త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | రేవంత్‌ది చిల్ల‌ర భాష‌, చిచోర భాష‌: హ‌రీశ్‌రావు

Harish Rao | ముఖ్య‌మంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) మాట్లాడేది చిల్ల‌ర భాష‌, చిచోర భాష అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు (Harish Rao) మండిప‌డ్డారు. అసెంబ్లీలో గ‌తంలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడని భాష రేవంత్ మాట్లాడుతున్నార‌ని విమ‌ర్శించారు. హుందా అనే పదం పలికే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు.

A

Telangana | Published On Dec 28, 2025, 7.07 pm IST

Harish Rao | రేవంత్‌ది చిల్ల‌ర భాష‌, చిచోర భాష‌: హ‌రీశ్‌రావు
Advertisement

Harish Rao | ముఖ్య‌మంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) మాట్లాడేది చిల్ల‌ర భాష‌, చిచోర భాష అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు (Harish Rao) మండిప‌డ్డారు. అసెంబ్లీలో గ‌తంలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడని భాష రేవంత్ మాట్లాడుతున్నార‌ని విమ‌ర్శించారు. హుందా అనే పదం పలికే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. బీఆర్ఎస్ఎల్‌పీ (BRSLP) కార్యాల‌యంలో విలేక‌రుల‌తో చిట్ చాట్ నిర్వ‌హించిన హ‌రీశ్‌రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ (BRS) హ‌యాంలో అసెంబ్లీని సంవ‌త్స‌రానికి 32 రోజులు స‌మావేశ‌ప‌రిచామ‌ని, కాంగ్రెస్ మాత్రం సంవ‌త్స‌రానికి స‌గ‌టున ఇర‌వై రోజులు కూడా పెట్ట‌డం లేద‌ని దుయ్య‌బ‌ట్టారు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ఏడాదికి 45 రోజులు అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హించాల‌న్న కాంగ్రెస్ నేడు దానిని ఇర‌వై రోజుల‌కు కుదించింద‌ని ఎద్దేవా చేశారు. ఆ ఇర‌వై రోజుల‌లో ఎమ్మెల్యేలు చ‌నిపోయినందుకు రెండు రోజులు సంతాప తీర్మానాలు, మూడు శ్వేత‌ప‌త్రాలు, ఒక రోజు కాళేశ్వ‌రం క‌మిష‌న్ రిపోర్టు, బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై ఒక రోజు స‌భ నిర్వ‌హించార‌ని గుర్తు చేశారు. ఇక ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేందుకు స‌మ‌యం ఎక్క‌డుంద‌ని ప్ర‌శ్నించారు. ప్రతిపక్షంపై బురద చ‌ల్లేందుకు సమావేశాలు పెడుతున్నారు తప్ప ప్రజా సమస్యలు చర్చించడానికి కాదని అన్నారు. అసెంబ్లీని న‌డిపేందుకు ప్రభుత్వం భయపడుతోందని చెప్పారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఇచ్చిన ఒక్క అంశంపై చర్చ పెట్టకపోతే అసెంబ్లీని నడిపి ఎందుక‌ని ప్ర‌శ్నించారు. అసెంబ్లీని కాంగ్రెస్ అంగబలంతో, మందబలంతో నడుపుతున్నారని ధ్వ‌జ‌మెత్తారు. ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు అసెంబ్లీని నడుపుతామని చెప్పిన వాళ్లు గ‌త అసెంబ్లీ స‌మావేశాల‌ను కేవ‌లం ఒక‌రోజు మాత్ర‌మే పెట్టార‌ని గుర్తు చేశారు.

45 టీఎంసీలు చాల‌ని ఉత్త‌మ్ లేఖ రాశారా.. లేదా..

పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయించిన నీటిని 90టీఎంసీల నుంచి 45 టీఎంసీలకు కుదించారని హ‌రీశ్‌రావు చెప్పారు. 45 టీఎంసిలు చాలు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారా లేదా అని ప్ర‌శ్నించారు. డిఫెన్స్‌లో పడినప్పుడు అసెంబ్లీని పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కృష్ణానది ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తే కేసీఆర్ వచ్చి పోరాటం చేశారని గుర్తు చేశారు. అప్పుడు అసెంబ్లీలో లెంపలు వేసుకుని నిర్ణయాన్ని వాపస్ తీసుకుని, తీర్మానం చేశార‌ని చెప్పారు. 45 టీఎంసిలతో నల్గొండ, రంగారెడ్డి, పాలమూరు జిల్లాల్లో ఏ జిల్లాను ఎండబెడతారని ప్ర‌శ్నించారు. ఏడాది కింద డీపీఆర్ వాపస్ వస్తే ఇప్పటి వరకు ఎందుకు తిరిగి సబ్మిట్ చేయలేదో స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఇటీవ‌ల విలేక‌రుల స‌మావేశంలో కేసీఆర్ అదే విషయాన్ని సూటిగా చెప్పారని అన్నారు. అసెంబ్లీని 15 రోజులు నడపాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంద‌ని చెప్పారు. అసెంబ్లీలో ప్రభుత్వం ఏం చర్చ పెట్టినా తాము మాట్లాడతామన్నారు. తాము పూర్తిగా ప్రిపేర్ అయ్యామ‌ని, వారిలాగా ప్రిపేర్ కాకుండా అసెంబ్లీకి రామ‌ని స్ప‌ష్టం చేశారు. గ‌తంలో ఘోష్ క‌మిష‌న్ రిపోర్ట్‌పై తాను మాట్లాడితే ఏడుగురు మంత్రులు అడ్డుప‌డ్డార‌ని పేర్కొన్నారు.

అన్ని వ్య‌వ‌స్థాల్లాగానే అసెంబ్లీనీ భ్ర‌ష్టుప‌ట్టించారు

కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించినట్లుగానే అసెంబ్లీని సైతం భ్రష్టుపట్టించారని హ‌రీశ్‌రావు ఆరోపించారు. అసెంబ్లీలో బీఆర్ఎస్‌కు స్పీక‌ర్ మైక్ ఇవ్వ‌డం లేద‌ని అన్నారు. త‌మ‌కంటే త‌క్కువ సంఖ్య‌లో ఎమ్మెల్యేలు ఉన్న వారికి ఇద్ద‌రు, ముగ్గురికి మైక్ ఇచ్చార‌ని చెప్పారు. అసెంబ్లీ హౌజ్ క‌మిటీలు ఇప్ప‌టివ‌ర‌కు వేయ‌లేద‌ని విమ‌ర్శించారు. లోపం స్పీకర్ వద్ద ఉందా, శాసనసభ వ్యవహారాల శాఖామంత్రి దగ్గర ఉందా అని ప్ర‌శ్నించారు. ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్ గా ఉత్తమ్ పద్మావతి రెడ్డిని నియమిస్తే వెంటనే ఆమె రాజీనామా చేశారని, అస‌లు ఎస్టిమేట్స్ కమిటీకి ఎన్నికనే జరగలేదని పేర్కొన్నారు. పీఏసీ చైర్మన్ పదవికి బ్యాక్ గేట్ నుంచి నామినేషన్లు తీసుకుని చైర్మన్‌ను ఎంపిక చేశారని దుయ్య‌బ‌ట్టారు.

స‌మ‌స్య‌లు, ఎగ్గొట్టిన హామీల‌పై చ‌ర్చ జ‌ర‌గాలి

రాష్ట్రంలో ఎరువుల కొరత, ఎగ్గొట్టిన రైతు బంధు, రుణమాఫీ, పంట బోనస్‌పై అసెంబ్లీలో చర్చ జరగాలని హ‌రీశ్ అన్నారు. 5 లక్షల కోట్ల హిల్ట్ పాలసీ కుంభకోణం, జాబ్ క్యాలెండర్‌పై చర్చ జరగాలని చెప్పారు. రేవంత్ రెడ్డికి ఫుట్ బాల్ సోకులు, గురుకుల పాఠశాలల విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌తో కోఠీ, కొండాపూర్ ఆస్పత్రుల్లో చేరిన అంశం, ప్రభుత్వ ఉద్యోగుల డీఎల పెండింగ్, రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం పడ్డ బకాయిలపై అసెంబ్లీలో చర్చ జరగాలన్నారు. ప్రజా ప్రభుత్వం మీది అయితే అసెంబ్లీలో చర్చ పెట్టాలని సూచించారు. బీఏసీలో ప్రజా సమస్యలపై చర్చ జరగాలని పట్టు పడతామని చెప్పారు. ప్రభుత్వం ఏ అంశంపైన చర్చ పెట్టినా సిద్దంగా ఉన్నామ‌న్న ఆయ‌న తాము అడిగిన అంశాలపై చర్చ పెట్టేందుకు సిద్ధంగా ఉండాల‌ని అన్నారు.

అభాండాల‌కు అసెంబ్లీలోనే స‌మాధాన‌మిస్తాం

కృష్ణా జలాల అంశంలో బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ వేస్తున్న అన్ని అభాండాలకు అసెంబ్లీలోనే సమాధానం చెబుతామ‌ని హ‌రీశ్‌రావు అన్నారు. 299 టీఎంసీ లకు ఒప్పుకున్నది గత కాంగ్రెస్ ప్రభుత్వమేన‌ని గుర్తు చేశారు. 299 టీఎంసీలను వ్యతిరేకిస్తూ అపెక్స్ కౌన్సిల్లో తాము ఫిర్యాదు చేశామని చెప్పారు. దీనిపై బీఆర్ఎస్ ప్ర‌భుత్వం 32 లేఖ‌లు రాసింద‌ని పేర్కొన్నారు. కృష్ణా జలాలను తిరిగి రాష్ట్రాలకు పంచితేనే న్యాయం జరుగుతుందని అభిప్రాయ‌ప‌డ్డారు. ఆధారాలతో సహా కాంగ్రెస్ తప్పిదాలను ఎత్తిచూపుతామ‌ని స్ప‌ష్టం చేశారు. కాంగ్రెస్‌ది ప్రజా పాలన కాదన్న ఆయ‌న ప్ర‌శ్నించే గొంతుల‌ను నొక్కే పాల‌న‌గా అభివ‌ర్ణించారు. కాంగ్రెస్‌కు అసెంబ్లీలో పీపీటీకి అవకాశం ఇస్తే బీఆర్ఎస్‌కు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement