త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Srinivas Goud | ఉద్యోగుల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది : మాజీ మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్‌

Srinivas Goud | తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని ఉద్యోగ సంఘాల నేతలు గుర్తుచేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి ఆ పార్టీ అధికారంలోకి రావడానికి లక్షలాది మంది ఉద్యోగులు కృషి చేశారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.

P

Telangana | Published On Aug 22, 2026, 1.30 pm IST

Srinivas Goud | ఉద్యోగుల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది : మాజీ మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్‌
Advertisement

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తోందని మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగులు ముందుండి పోరాడారని, అలాంటి ఉద్యోగులను ప్రభుత్వం వేధించినా, ఇబ్బందులకు గురిచేసినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను నమ్మి రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగులు ఆ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేశారని శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు ఇచ్చిన హామీలను విస్మరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్రను గుర్తుచేస్తూ.. తెలంగాణ ఉద్యోగులను కేసీఆర్‌ అప్పట్లో మన్మోహన్‌సింగ్‌కు పరిచయం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యోగులు పోరాడుతున్నారని చెప్పగానే మన్మోహన్‌సింగ్‌ ఆశ్చర్యపోయారని, తెలంగాణపై ఉద్యోగులకు ఉన్న ప్రేమను ఆయన ప్రశంసించారని తెలిపారు.

EHSపై ఉద్యోగుల ఆగ్రహం

గత మూడు నెలలుగా ఉద్యోగుల వేతనాల నుంచి 1.5 శాతం కోత విధిస్తున్నారని శ్రీనివాస్‌ గౌడ్‌ ఆరోపించారు. అయితే దీనికి సంబంధించిన వివరాలను పబ్లిక్‌ డొమైన్‌లో ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. ఉద్యోగుల నుంచి ఈహెచ్‌ఎస్‌ (EHS) కోసం డబ్బులు వసూలు చేస్తున్నప్పటికీ.. ఆసుపత్రుల్లో ఈహెచ్‌ఎస్‌ సేవలు అందుబాటులో లేకపోవడంతో ఉద్యోగులను బయటకు పంపిస్తున్నారని అన్నారు. మూడు నెలలుగా ఉద్యోగుల నుంచి ముక్కుపిండి ఈహెచ్‌ఎస్‌ కోసం వసూలు చేస్తున్నప్పుడు.. ఆసుపత్రుల్లో ఆ సేవలు ఎందుకు పనిచేయడం లేదని నిలదీశారు. రిటైర్డ్‌ ఉద్యోగుల ప్రయోజనాల కోసం నెలకు రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. అది వాస్తవం కాదని ఆరోపించారు. పీఆర్‌సీ, డీఏలు ఈ ప్రభుత్వ హయాంలోనే అత్యధికంగా పెండింగ్‌లో ఉన్నాయని శ్రీనివాస్‌ గౌడ్‌ పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

హామీ ఏమైంది?

రాష్ట్రంలో 4.90 లక్షల మంది అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఉన్నారని శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీ ఇచ్చి మోసం చేసిందని ఆరోపించారు. ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక కార్పొరేషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించిన రూ.1,000 కోట్ల నిధులు పక్కదారి పట్టాయని ఆరోపణలు వస్తున్నాయని, ఆ డబ్బులు ఎవరు తిన్నారో తేల్చాలని డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంలో ఓ మంత్రి పాత్రపై ఆరోపణలు వస్తున్నాయని పేర్కొంటూ.. నిజానిజాలను వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉందన్నారు. ఇరిగేషన్‌ శాఖలో రూ.3 లక్షలకు ఒక లష్కర్‌ పోస్టును అమ్ముకున్నారనే ఆరోపణలు ఉన్నాయని శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. ‘‘నీళ్లు దోచుకుపోతున్నారు.. ఉద్యోగాలు దోచుకుపోతున్నారు’’ అని విమర్శించారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీలో 180 ఉద్యోగాలను ప్రభుత్వం అమ్ముకుందని ఆరోపించారు. ఉద్యోగాల భర్తీ, కాంట్రాక్టు ఉద్యోగుల నిధుల విషయంలో జరుగుతున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

కాళేశ్వరంపై ప్రభుత్వ ప్రచారంపై విమ‌ర్శ‌లు

కేసీఆర్‌ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నేడు రాష్ట్రానికి దిక్కుగా నిలిచిందని శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నాణ్యత లోపాలు లేవని సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ నివేదిక స్పష్టం చేసిందని తెలిపారు. ఈ నివేదిక కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వం ఇంతకాలం చేసిన ప్రచారాన్ని బట్టబయలు చేసిందని వ్యాఖ్యానించారు. సమాన పనికి సమాన వేతనం ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం అది అమలు కావడం లేదని విమర్శించారు.

సీపీఎస్ ర‌ద్దు ఏమైంది?

కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో సీపీఎస్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చిందని శ్రీనివాస్‌ గౌడ్‌ గుర్తుచేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా ఎందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నించారు. CPS రద్దు చేసేంత వరకు ఉద్యోగుల పక్షాన బీఆర్‌ఎస్‌ పోరాడుతుందని స్పష్టం చేశారు. ఏ ఒక్క రిటైర్డ్‌ ఉద్యోగి చనిపోయినా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలను వెంటనే అందించాలని డిమాండ్‌ చేశారు.

కాంగ్రెస్‌లో గందరగోళం

మంత్రి కొండా సురేఖ కుమార్తె వ్యాఖ్యల తర్వాత కాంగ్రెస్‌లో గందరగోళం నెలకొందని శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. పదవుల విషయంలో ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో ఒక్కొక్కరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. పెట్టుబడులు పెట్టిన వారు తమ డబ్బుల గురించి అడుగుతున్నారని అన్నారు. ‘‘కడుపు నిండినవాడు మౌనంగా ఉంటున్నాడు.. కడుపు నిండని వారు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు’’ అని శ్రీనివాస్‌ గౌడ్‌ వ్యాఖ్యానించారు. ఏ వర్గానికి అన్యాయం జరిగినా బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement