ‌రం-న‌ల్ల‌మ‌ల సాగ‌ర్ ప్రాజెక్టు పిటిష‌న్‌పై విచార‌ణ‌కు నో
  • రిట్ పిటిష‌న్ విచార‌ణ అర్హ‌త లేద‌న్న ధ‌ర్మాస‌నం 
  • సివిల్ సూట్ ద్వారా ప‌రిష్క‌రించుకోవాల‌ని సూచ‌న‌
  • రిట్‌ను ఉప‌సంహ‌రించుకున్న తెలంగాణ స‌ర్కారు

Supreme Court | పోలవరం- నల్లమల సాగర్‌ ప్రాజక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తెలంగాణ దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌కు విచారణార్హత లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. పిటిషన్‌పై వాదనల సందర్భంగా తెలంగాణ ఆర్టికల్‌ 32 కింద దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇది రెండు రాష్ట్రాల సమస్యే కాదన్న సుప్రీంకోర్టు... అవసరం అనుకుంటే సివిల్‌ సూట్‌ దాఖలు చేసుకోవచ్చని అభిప్రాయపడింది. సీజేఐ ధర్మాసనం విముఖత చూపడంతో పిటిషన్‌ ఉపసంహరించుకుంటున్నట్లు తెలంగాణ తరపు సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ తెలిపారు. వెంటనే సివిల్‌ సూట్‌ దాఖలు చేయనున్నట్లు ధర్మాసనానికి తెలిపారు.

పోలవరం- నల్లమల సాగర్ ప్రీఫీజిబిలిటీ రిపోర్ట్‌కు సీడ‌బ్ల్యూసీ ఆమోదం తెలుపక ముందే ఆ ప్రాజెక్టు డీపీఆర్ తయారీ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లు పిలవడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆర్టికల్ 32 కింద దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌కు విచారణార్హత లేదని సుప్రీకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది. ప్రాథమికంగా ఈ రిట్‌ పిటిషన్‌కు విచారణార్హత లేకపోవడంతో దానిపై విచారణను ముగిస్తున్నామ‌ని తెలిపింది. అదే సమయంలో ఈ పిటిషన్‌లో పేర్కొన్న అన్ని అంశాలపై చట్ట ప్రకారం తగిన పరిష్కారాలు ఎంచుకోవడానికి పిటిషనర్‌కు స్వేచ్ఛ ఇస్తున్నట్లు ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈనెల 5న విచారించినప్పుడే సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం.. దాని విచారణార్హత‌పై అనుమానం వ్యక్తం చేసింది. ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్‌ దాఖలు చేసుకోవాలని ఆ రోజే సూచించింది. అయితే, ఆ సూచనను పరిశీలించి అభిప్రాయం చెప్పడానికి వారం రోజులు గడువు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ కోరడంతో ధర్మాసనం కేసు విచారణను 12వ తేదీకి వాయిదా వేసింది.

సోమ‌వారం విచారణ ప్రారంభమైన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం త‌ర‌ఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాద‌న‌లు వినిపించారు. తాము దాఖలు చేసిన పిటిషన్‌ను ఆర్టికల్ 32కింద విచారణకు స్వీకరించవచ్చని ధర్మాసనానికి విన్నవించారు. అందుకు సంబంధించిన వాదనలను లిఖిత పూర్వకంగా ధర్మాసనానికి సమర్పించారు. తాము సమర్పించిన నోట్‌ను పరిశీలించిన తర్వాత కోర్టు ఏ అభిప్రాయం వ్యక్తం చేస్తే దాని ప్రకారం నడుచుకుంటామని విన్నవించారు. ఆర్టికల్ 32పట్ల తమ దృక్పథాన్ని నోట్‌ ద్వారా చెపుతున్నట్లు పేర్కొన్నారు. ఆర్టికల్ 32 కింద దాఖలు చేసిన పిటిషన్‌ను ఎందుకు విచారణకు స్వీకరించాలన్న కారణాలను వివరించినట్లు చెప్పారు.

గోదావరి ట్రైబ్యునల్ 1979-80లో ఏపీకి ఆవిరయ్యేనీటితో కలిపి 484.5 టీఎంసీలు కేటాయించింది. వరద నీరనో, ఇంకో పేరో చెప్పి అంతకు మించి నీటిని మళ్లించడానికి ప్రయత్నిస్తే అది చట్ట విరుద్ధమవుతుందని.. అప్పుడు ఆర్టికల్ 32 కింద జోక్యం చేసుకోవడానికి కోర్టుకు అధికారం ఉంటుందని వాదించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు కేటాయించిన 449.78 టీఎంసీలకు మించి నీటిని వాడుకోవడానికి అవసమైన మౌలిక వసతులను తయారు చేసుకుంటోందన్నారు. ఈ అంశాలన్నీ ఆర్టికల్ 32కిందికి వచ్చేవే అన్న సంఘ్వీ విభజన చట్టంలోని సెక్షన్ 84(3)(ఐఐ), 85(8) (డీ)లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బహిరంగంగా ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టులు అంతర్రాష్ట్ర అంశాలపై ప్రభావం చూపేట్లయితే తప్పనిసరిగా జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ, జలశక్తిశాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, అపెక్స్ కౌన్సిల్, కేంద్ర పర్యావరణ అటవీశాఖ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని ఈ సెక్షన్లు చెబుతున్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.

సింఘ్వీ వాదనల్లో జోక్యం చేసుకున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వాదనల సందర్భంగా పేర్కొన్న సెక్షన్లలోని అంశాలను సవాల్ చేయడం లేద‌ని, ఆంధ్రప్రదేశ్ కొన్ని చట్టబద్ధమైన నిబంధనలను ఉల్లంఘిస్తోందని చెప్పడానికి మాత్రమే ఈ సెక్షన్లను ఉదాహరణగా చూపుతున్నారని, చట్ట ప్రకారం కేటాయించిన నీటిని మించి వాడుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రయత్నిస్తోందని చెబుతున్నారు కదా ? అని ప్రశ్నించారు. అభిషేక్ సింఘ్వీ బ‌దులిస్తూ.. అది తమ వాదనల్లో ఒక భాగం మాత్రమేనని, మొత్తంగా ఆర్టికల్ 32 కింద ఈ పిటిషన్‌కు విచారణార్హత ఉందన్నదే తమ ప్రధాన అభిప్రాయమ‌న్నారు. కేంద్ర జలసంఘం 2017, 2025లో జారీ చేసిన మార్గదర్శకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా ఉల్లంఘిస్తోందని, ఇవన్నీ చట్టబద్ధమైన అంశాలేనని, వీటన్నింటినీ ఆర్టికల్ 32 కిందే చూడాలని, సివిల్ సూట్‌లో చాలా పరిమితులు ఉంటాయని పేర్కొన్నారు.

సివిల్ సూట్‌కు విస్తృతి ఎక్కువ ఉంటుందని, అక్కడ సాక్ష్యా ధారాలను లోతుగా పరిశీలించవచ్చని సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్ పేర్కొనగా.. గోదావరి ట్రైబ్యునల్ అవార్డులో కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు ఒక్కటే లేవ‌ని, . మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు వ‌స్తాయ‌న్నారు. తెలంగాణ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌లో ఆ రెండు రాష్ట్రాలు పార్టీలుగా లేవని మరో న్యాయమూర్తి జస్టిస్‌ జోయామాల్యా బాగ్చి జోక్యం చేసుకున్నారు. సివిల్ సూట్‌లో అయితే ఇలాంటి వాటన్నింటినీ సంపూర్ణంగా పరిగణలోకి తీసుకోవడానికి వీలువుతుందని జస్టిస్ జోయ్ మాల్య పేర్కొన్నారు. ధర్మాసనం సూచనలను పరిగణలోకి తీసుకున్న అభిషేక్ సింఘ్వీ పిటిషన్‌ను ఉపసంహరించుకొని.. వెటనే సివిల్ సూట్ దాఖలు చేస్తామన్నారు. అది ఇప్పటికే దాదాపు తయారైందని ధర్మాసనం దృష్టికి తీసుకొస్తూ.. సూట్‌పై ప్రతివాదులు సాంకేతిక కారణాలతో అభ్యంతరాలు వ్యక్తం చేస్తే తాము న్యాయమూర్తులే దాఖలు చేయమని చెప్పారని చెబుతామని, తాము అన్ని చోట్ల పరిష్కారాలు లేని వారిగా మిగిలిపోలేమని వాపోయారు.

అభ్యంతరాలు వ్యక్తం చేసే హక్కు అందరికీ ఉంటుందన్న సీజేఐ.. పిటిషన్‌కు విచారణార్హత లేదని అప్పుడు కూడా ప్రతివాదులు వ్యక్తం చేసిన అభ్యంతరంపై ఇక్కడ విన్నట్లుగానే అక్కడ కూడా వినాల్సి ఉంటుందని చెప్పారు. అలా అయితే, కోర్టు సూచన మేరకు ఉపసంహరించుకుంటూ సివిల్ సూట్ దాఖలు చేస్తారని ఉత్తర్వులు ఇవ్వాలని అభిషేక్‌ సింఘ్వీ విజ్ఞప్తి చేయగా... దానికి ఏపీ ప్రభుత్వ తరపు సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు చెప్పడం వల్లే సివిల్ సూట్ దాఖలు చేశామని ముందస్తు ఉత్తర్వులు... అడ్వాన్స్ రూలింగ్ కోరుతున్నారని, అలా చేయకూడదన్నారు. దీనికి స్పందించిన సీజేఐ.. తాము ఎవరి వైపూ... అడ్వాన్స్‌ రూలింగ్‌ ఇవ్వడం లేదన్నారు.

ఎలాంటి అభిప్రాయాలూ వ్యక్తం చేయకుండా పిటిషన్ ఉపసంహరించుకోవడానికి తమకు అనుమతివ్వాలని, ఇందులో సున్నితాంశాలు ఇమిడి ఉన్నందున డిస్మిస్ చేసినట్లు పేర్కొనొద్దని అభిషేక్‌ సింఘ్వీ విజ్ఞప్తి చేయగా.. అందుకు సీజేఐ స్పందిస్తూ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్లుగా భావిస్తూ డిస్మిస్ చేస్తున్నామ‌న్నారు. అయితే, పిటిషనర్ రాష్ట్రం తగిన పరిష్కారాలు కోసం చట్ట ప్రకారం అన్ని వివాదాస్పద అంశాలు ప్రస్తావించడానికి స్వేచ్ఛనిస్తున్నామ‌ని తుది ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆ ఉత్తరుల్లో పేర్కొన్న డిస్మిస్డ్ అన్న పదాన్ని తొలగించి డిస్పోజ్డ్ ఆఫ్ అని చేర్చాలని సింఘ్వీ విజ్ఞప్తి చేయడంతో ప్రధాన న్యాయమూర్తి అందుకు అంగీకరించారు. ప్రాథమికంగా రిట్ పిటిషన్‌కు విచారణార్హత లేకపోవడంతో దానిపై విచారణ ముగిస్తున్నామ‌ని, అదే సమయంలో ఈ పిటిషన్‌లో పేర్కొన్న అన్ని అంశాలపై చట్ట ప్రకారం తగిన పరిష్కారాలు ఎంచుకోవడానికి పిటిషనర్‌కు స్వేచ్చనిస్తుమ‌ని సీజేఐ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

తాజావార్తలు

Advertisement