త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ECI SIR | ‘స‌ర్’ డిజిట‌లైజేష‌న్ వేగ‌వంతం చేయండి

ECI SIR | తెలంగాణ‌లో చేప‌డుతున్న‌ స‌ర్ ను స‌కాలంలో పూర్తి చేయాలని ఈసీఐ సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ పవన్ కుమార్ శర్మ ఆదేశించారు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాల‌న్నారు.

S

Telangana | Published On Jul 10, 2026, 5.17 pm IST

ECI SIR | ‘స‌ర్’ డిజిట‌లైజేష‌న్ వేగ‌వంతం చేయండి
Advertisement
  • హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయండి
  • ఉత్త‌మ ప‌నితీరున్న జిల్లాల వ్యూహాలను ఫాలో అవ్వండి
  • సీఈవో సుదర్శన్‌ రెడ్డి, క‌లెక్ట‌ర్ల వీడియో కాన్ఫ‌రెన్స్‌లో ఈసీఐ సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ పవన్ కుమార్ శర్మ ఆదేశం

ECI SIR | త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ‌లో చేప‌డుతున్న‌ స‌ర్ ను స‌కాలంలో పూర్తి చేయాలని ఈసీఐ సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ పవన్ కుమార్ శర్మ ఆదేశించారు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాల‌న్నారు. దీనికి సంబంధించి ఆయా జిల్లాల ఎన్నికల అధికారులకు (DEOs) రోజువారీ డిజిటలైజేషన్ లక్ష్యాలను (Daily Targets) చేరుకోవాలన్నారు. ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఓటర్ల జాబితా పరిశీలకుల (Electoral Roll Observers)తో ఆయ‌న‌ ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. SIR కార్యక్రమాల ప్రగతిని సమీక్షించారు.

‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) ప్రక్రియను నిర్ణీత సమయంలోపు పూర్తి చేయాల‌న్నారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, వాటి డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంపై ప్రధానంగా దృష్టి సారించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లాల ఎన్నికల అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడారు. వారు అవలంబించిన ఉత్తమ విధానాలను అడిగి తెలుసుకున్నారు. మిగిలిన జిల్లాలు కూడా ఇదే వ్యూహాలను అనుసరించాలని సూచించారు. రోజువారీ లక్ష్యాల ఆధారంగా నిరంతరం పర్యవేక్షిస్తూ, ఈ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని సుద‌ర్శ‌న్‌రెడ్డిని ఆదేశించారు.

స‌మాచారం ఇచ్చాకే ఓటు తీసేయాలి: సీఈవో సుదర్శన్‌ రెడ్డి

ఓటర్ల‌కు స‌మాచారం ఇచ్చిన త‌ర్వాతే ఓటు తీసేయాల‌ని రాష్ట్ర ముఖ్య‌ ఎన్నిక‌ల అధికారి సుద‌ర్శ‌న్‌రెడ్డి క‌లెక్ట‌ర్ల‌కు సూచించారు. ఈసీఐతో వీడియో కాన్ఫ‌రెన్స్‌లో పాల్గొన్న అనంత‌రం ఆయ‌న మాట్లాడారు. ఓటు తీసేయ‌డం అంత ఆషామాషీ విష‌యం కాద‌న్నారు. జూలై 24 వ‌ర‌కు ఎన్యూమ‌రేష‌న్ ప‌త్రాల‌ను ఇంటింటికి వెళ్లి అంద‌జేసేలా చూడాల‌ని సూచించారు. ఎన్యూమరేషన్‌ పత్రాన్ని నింపి ఇస్తేనే డ్రాఫ్ట్‌ ఓటరు జాబితాలో ఉంటుందని స్ప‌ష్టం చేశారు. ఎన్యూమరేషన్‌ పత్రం ఇవ్వలేకపోతే ఫామ్‌-6 ఇవ్వాలని సూచించారు. డ్రాఫ్ట్‌ జాబితాలో పేరు లేకపోతే ఫామ్‌-6 ద్వారా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈసీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లోనూ ఎన్యూమరేషన్ పత్రాలు నింపొచ్చ‌ని వెల్ల‌డించారు.

Advertisement
Advertisement