త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Singareni | జెన్‌కోకు రోజుకు 75 వేల టన్నుల బొగ్గు

Singareni | రాష్ట్రంలో విద్యుత్‌ అవసరాలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో బొగ్గు సరఫరాను పెంచేందుకు సింగరేణి కాలరీస్‌ కంపెనీ సిద్ధమైంది. తెలంగాణ జెన్‌కో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు రోజుకు 75 వేల టన్నుల బొగ్గు సరఫరా చేయాలని నిర్ణయించింది. ఒడిశాలోని నైనీ బొగ్గు గని నుంచి యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి రోజుకు కనీసం 16వేల టన్నుల బొగ్గు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

P

Telangana | Published On Nov 10, 2026, 5.37 pm IST

Singareni | జెన్‌కోకు రోజుకు 75 వేల టన్నుల బొగ్గు
Advertisement
  • విద్యుత్‌ అవసరాలు పెరిగే అవకాశం ఛాన్స్‌
  • సరఫరా పెంచాలని సింగరేణి నిర్ణయం
  • యాదాద్రి ప్లాంట్‌కు నైనీ గని నుంచి రోజుకు 16 వేల టన్నులు
  • తెలంగాణ జెన్‌కోకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సీఎండీ బుద్ధప్రకాష్‌ జ్యోతి ఆదేశం

Singareni | రాష్ట్రంలో విద్యుత్‌ అవసరాలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో బొగ్గు సరఫరాను పెంచేందుకు సింగరేణి కాలరీస్‌ కంపెనీ సిద్ధమైంది. తెలంగాణ జెన్‌కో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు రోజుకు 75 వేల టన్నుల బొగ్గు సరఫరా చేయాలని నిర్ణయించింది. ఒడిశాలోని నైనీ బొగ్గు గని నుంచి యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి రోజుకు కనీసం 16వేల టన్నుల బొగ్గు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మంగళవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌ నుంచి సింగరేణి సీఎండీ డాక్టర్‌ బుద్ధప్రకాష్‌ జ్యోతి, తెలంగాణ జెన్‌కో సీఎండీ డాక్టర్‌ హరీష్‌ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఉన్నతస్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు జరిగిన ఈ భేటీలో బొగ్గు సరఫరా పెంపుపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

తెలంగాణకే తొలి ప్రాధాన్యం

తెలంగాణ జెన్‌కో థర్మల్‌ కేంద్రాలకు బొగ్గు రవాణాలో తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, ఆ తర్వాతే ఇతర రాష్ట్రాల విద్యుత్‌ కేంద్రాలకు సరఫరా చేయాలని సింగరేణి సీఎండీ బుద్ధప్రకాష్‌ జ్యోతి సంస్థ డైరెక్టర్లు, ఏరియా జనరల్‌ మేనేజర్లను ఆదేశించారు. గత మూడు, నాలుగేళ్లతో పోలిస్తే ఈ ఏడాది తెలంగాణ జెన్‌కోకు అధికంగా బొగ్గు సరఫరా చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్‌ అవసరాలు పెరిగితే సంస్థ సామర్థ్యం మేరకు మరింత బొగ్గు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

నైనీ నుంచి 16 వేల టన్నులు

ఒడిశాలోని నైనీ బొగ్గు గనిలో రోజుకు సుమారు 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా పనిచేస్తున్నామని సీఎండీ తెలిపారు. ప్రస్తుతం అక్కడ 3 లక్షల టన్నుల బొగ్గు నిల్వ ఉందన్నారు. ఈ నేపథ్యంలో యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి బొగ్గు రవాణాను పెంచాలని జెన్‌కో అధికారులకు సూచించారు. స్థానికంగా రవాణా సమస్యల కారణంగా బొగ్గు తరలింపులో కొంత జాప్యం జరుగుతోందని తెలంగాణ జెన్‌కో సీఎండీ డాక్టర్‌ హరీష్‌ వివరించారు. ఈ నెలాఖరు నుంచి రోజుకు 16 వేల టన్నుల బొగ్గు తరలించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. గని నుంచి సమీప రైల్వే సైడింగ్‌ వరకు రోడ్డు మార్గంలో బొగ్గు రవాణాను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత సమావేశాల తర్వాత సరఫరా పెరిగిందని సంతృప్తి వ్యక్తం చేశారు.

ఇతర రాష్ట్రాలకూ సరఫరాపై ప్రణాళిక

నైనీ గనిలో ఉత్పత్తి అవుతున్న బొగ్గు కోసం ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు జెన్‌కోలతోపాటు పలు ప్రైవేటు సంస్థలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాయని నైనీ జీఎం సమావేశంలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో తొలుత తెలంగాణ జెన్‌కో అవసరాలను తీర్చాలని, మిగిలిన బొగ్గును ఇతర సంస్థలకు సరఫరా చేసేలా ప్రణాళిక రూపొందించాలని సీఎండీ మార్కెటింగ్‌ విభాగం అధికారులను ఆదేశించారు. రోజువారీ బొగ్గు రవాణాపై తెలంగాణ జెన్‌కో అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో సింగరేణి డైరెక్టర్లు ఎల్‌వీ సూర్యనారాయణ, కే వెంకటేశ్వర్లు, గౌతమ్ పోత్రు, తిరుమలరావు, ఈడీ (కోల్‌ మూవ్‌మెంట్‌) బీ వెంకన్న, జీఎం (కోఆర్డినేషన్‌ అండ్‌ మార్కెటింగ్‌) టీ శ్రీనివాస్‌ పాల్గొన్నారు. తెలంగాణ జెన్‌కో డైరెక్టర్‌ (కోల్‌ అండ్‌ లాజిస్టిక్స్‌) నాగ్యతోపాటు థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల చీఫ్‌ ఇంజినీర్లు, ఇతర అధికారులు హాజరయ్యారు.

Advertisement
Advertisement