త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Phone Tapping Case | గవర్నర్ అనుమతి లేకుండానే కేసీఆర్ పై చార్జిషీట్?

Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో గవర్నర్ అనుమతి లేకుండానే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) పై చార్జిషీట్ (Charge Sheet) నమోదు చేయనున్నారు.

S

Telangana | Published On Oct 25, 2026, 5.36 pm IST

Phone Tapping Case | గవర్నర్ అనుమతి లేకుండానే కేసీఆర్ పై చార్జిషీట్?
Advertisement
  • కేటీఆర్, హరీశ్ రావు, నవీన్ కుమార్ లపై కూడా.. !
  • రేపో ఎల్లుండో దాఖలు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
  • ఎప్పుడో సిద్ధమైన చార్జిషీట్..
  • ఇక దాఖలు చేయండంటూ అనుమతి ఇచ్చిన సీఎం కార్యాలయం!?
  • నాంపల్లి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయనున్న సిట్

Phone Tapping Case | త్రినేత్ర న్యూస్ : గవర్నర్ అనుమతి లేకుండానే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) పై ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో చార్జిషీట్ (Charge Sheet) నమోదు చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. శాసన సభలో ప్రతిపక్ష నాయకుడు, కేబినెట్ ర్యాంకు హోదా ఉన్న మాజీ సీఎం కేసీఆర్ పై అభియోగ పత్రాలు దాఖలు చేసేందుకు గవర్నర్ అనుమతి తప్పనిసరి. కానీ ప్రభుత్వం అటువంటి అనుమతి తీసుకోకుండానే ఈ కేసులో ముందుకు వెళ్లనున్నట్లు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా.. సిట్ సోమవారం (అక్టోబర్ 26) లేదా మంగళవారం (అక్టోబర్ 27) నాంపల్లి కోర్టులో అభియోగ పత్రాలు సమర్పించనున్నట్టు సమాచారం. చార్జిషీట్ ఎప్పుడో సిద్ధమై ఉన్నా ప్రభుత్వం మాత్రం తగిన సమయం కోసం వేచి చూస్తున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన ఫైల్ ముఖ్యమంత్రి కార్యాలయం పరిశీలనలో ఉందని వినిపిస్తోంది. ఈ చార్జిషీట్ లో కేసీఆర్ తో పాటు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ లను నిందితులుగా చేర్చారు. దీనిపై ముందుకు వెళ్లేందుకు రెండు రోజుల క్రితం సీఎంవో అనుమతి ఇచ్చినట్టు తెలుస్తున్నది.

2018 నుంచి ..ఆరా

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ కు 2018 నుంచి లభించిన ఆధారాలతో మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులతో పాటు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, పోలీసు అధికారులు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావులను కూడా నిందితులుగా చేర్చనున్నారు. 2018 డిసెంబరు నుంచి బీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ ట్యాపింగ్ ద్వారా ఎలక్టోరల్ బాండ్లు ఖరీదు చేయించారని ఆరోపిస్తూ సిట్.. ఆయనను నిందితుడిగా చేర్చింది. సిద్ధిపేట, ఇతర ఎన్నికలకు సంబంధించి కొన్ని ఫోన్ నంబర్లను ట్యాపింగ్ కు సిఫార్సు చేశారనే అభియోగాలపై మాజీ మంత్రి హరీశ్ రావును నిందితుడిగా చేర్చింది. ప్రభాకర్ రావును కీలక పోస్టులో కొనసాగిస్తూ అనేక సార్లు ఎక్స్ టెన్షన్ ఇవ్వడాన్ని క్విడ్ ప్రోకో గా భావిస్తూ ..అందుకు బాధ్యుడిగా నాటి సీఎం కేసీఆర్ ను నిందితుల జాబితాలో చేర్చింది.

కేటీఆర్, నవీన్ కుమార్ లకు వ్యతిరేకంగా వాంగ్మూలం

క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 164 (ఇప్పుడు భారతీయ నాగరిక్ సురక్షా సంహిత సెక్షన్ 183) ప్రకారం మెజిస్ట్రేట్ ముందు నమోదు చేసే వాంగ్మూలాన్ని 164 స్టేట్ మెంట్ అంటారు. విచారణ సమయంలో సాక్షులు నేరుగా కోర్టు ముందు ఇచ్చే ప్రకటన ఇది. దీనికి చట్టబద్ధత ఉంటుంది. పైగా నేర నిరూపణలో ఇది కీలక అంశంగా మారనుంది. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో సంధ్యా కన్వె న్షన్ మేనేజింగ్ డైరెక్టర్ శరణాల శ్రీధర్ రావు .. సెక్షన్ 164 కింద న్యాయస్థానం ఎదుట హాజరై మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ లు తనను వేధించినట్లు, భయపెట్టాలని చూసినట్లు సాక్ష్యం చెప్పినట్లు భోగట్టా. ఇది ఈ కేసులో కీలక పరిణామంగా మారుతున్నది. శ్రీధర్ రావుతో పాటు మరికొంత మంది వాంగ్మూలాలను కూడా రికార్డు చేయించినట్టు సమాచారం.

గవర్నర్ అనుమతి అవసరమా?

కాగా.. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పై చార్జిషీట్ దాఖలు చేసేందుకు గవర్నర్ అనుమతి అవసరమా? కాదా? అన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. ఫార్ములా రేస్ కోర్సు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ పై చార్జిషీట్ దాఖలు చేసే విషయమై గత ఏడాది సీఎం మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ పై చార్జిషీట్ కు గవర్నర్ అనుమతి తప్పనిసరి..అని గుర్తు చేశారు. "2018 లో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కు సవరణలు చేశారు. మంత్రిగా ఉన్న సమయంలో వారు చేసిన అవినీతిపై విచారణ చేయాలన్నా, చార్జిషీట్ వేయాలన్నా గవర్నర్ అనుమతి తప్పనిసరి. గవర్నర్ అనుమతి లేకుండా అరెస్టు చేస్తే కేటీఆర్ కు పది నిమిషాల్లోనే బెయిల్ దొరుకుతుంది. చట్టపరమైన ప్రక్రియ సక్రమంగా జరగాలంటే.. గవర్నర్ అనుమతి కీలకం" అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

అయితే చట్ట సభల సభ్యులపై అవినీతి నిరోధక చట్టం కిందికి వచ్చే కేసుల్లో మాత్రమే గవర్నర్ అనుమతి అవసరమని న్యాయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు.. అవినీతి కిందికి రాదని.. అది అక్రమ వ్యవహారం కేసు గా పరిగణిస్తున్నందున.. ఇందుకు గవర్నర్ అనుమతి అవసరం లేదని చెబుతున్నారు.

అరెస్టులు లేనట్టేనా?

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పై చార్జిషీట్ నమోదు చేసినంత మాత్రాన వెంటనే అరెస్టులు ఉండవని తెలుస్తున్నది. ఈ కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టులో అభియోగ పత్రాలు దాఖలు చేసిన తర్వాత న్యాయస్థానమే విచారణ జరుపుతూ ఉంటుందని సమాచారం. సరైన ఆధారాలతో అభియోగాలు మోపి కోర్టులో సాక్ష్యాలు చూపించి .. స్పీకర్ కు సమాచారం ఇచ్చి.. కేసీఆర్ ను అరెస్టు కూడా చేయవచ్చని తెలుస్తున్నది.

ఎప్పుడో సిద్ధమైన చార్జిషీట్

ఫోన్ ట్యాపింగ్ కేసులో చార్జిషీట్ ఎప్పుడో సిద్ధమై ఉండగా, చార్జిషీట్ ను నేడో రేపో దాఖలు చేస్తామంటూ గత 3, 4 నెలలుగా సీఎం కార్యాలయం లీకులు ఇస్తూనే ఉన్నది. అయితే రెండు రోజుల క్రితమే సీఎం కార్యాలయం చార్జిషీట్ దాఖలు చేసేందుకు సిట్ కు అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 26 లేదా 27న చార్జిషీట్ దాఖలు చేయనున్నారని విశ్వ సనీయ సమాచారం.

డైవర్షన్ కోసమేనా?

ఎల్ నినో తీసుకొచ్చిన కరువుతో ప్రభుత్వం తలకిందులవుతున్నది. సాగునీటికి నీళ్లే లేవు. 30 లక్షల పంపుసెట్లలో 15 లక్షలకు పైగా వ్యవసాయ పంపుసెట్లు నీళ్లు లేక ఎండిపోయాయి. ప్రభుత్వం చెప్పిన మాట విని గ్రామాల్లో సగం మంది రైతులు ఈ సారి పంటనే వేయలేదు. వేసిన పంటల్లో సగం ఎండిపోయాయి. ఇక మిగిలిన పంటలను ఎలా కాపాడుకోవాలో తెలియక రైతులు బోర్లను, ట్యాంకర్లును ఆశ్రయిస్తున్నారు. మరోవైపు కరెంటు డిమాండ్ పెరిగిపోయింది. యాదాద్రి థర్మల్ స్టేషన్ కు తగినంత బొగ్గు సరఫరా చేయడంలో అవసరమైన చర్యలు తీసుకోలేక.. ప్రభుత్వం అధికారులను బలి చేస్తున్నది. సాగునీటికి నీళ్లిచ్చేది లేదని కరాఖండిగా చెబుతున్నది. డిసెంబరు నుంచి తాగునీటికి కూడా కష్టాలు మొదలవుతాయని నీటి గణాంకాలు ధ్రువీకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోయలేక ప్రభుత్వం అనేక విమర్శలను ఎదుర్కొంటున్నది. అయితే ఈ సమస్యల నుంచి డైవర్ట్ చేసేందుకు .. రేవంత్ సర్కారు ఫోన్ ట్యాపింగ్ చార్జిషీట్ ను అస్త్రంగా వాడుకోనున్నట్టు సమాచారం.

Advertisement
Advertisement