త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vemula Prashanth Reddy | ఎస్సై వేధింపుల వ‌ల్లే సుధాకర్ చ‌నిపోయాడు.. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే

Vemula Prashanth Reddy | భీంగల్‌లో చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పొలాస సుధాక‌ర్‌ది ముమ్మాటికీ ప్ర‌భుత్వ హ‌త్యేన‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు.

S

Telangana | Published On Oct 6, 2026, 3.38 pm IST

Vemula Prashanth Reddy | ఎస్సై వేధింపుల వ‌ల్లే సుధాకర్ చ‌నిపోయాడు.. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే
Advertisement
  • ఎస్సై తిరుపతిపై హత్యాయత్నం కేసు పెట్టి విధుల నుంచి తొలగించాలి
  • మృతుడి కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
  • మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్‌

Vemula Prashanth Reddy  | త్రినేత్ర న్యూస్: భీంగల్‌లో చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పొలాస సుధాక‌ర్‌ది ముమ్మాటికీ ప్ర‌భుత్వ హ‌త్యేన‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. పోలీసుల వేధింపులు త‌ట్టుకోలేక‌నే ఆత్మ‌హత్యాయ‌త్నం చేసి చ‌నిపోయాడ‌ని వాపోయారు. బీంగ‌ల్ ఎస్సై తిరుప‌తిపై హ‌త్యాయ‌త్నం కేసు పెట్టి వెంట‌నే విధుల నుంచి తొల‌గించాల‌ని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రూ.25 ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాల‌న్నారు. ప‌రామ‌ర్శ‌కు వెళ్ల‌కుండా త‌న‌ను హైద‌రాబాద్‌లో హౌస్ అరెస్టు చేయ‌డం ప్ర‌భుత్వ పిరికిపంద చ‌ర్య‌గా అభివ‌ర్ణించారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మాట్లాడుతూ కాంగ్రెస్ స‌ర్కార్‌పై ఫైర‌య్యారు.

పొలాస సుధాకర్ పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని, చికిత్స పొందుతూ మృతి చెందడం అత్యంత విషాదకరం. సుధాకర్ ఆత్మకు శాంతి చేకూరాలి. బాధిత‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నా. సుధాక‌ర్‌ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. తక్షణ ఆర్థిక, న్యాయ సహాయం అందించాలి.

ఎస్సైని సీపీ వెన‌కేసుకొస్తున్నాడు

పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని సుధాకర్ కాలిన గాయలతో స్వయంగా చెప్పాడు. చావుబతుకుల మధ్య ఉన్న వ్యక్తి చేసిన ఆరోపణలను కూడా పట్టించుకోకుండా పోలీసుల ప్రమేయం లేదని జిల్లా పోలీస్ అధికారి అనడం బాధ్యతారాహిత్యం. అవినీతిపరుడైన భీంగల్ ఎస్సై తిరుపతిని సీపీ వెనకేసుకొస్తున్నాడు. సుధాకర్ మృతదేహాన్ని సందర్శించి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు బాల్కొండ నియోజకవర్గానికి వెళ్తున్న న‌న్ను హైదరాబాద్‌లోని నివాసంలోనే పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం ప్రభుత్వ పిరికిపంద చర్య. ఇది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం.

హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేస్తాం

“నేను ఏదైనా పార్టీ కార్యక్రమానికి వెళ్లడం లేదు. నా నియోజకవర్గానికి చెందిన ఒక చిరు వ్యాపారి చనిపోయాడు. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి, చివరి చూపు చూడటానికి వెళ్తున్నాను. నన్ను ఎందుకు నిర్బంధించారు? అక్కడికి వెళ్లిన తర్వాత అక్కడ ఆపవచ్చు, అవసరమైతే అక్కడే అరెస్ట్ చేయవచ్చు. హైదరాబాద్‌లోనే హౌస్ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అని వేముల‌ ప్రశ్నించారు. సుధాకర్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం కొనసాగిస్తాం. తొందర్లోనే ఎస్ఐపై హ్యూమన్ రైట్స్‌ కమిషన్‌లో ఫిర్యాదు చేస్తాం అని వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement
Advertisement