త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana | డిసెంబ‌ర్ 9న 1.90 ల‌క్ష‌ల మంది మ‌హిళ‌ల‌కు కుట్టు మిష‌న్లు పంపిణీ

Telangana | బీసీ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇంటింటా కుట్టు మిషన్ల పథకం అమలుపై మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ సమీక్షించారు. డిసెంబ‌ర్ 9న 1.90 ల‌క్ష‌ల మంది మ‌హిళ‌ల‌కు కుట్టు మిష‌న్లు పంపిణీ చేస్తామ‌న్నారు.

S

Telangana | Published On Oct 27, 2026, 3.47 pm IST

Telangana | డిసెంబ‌ర్ 9న 1.90 ల‌క్ష‌ల మంది మ‌హిళ‌ల‌కు కుట్టు మిష‌న్లు పంపిణీ
Advertisement

బీసీ సంక్షేమ శాఖ పథకాల అమలులో పారదర్శకత, వేగం పెంచాలి
38 ఆత్మగౌరవ భవనాల జీవోల ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలి
బీసీ సంక్షేమ శాఖ అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు

Telangana | త్రినేత్ర న్యూస్ : బీసీ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇంటింటా కుట్టు మిషన్ల పథకం అమలుపై మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ సమీక్షించారు. డిసెంబ‌ర్ 9న 1.90 ల‌క్ష‌ల మంది మ‌హిళ‌ల‌కు కుట్టు మిష‌న్లు పంపిణీ చేస్తామ‌న్నారు.

సచివాలయంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీ సంక్షేమ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ పరిధిలో అమలవుతున్న పథకాలు, గురుకుల పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ఆత్మగౌరవ భవనాలు, నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ, బీసీ వర్గాలకు స్వయం ఉపాధి అవకాశాల కల్పన తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు.

మ‌హిళ‌ల కుట్టుమిష‌న్ల‌ పథకానికి మహిళల నుంచి మంచి స్పందన లభించిందని, సుమారు 4.80 లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. నియోజకవర్గానికి వెయ్యి మంది చొప్పున మొత్తం 1.90 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూర్చేలా ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 9న లబ్ధిదారులకు కుట్టు మిషన్లు అందించేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని, టెండర్ ప్రక్రియతో పాటు ఇతర అవసరమైన పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

మహాత్మా జ్యోతిబా ఫూలే విదేశీ విద్యా నిధి పథకం అమలుపై మంత్రి సమీక్షించారు. ఈ పథకం ద్వారా అర్హులైన మెరిట్ విద్యార్థులకు పూర్తి పారదర్శకతతో పెండింగ్ లేకుండా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద వచ్చిన దరఖాస్తుల వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందే వారిలో బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పించే అంశంపై ప్రభుత్వంతో చర్చిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచనల మేరకు 38 ఆత్మగౌరవ భవనాలకు సంబంధించిన జీవోల ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలోని 327 మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలల్లో ఆర్సీవోలు పర్యటించి మౌలిక సదుపాయాలు, సిబ్బంది, విద్యార్థుల సంఖ్య, ఖాళీలు, సొంత భవనాల స్థితిగతులు తదితర అంశాలపై నివేదికలు అందించినట్లు మంత్రి తెలిపారు. ఈ నివేదికల ఆధారంగా పాఠశాలల్లో ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

బీసీ స్టడీ సర్కిళ్లలో సంస్కరణలు చేపట్టి నిరుద్యోగులకు ఉద్యోగాలే లక్ష్యంగా నాణ్యమైన శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఈ అంశంపై ఐదుగురు సభ్యుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా సమర్థవంతమైన డైరెక్టర్ల నియామకానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. డైరెక్టర్ల ఎంపిక కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, యూపీఎస్సీ, గ్రూప్-1 వంటి పోటీ పరీక్షల్లో మెరిట్ సాధించిన వారికి అవకాశాలు కల్పించేలా ఎంపిక ప్రక్రియ చేపట్టాలని తెలిపారు.

బీసీ కార్పొరేషన్ ద్వారా శిక్షణ పొందిన వారికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని మంత్రి సూచించారు. మధిర వంటి నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా పశువుల పంపిణీ తరహా ఉపాధి పథకాన్ని ప్రారంభించి, లబ్ధిదారుల ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎంఎస్‌ఎంఈ పథకం కింద చిన్న, మధ్యతరహా పరిశ్రమల స్థాపనకు వివిధ కుల సంఘాలకు నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు, ఆర్థిక వృద్ధి పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జ, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయాదేవి, మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకులాల కార్యదర్శి సైదులు, అధికారులు మల్లయ్య భ‌ట్టు, అలోక్ కుమార్, పద్మ, మామిడి హరికృష్ణ, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement