త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CID Rides | ధరణి పోర్టల్ అక్రమాల్లో కీల‌క స‌మాచారం ల‌భ్యం.. కేసు నమోదు చేసిన సీఐడీ

CID Rides | ధరణి పోర్టల్ (Dharani Portal) భూముల రికార్డుల అక్రమాలపై క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ కేసు న‌మోదు చేసింది.

S

Telangana | Published On Nov 7, 2026, 2.24 pm IST

CID Rides | ధరణి పోర్టల్ అక్రమాల్లో కీల‌క స‌మాచారం ల‌భ్యం.. కేసు నమోదు చేసిన సీఐడీ
Advertisement
  • రాష్ట్ర‌వ్యాప్తంగా 15 బృందాల‌తో ప్ర‌త్యేక‌ ఆప‌రేష‌న్‌
  • వివ‌రాల వెల్ల‌డిలో గోప్య‌త పాటిస్తున్న అధికారులు
  • ఒకటి రెండు రోజుల్లో పూర్తి వివ‌రాలపై స్ప‌ష్ట‌త‌ వ‌చ్చే అవ‌కాశం

CID Rides | త్రినేత్ర న్యూస్‌: ధరణి పోర్టల్ (Dharani Portal) భూముల రికార్డుల అక్రమాలపై క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID) విచారణ వేగవంతం చేసింది. కొన్ని రోజులుగా ఉన్నతాధికారులతో కూడిన ప్రత్యేక విచారణ కమిటీ ఆరా తీస్తుండ‌గా అందులో తేలిన అంశాల ఆధారంగానే తాజాగా కేసు న‌మోదు చేసిన‌ట్లు సీఐడీ అధికారులు తెలిపారు. 15 బృందాలతో రాష్ట్ర‌వ్యాప్తంగా ఏక‌కాలంలో ఆపరేషన్‌ చేపట్టారు. వివ‌రాల వెల్ల‌డిలో సీఐడీ ఉన్నతాధికారులు గోప్యత పాటిస్తుండ‌గా ఒకటి రెండు రోజుల్లో పూర్తి స్పష్టత వచ్చే అవకాశాలు క‌నిపిస్తున్నాయి.

ధరణి వ్యవహారాలతో సంబంధం ఉన్న వ్యక్తుల ఇళ్లలో, IL&FS Technologies Limited కార్యాలయాల్లో, TerraCIS Technologies Limited సంస్థల్లోనూ సోదాలు చేప‌డుతున్నారు. దీంతో పాటు ధరణి పోర్టల్‌లో జరిగిన లావాదేవీలు, సాంకేతిక నిర్వహణపై ఆరా తీస్తున్నారు. అక్రమాలకు పాల్పడినట్లు అనుమానిస్తున్న వ్యక్తుల పాత్రపై దర్యాప్తు కొన‌సాగిస్తున్నారు.

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, యాదాద్రి-భువనగిరి, జనగామ‌, సిద్దిపేట, గజ్వేల్ జిల్లాల్లోని పోర్టల్ డెవలపర్లు, ఆపరేటర్లు, డాక్యుమెంట్ రైటర్ల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. ఫోరెన్సిక్ ఆడిట్‌లో వెలుగుచూసిన డిజిటల్ ఆధారాలు, ఐపీ అడ్రస్‌లు, అనధికార లాగిన్‌ల ఆధారంగా ఈ అక్రమాలను గుర్తించారు. ఈ ఆపరేషన్‌లో పలువురిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌ సీఐడీ కార్యాలయానికి తరలించాయి.

సీఐడీ డీజీ చారుసిన్హా నేతృత్వంలో ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు, సాంకేతిక నిపుణులు.. మొత్తం ఏడుగురితో ఏర్పాటైన సెట్ విచార‌ణ‌ కమిటీ కొన్ని రోజులుగా విస్తృతంగా విచారణ జరిపింది. రెవెన్యూ కార్యాలయాల్లో ధరణి పోర్టల్‌ను నిర్వహించే ఆపరేటర్లు, అనధికారిక వ్యక్తులకు ఈ అక్రమాల్లో ప్రమేయముందని ఫోరెన్సిక్‌ విచారణలో గుర్తించినట్లు సమాచారం. ధరణి పోర్టల్‌ ఆపరేటర్లు కీలకంగా వ్యవహరించడం వల్లే ఈ దందా సాగిందనే నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది.

హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో కొన్ని భూపార్సిళ్లకు సంబంధం లేని తీర్పులను అన్వయించి భూములపై హక్కులు కొట్టేశారన్న ఆరోపణలపైనా కీలక సమాచారం లభ్యమైనట్లు తెలుస్తోంది. భూదాన్‌ భూములకు బైనంబర్లతో హక్కులు మార్చారనే ఫిర్యాదులపైనా ఆరా తీశారు. ఎక్కడ, ఎవరు, ఏ సాఫ్ట్‌వేర్‌ ఉపయోగించి పోర్టల్‌లోకి లాగిన్‌ అయ్యారు.. ఎలాంటి మార్పులు చేశారనే అంశంలో డిజిటల్‌ ఫుట్‌ప్రింట్స్‌ను ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో కనుగొన్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే సీఐడీ శ‌నివారం ఆపరేషన్‌ నిర్వహించినట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం.

Advertisement
Advertisement