త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kalwakuntla Kavitha | భూల‌క్ష్మి ప‌థ‌కంతో నిరుపేద‌లంద‌రికీ ఎక‌రం భూమి.. మ‌ళ్లీ భూ పంపిణీ జ‌రిగితేనే సామాజిక న్యాయం

Kalwakuntla Kavitha | భూల‌క్ష్మి ప‌థ‌కం తెచ్చి రాష్ట్రంలోని నిరుపేద‌లంద‌రికీ ఎక‌రం చొప్పున భూ పంపిణీ చేస్తామ‌ని తెలంగాణ రక్ష‌ణ సేన చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత అన్నారు. మేం ఆ ప‌ని చేయ‌క‌ముందే సీఎం రేవంత్ ఎక‌రం చొప్పున పంచాల‌ని డిమాండ్ చేశారు.

S

Telangana | Published On Aug 18, 2026, 1.47 pm IST

Kalwakuntla Kavitha | భూల‌క్ష్మి ప‌థ‌కంతో నిరుపేద‌లంద‌రికీ ఎక‌రం భూమి.. మ‌ళ్లీ భూ పంపిణీ జ‌రిగితేనే సామాజిక న్యాయం
Advertisement
  • లెక్క‌ల‌న్నీ తీశాం.. ఎక‌రం చొప్పున పంచొచ్చు
  • ప్రభుత్వం ద‌గ్గ‌ర 60 లక్షల ఎకరాల భూమి ఉంది.. భూదాన్ భూములూ ఉన్న‌య్
  • సామాజిక అన్యాయం అనాల్సిన రేవంతు.. సామాజిక న్యాయం అంటుండు
  • మేం స‌భ పెట్టినంక‌నే ఆయ‌నకు సామాజిక న్యాయం గుర్తొచ్చింది
  • రాష్ట్రంలో రేవంత్ రాక్షస రాజ్యం (ఆర్ఆర్ఆర్) నడుస్తోంది
  • 22ఏ ద్వారా ఈ ప్రభుత్వం భూ దొంగతనానికి రాచబాట వేసుకుంటోంది
  • టీఆర్ఎస్ చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత తీవ్ర ఆరోప‌ణ‌లు

Kalwakuntla Kavitha | త్రినేత్ర‌.న్యూస్: భూల‌క్ష్మి ప‌థ‌కం తెచ్చి రాష్ట్రంలోని నిరుపేద‌లంద‌రికీ ఎక‌రం చొప్పున భూ పంపిణీ చేస్తామ‌ని తెలంగాణ రక్ష‌ణ సేన చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత అన్నారు. లెక్క‌ల‌న్నీ తీశామ‌ని.. ప్ర‌భుత్వం వ‌ద్ద 60 ల‌క్ష‌ల భూమి ఉంద‌ని.. ఎక‌రం చొప్పున‌ పంచ‌డం సాధ్య‌మేన‌ని చెప్పారు. మేం ఆ ప‌ని చేయ‌క‌ముందే సీఎం రేవంత్ ఎక‌రం చొప్పున పంచాల‌ని డిమాండ్ చేశారు. సామాజిక అన్యాయం అనాల్సిన నోట.. సామాజిక న్యాయం అని రేవంత్ అంటున్నార‌ని విమ‌ర్శించారు. మేం సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ పెట్టిన తర్వాతే ముఖ్యమంత్రి సామాజిక న్యాయం గురించి మాట్లాడటం మొదలుపెట్టాడన్నారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం జ‌ర‌గాలంటే మ‌ళ్లీ భూ పంపిణీ జ‌ర‌గాల‌ని స్ప‌ష్టం చేశారు. ఈమేర‌కు మంగ‌ళ‌వారం బంజారాహిల్స్‌లో మీడియా స‌మావేశంలో క‌విత మాట్లాడుతూ సీఎం రేవంత్‌పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. 22 ఏ ద్వారా కాంగ్రెస్‌ ప్రభుత్వం భూ దొంగతనానికి రాచబాట వేసుకుంటోందని ఆరోపించారు.

మేం చెప్పిందే జ‌రిగింది..

రాష్ట్రంలో రేవంత్ రాక్షస రాజ్యం (ఆర్ఆర్ఆర్) నడుస్తోంది. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు భూ దొంగలు. ఆయనది సామాజిక న్యాయం కాదు ఆటవిక న్యాయం. మేం సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ పెట్టిన తర్వాతే ముఖ్యమంత్రి సామాజిక న్యాయం గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. మా సభ తర్వాత కచ్చితంగా సామాజిక తెలంగాణ గురించి మాట్లాడే అనివార్యత వస్తుందని చెప్పాం. ఇప్పుడు అదే జరిగింది. 31 నెలలుగా మాట్లాడని ముఖ్యమంత్రి మా ఒత్తిడి కారణంగా సామాజిక న్యాయం అనే మాట మాట్లాడుతున్నారు. మేం తీసుకొచ్చిన అనివార్యత కారణంగానే అధికారంలో ఉన్న పార్టీ దిగివచ్చి సామాజిక న్యాయం అంటోంది.

మంత్రివర్గంలో ముగ్గురే బీసీలు ఉంటారా?

కానీ ముఖ్యమంత్రి సామాజిక అన్యాయం అనాల్సింది పోయి సామాజిక న్యాయం అన్నట్లు అనిపిస్తోంది. ఎందుకంటే ఆయన చేసేదే సామాజిక అన్యాయం. కానీ సామాజిక న్యాయం అంటాడు. నిజంగా సామాజిక న్యాయంపై చిత్తశుద్ధి ఉంటే మంత్రివర్గంలో 16 మంది ఉంటే ముగ్గురు మాత్రమే బీసీలు ఉంటారా? ఏడుగురు మాత్రమే బీసీలు ఉన్నారు. అందరికీ మంత్రి పదవులు సాధ్యమా అంటే ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు కదా? వాళ్లలో మీకు ఎవరు కూడా అర్హత ఉన్నవాళ్లలాగ కనిపించలేదా? అడవిలో బలమైన జంతువుదే రాజ్యం. మనం అలా ఉండకూడదని సోసైటీగా ఉండాలని అనుకున్నాం. మాటల్లో కాకుండా చేతల్లో సామాజిక న్యాయం అనేది చేసి చూపాలి. గత రెండేళ్లలో 5 లక్షల 96 వేల కోట్ల బడ్జెట్ పెడితే బీసీల కోసం ఖర్చు చేసింది 5 వేల 5 వందల కోట్లే. అంటే ఒక్క శాతం మాత్రమే బీసీల కోసం ఖర్చు చేశారంటే ఎంత అన్యాయం. బీసీల జనాభా ఎంత? మీరు ఖర్చు చేసింది ఎంత?

విజ‌య‌శాంతికి మంత్రి ప‌ద‌వి ఎందుకివ్వ‌లే?

ఇద్దరు ఆడబిడ్డలకు మంత్రి పదవులు ఇచ్చామని చెబుతున్నారు. అది 33 శాతం అవుతుందా? తెలంగాణ ఉద్యమకారురాలు విజయశాంతిని ఎమ్మెల్సీ చేసి సైలెంట్ చేశారు. ఆమెకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు?
అందుకే ఈ ముఖ్యమంత్రి సామాజిక న్యాయం అంటే మనం నమ్మవద్దు. మేక వన్నె పులి మాదిరిగా ఆయన సామాజిక న్యాయం అంటున్నాడు.

వీహెచ్‌కు, శ‌శిధ‌ర్‌రెడ్డికి ఎందుకంత వ్య‌త్యాసం?

ఇటీవల అడ్వయిజరీ పదవులు వీహెచ్‌కు, శశిధర్ రెడ్డికి ఇచ్చారు. కానీ వీహెచ్‌కు చాలా తక్కువ జీతం, తక్కువ ర్యాంక్ ఇచ్చారు? కాంగ్రెస్‌లో ఎప్పటి నుంచో ఉండి మేం చిన్ననాటి నుంచి కూడా రాజీవ్ గాంధీ జయంతి నిర్వహిస్తున్న వ్యక్తి వీహెచ్ గారు. ఆయనకు తక్కువ జీతం, తక్కువ ర్యాంక్ ఇచ్చారు. శశిధర్ రెడ్డికి మాత్రం రెండున్నర లక్షల జీతం ఇచ్చారు. ఎందుకు వారిద్దరిలో అంత వ్య‌త్యాసం? దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి.

ఎటు చూసినా అగ్రకులాల వారికే ప‌ద‌వులు

ఆర్టీఐ కమిషనర్లు ఇస్తే వారిలో ఒక్క బీసీ కూడా లేడు. పైగా ఆర్టీఐ కమిషనర్ భార్యను చిత్రపురి కాలనీ సోసైటీలో మెంబర్‌ను చేశారు. చిత్రపురి కాలనీ వాళ్లకు న్యాయం చేస్తానని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి ఊదరగొట్టారు. 52 జడ్జిమెంట్లు ఉన్నా సరే వారికి న్యాయం చేయటం లేదు. సంబంధం లేని వాళ్లకు సొసైటీలో పదవులు ఇచ్చారు. ఎటు పక్క చూసినా సరే అగ్రకులాలకు చెందిన వారికే పదవులు ఇస్తున్నారు. ఈ ముఖ్యమంత్రి మాట్లాడేది సామాజిక న్యాయం, కానీ చేసేది ఆటవిక న్యాయం.

మహిళలపై కూడా మీకు గౌరవం లేదు. గాంధీ భవన్‌లో ఎంతమంది మహిళలు పదవుల కోసం ధర్నా చేశారు?ప్రియాంక గాంధీ పోటీ చేస్తే మీరంతా వెళ్లి గెలిపించుకుంటారు. కానీ మీనాక్షి నటరాజన్‌ను మాత్రం ఈ ముఖ్యమంత్రే కుట్ర చేసి ఓడిస్తాడు. ఇదేనా మీరు చెప్పే సామాజిక న్యాయం, మాటల్లో కాదు చేతల్లో ఉండాలి. యాదగిరి గుట్టలో డిప్యూటీ సీఎంను కింద కూర్చోబెట్టి అవమానించారు. ఎంపీ వంశీకి కనీసం పుష్కరాల ఇన్విటేషన్ కూడా ఇవ్వలేదు. బీసీ బిడ్డలు మంత్రి వాకిటి, కొండా సురేఖను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఘోరంగా అవమానించారు. పొంగులేటి కన్నా సీనియర్ అయిన కొండా సురేఖను అవమానించలేదా?

లంబాడా మినిస్టర్‌ లేని ఏకైక కేబినెట్ మీదే..

మైనారిటీలకు కూడా రెండేళ్లు మంత్రి పదవి ఇవ్వలేదు. మేం పోరాటం చేస్తే ఈ మధ్యనే అజారుద్దీన్‌కు పదవి ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీల నిధుల్లో 40 శాతం కూడా వారి కోసం ఖర్చు చేయటం లేదు. కాంగ్రెస్ పార్టీ తీసుకునే క్రమశిక్షణ చర్యల్లో కూడా బీసీలకు ఒక విధంగా, అగ్రకులాలకు ఒక విధంగా ఉంటాయి.

సీఎం సోద‌రులు తెలంగాణ భూమాత‌ను చెర‌బ‌డుతున్న‌రు..

ఇక తెలంగాణలో జరుగుతున్న భూ దోపిడీ గురించి దేశం మొత్తం కథలు కథలుగా చెప్పుకుంటోంది. ముఖ్యమంత్రి సోదరులు ఏడుగురు తెలంగాణ భూమాతను చెరబట్టారు. వాళ్ల రౌడీ ముఠా మొత్తం తెలంగాణ భూమిని దొంగతనం చేస్తోంది. పేదవాళ్ల భూములను గుంజుకొని పెద్దవాళ్లకు కట్టబెడుతున్నారు. తెలంగాణలో రేవంత్ రాక్షస రాజ్యం ట్రిపుల్ ఆర్ నడుస్తోంది. ముఖ్యమంత్రి సోదరులు వాళ్ల కుటుంబం భూ దొంగలు అని నేను చెబుతున్నా. రాష్ట్రంలో ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అనే పరిస్థితి పాలన జరుగుతోంది. పొంగులేటిని గెలిపిస్తే వాళ్ల కొడుకు, శ్రీధర్ బాబును గెలిపిస్తే వాళ్ల సోదరుడు, భట్టిని గెలిపిస్తే వాళ్ల కుటుంబ సభ్యులు ప్రజల మీద పడుతున్నారు.

మొత్తం ఒక 200 మంది ముఠా ప్రజల మీద పడి వాళ్లను ఇబ్బంది పెడుతున్నారు. ఇందిరమ్మకాలంలో పేద ప్రజలకు ఇచ్చిన భూములను రాబందుల్లా లాక్కుంటున్నారు. ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత పేదల దగ్గర నుంచి 30 వేల ఎకరాల భూములను లాక్కున్నారు. మీరు పేదలకు భూములు ఇవ్వలేదు. పీవీ గారు ఇందిరాగాంధీని ఒప్పించి పేదలకు భూములు ఇచ్చారు. తెలంగాణలో నిజాం కొంతమంది పేదలకు భూములు ఇచ్చారు. వాటిని మీరు లాక్కుంటున్నారు. ఎన్నికల్లో మాట ఇచ్చిన విధంగా అసైన్డ్ ల్యాండ్ లకు యాజమాన్యం హక్కులు ఇవ్వాలి. వికారాబాద్‌లో పరిశ్రమల పేరుతో 80 శాతం అసైన్డ్ ల్యాండ్ లను తీసుకున్నారు.

చేతులు జోడించి అడుగుతున్నా.. మేధావులారా రండి.. కొట్లాడుదాం

అందుకే ఈ భూదోపిడీని నివారించేందుకు విప్లవాత్మకంగా పోరాటం చేద్దాం. కలిసి రావాలని తెలంగాణ మేధావులను చేతులు జోడించి కోరుతున్నా. మనం రాష్ట్రం కావాలని పట్టుబట్టి పోరాటం చేస్తేనే సాధ్యమైంది. అలాగే సామాజిక న్యాయం కోసం పోరాటం చేయాలి. సామాజిక న్యాయం జరగాలంటే ఈ రాష్ట్రంలో మరొక్క మారు భూ పంపిణీ జరగాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి కుటుంబానికి భూమి అంటే వ్యాపారం కావచ్చు. కానీ ఆదీవాసీలకు, పేదలకు, మధ్య తరగతి వాళ్ల కు భూమి అంటే పంచప్రాణం. అందుకే పేదలకు భూమి పంపిణీ జరగాల్సిందే.

మానవత్వంతో కూడిన పాలన ఈ ప్రభుత్వంలో లోపించింది. అందరికీ సమానమైన అవకాశాలు కల్పించాలి. పేదలకు భూమి పంపిణీ చేయాలి. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత భూలక్ష్మి పేరుతో ప్రతి కుటుంబానికి ఎకరం భూమి పంచుతాం. సోషల్ జస్టిస్ జరగాలంటే.. మళ్లీ ల్యాండ్ రీ డిస్ట్రిబ్యూషన్ జరగాల్సిందే. మేం అధికారంలోకి వచ్చాక ఎకరం భూమి పంచుతాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడే ఆ పనిచేయాలని డిమాండ్ చేస్తున్నాం.

పేదల భూములను లాక్కుంటామంటే మాత్రం ఊరుకునేది లేదు. వారి తరఫున మేం పోరాటం చేస్తాం. సమాజంలో భూమి ఉందంటే ఉండే గౌరవం వేరు. సామాజిక న్యాయం జరగాలంటే ప్రజలకు కచ్చితంగా భూమి ఉండాల్సిందే. కుటుంబానికి ఎకరం భూమి పంచే అవకాశం ఉందన్న లెక్కలు చూసుకున్న తర్వాతే భూ లక్ష్మి పథకం గురించి మాట్లాడుతున్నా. ప్రభుత్వం వద్ద 60 లక్షల ఎకరాలు ఉంది. భూదాన్ భూములు కూడా ఉన్నాయి. భూదాన్ భూముల్లో దాదాపు లక్ష ఎకరాలు ఎక్కడకు పోయాయో లెక్క లేకుండా చేశారు. రాష్ట్రంలో కుటుంబానికి ఎకరం భూమి పంచేందుకు ఉంది. కానీ ప్రభుత్వాలకు మనసు లేదు.

సీడ్ కంపెనీలకు బినామీ పేర్లతో వేలాది ఎకరాలు ఉన్నాయి. ప్రభుత్వం సిన్సియర్‌గా ఆలోచిస్తే భూమి ఇవ్వవచ్చు. ధరణి, భూ భారతి అనేది రెండింటిని మిస్ యూజ్ చేస్తున్నారు. 22 ఏ అనేది ఈ ప్రభుత్వం భూ దొంగతనం చేసేందుకు వేసుకుంటున్న రాచబాట. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు భూ దొంగలు అని మళ్లీ చెబుతున్నా అని క‌ల్వ‌కుంట్ల క‌విత నొక్కి చెప్పారు.

Advertisement
Advertisement