త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Inflation | సామాన్యుడి జేబుకు ద్రవ్యోల్బణం చిల్లు.. దేశంలోనే తెలంగాణ టాప్..!

Inflation | మే నెల‌లో తెలంగాణ‌లో ఎండ‌లు దంచికొట్ట‌గా.. నిత్యావసర వస్తువుల ధరలు సైతం భగ్గుమ‌న్నాయి. మార్కెట్‌కి వెళ్లాలంటేనే సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. పెరుగుతున్న ధరల మోత‌మోగుతున్న వేళ కేంద్రం విడుదల చేసిన తాజా గణాంకాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.

P

Telangana | Published On Jun 12, 2026, 7.39 pm IST

Inflation | సామాన్యుడి జేబుకు ద్రవ్యోల్బణం చిల్లు.. దేశంలోనే తెలంగాణ టాప్..!
Advertisement

Inflation | మే నెల‌లో తెలంగాణ‌లో ఎండ‌లు దంచికొట్ట‌గా.. నిత్యావసర వస్తువుల ధరలు సైతం భగ్గుమ‌న్నాయి. మార్కెట్‌కి వెళ్లాలంటేనే సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. పెరుగుతున్న ధరల మోత‌మోగుతున్న వేళ కేంద్రం విడుదల చేసిన తాజా గణాంకాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. మే నెల వినియోగదారుల ధరల సూచీ (CPI) ప్రకారం.. దేశవ్యాప్తంగా రిటైల్ ద్రవ్యోల్బణం 3.93 శాతంగా నమోదైంది. అయితే, రాష్ట్రాల వారీగా చూస్తే పరిస్థితి మరింత స్పష్టమవుతోంది. తెలంగాణ 6.15 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. కేంద్ర గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) విడుదల నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణలో ద్రవ్యోల్బణం దాదాపుగా రెండింత‌లు న‌మోదైంది. 5.11 శాతంతో త‌మిళ‌నాడు, 4.90శాతంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, 4.59 శాతంతో క‌ర్నాట‌క ఉండ‌గా.. ఆయా రాష్ట్రాల‌ను తెలంగాణ మించిపోయింది. ఈ ఏడాది జ‌న‌వ‌రి నుంచి చూసినా రాష్ట్రంలో ద్ర‌వ్యోల్బ‌ణం వరుసగా ఐదో నెలలోనూ అత్య‌ధిక స్థాయిలోనే కొన‌సాగుతున్న‌ట్లుగా గ‌ణాంకాలు పేర్కొంటున్నాయి. ఇది సాధారణ వినియోగదారుడి కొనుగోలు శక్తిపై నేరుగా ప్రభావం చూపుతోందని ఆర్థిక విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

ధ‌ర‌ల పెరుగుద‌ల వెనుక అనేక కార‌ణాలు ఉన్నాయ‌ని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఇంధన సరఫరా వ్యవస్థపై ఒత్తిడి పెరిగి, రవాణా ఖర్చులు పెరగడం ఒక ప్రధాన కారణంగా చెబుతున్నారు. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయి. అలాగే, దేశవ్యాప్తంగా కూరగాయల ధరల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. టమాటా ధరలు 48.43 శాతం, అల్లం ధరలు 32.49 శాతం వరకు పెరగడం మార్కెట్‌పై ప్రభావం చూపింది. స్థానిక ఉత్పత్తి తగ్గడంతో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు పెరగడం కూడా అదనపు భారంగా మారుతోంది. కొత్త సీపీఐ లెక్కింపు విధానం కూడా గణాంకాల్లో మార్పులకు కారణమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో బంగారం, వజ్రాలు, వెండి వంటి ఆభరణాల ధరలు గణనీయంగా పెరగడం మొత్తం సూచీపై ప్రభావం చూపుతోందని చెబుతున్నారు. ధరలు ఇలాగే పెరుగుతుంటే మధ్యతరగతి కుటుంబాల కొనుగోలు శక్తి మరింత తగ్గే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి నెలా పెరుగుతున్న కూరగాయలు, ఇంధనం, నిత్యావసరాల ధరలు కుటుంబ బడ్జెట్‌ను కుదిపేస్తున్నాయి. మార్కెట్‌లో ధరలపై నియంత్రణ, సరఫరా వ్యవస్థను మెరుగుపరచడం వంటి త‌క్ష‌ణ చ‌ర్య‌లు అవ‌స‌ర‌మ‌ని నిపుణులు స్ప‌ష్టం చేస్తున్నారు.

మే 2026 రాష్ట్రాల వారీ ద్రవ్యోల్బణం

తెలంగాణ : 6.15 శాతం
తమిళనాడు : 5.11 శాతం
పుదుచ్చేరి : 5 శాతం
ఆంధ్రప్రదేశ్ : 4.90 శాతం
కర్నాటక : 4.59 శాతం
ఒడిశా : 4.54 శాతం
అండమాన్ నికోబార్ దీవులు : 4.40 శాతం
కేరళ : 4.30 శాతం
సిక్కిం : 4.23 శాతం
మధ్యప్రదేశ్ : 4.17 శాతం
రాజస్థాన్ : 4.17 శాతం
ఉత్తరప్రదేశ్ : 3.97 శాతం
ఝార్ఖండ్ : 3.86 శాతం
చండీగఢ్ : 3.80 శాతం
ఉత్తరాఖండ్ : 3.72 శాతం
లక్షద్వీప్ : 3.57 శాతం
అసోం : 3.44 శాతం
పశ్చిమ బెంగాల్ : 3.44 శాతం
మహారాష్ట్ర : 3.35 శాతం
పంజాబ్ : 3.34 శాతం
నాగాలాండ్ : 3.30 శాతం
గుజరాత్ : 3.27 శాతం
లడఖ్ : 3.14 శాతం
హర్యానా : 3.09 శాతం
హిమాచల్ ప్రదేశ్ : 3.05 శాతం
బీహార్ : 2.94 శాతం
ఛత్తీస్‌గఢ్ : 2.87 శాతం
జమ్ము క‌శ్మీర్ : 2.84 శాతం
మణిపూర్ : 2.79 శాతం
మేఘాలయ : 2.70 శాతం
అరుణాచల్ ప్రదేశ్ : 2.58 శాతం
ఢిల్లీ (ఎన్‌సీటీ) : 2.50 శాతం
గోవా : 2.47 శాతం
త్రిపుర : 2.02 శాతం
మిజోరాం : 1.03 శాతం

Advertisement
Advertisement