త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Singareni | యథావిధిగా సింగరేణి మెడికల్ బోర్డు.. రేపు 335 మందికి కారుణ్య నియామ‌క ప‌త్రాలు అంద‌జేత‌

Singareni | సింగరేణి కార్మికులకు శుభవార్త. సింగరేణిలో వివిధ కారణాలతో కొద్ది కాలంగా నిలిచిపోయిన మెడికల్ బోర్డును అతి త్వరలో ప్రారంభించాల్సిందిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు.

S

Telangana | Published On Jun 12, 2026, 3.21 pm IST

Singareni | యథావిధిగా సింగరేణి మెడికల్ బోర్డు.. రేపు 335 మందికి కారుణ్య నియామ‌క ప‌త్రాలు అంద‌జేత‌
Advertisement

Singareni | త్రినేత్ర‌.న్యూస్ : సింగరేణి కార్మికులకు శుభవార్త. సింగరేణిలో వివిధ కారణాలతో కొద్ది కాలంగా నిలిచిపోయిన మెడికల్ బోర్డును అతి త్వరలో ప్రారంభించాల్సిందిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. సింగరేణి కార్మికుల సంక్షేమం, వారి కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మెడికల్ బోర్డు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, నిష్పాక్షికంగా, వివాదరహితంగా నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు.

సింగరేణి అభివృద్ధిపై ఇటీవల కోల్ బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు, మంత్రులతో నిర్వహించిన సమావేశం సందర్భంగా మెడికల్ బోర్డు అంశాన్ని వారు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. ఈ అంశంపై కార్మికుల ఆందోళనలను వివరించారని చెప్పారు. ఆ సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలను ప్రభుత్వం సానుకూలంగా పరిగణించి, కార్మికుల ప్రయోజనాలను కాపాడే దిశగా చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.

అర్హులైన ఉద్యోగులకు మాత్రమే ప్రయోజనం

మెడికల్ బోర్డు ప్రక్రియ ద్వారా నిజంగా అర్హులైన ఉద్యోగులకు మాత్రమే ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని, తద్వారా వారి వారసులకు కారుణ్య నియామకాల రూపంలో ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. ఈ ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు, అవకతవకలు, మధ్యవర్తిత్వం లేదా మోసాలకు తావులేకుండా కట్టుదిట్టమైన వ్యవస్థను అమలు చేయాలని స్పష్టం చేశారు. కార్మికుల సంక్షేమం విషయంలో ప్రజా ప్రభుత్వం అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని, మెడికల్ బోర్డు ప్రక్రియపై పూర్తి విశ్వాసం ఉంచి యాజమాన్యానికి సహకరించాలని కార్మికులకు సూచించారు.

డిపెండెంట్ ఉద్యోగాలకు 335 మంది అర్హత 

ఇటీవల కాలం వరకు కారుణ్య నియామకాలు, డిపెండెంట్ ఉద్యోగాలకు అర్హత సాధించిన 335 మంది వారసులకు ఈ నెల 13వ తేదీన మంచిర్యాల‌లో జరిగే కార్యక్రమంలో ఉద్యోగ నియామక పత్రాలను అందజేయనున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు.

సింగరేణిలో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న మారుపేర్ల అంశం

సింగరేణిలో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న మారుపేర్ల అంశం తమ దృష్టిలో ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ అంశాన్ని పరిష్కరించేందుకు ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నట్లు.. ఇందులో భాగంగానే ఈ అంశంపై న్యాయ పరమైన సలహా తీసుకుంటున్నట్లు వెల్లడించారు. నిబంధనల మేరకు న్యాయ సలహా ప్రకారం సానుకూలంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement