త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | కేంద్రంతో క‌లిసే న‌డుస్తాం.. సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్య‌లు..

కేంద్ర ప్ర‌భుత్వంతో క‌లిసే ముందుకు న‌డుస్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ప్ర‌క‌టించారు. విక‌సిత్ భార‌త్ త‌ర‌హాలోనే విజ‌న్ 2047 సాధ‌న కోసం క‌లిసి వెళ్తామ‌ని వెల్ల‌డించారు. సీఎం సోమ‌వారం మీడియాతో చిట్‌చాట్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప‌లు అంశాల‌పై స్పందించారు.

P

Telangana | Published On May 11, 2026, 5.15 pm IST

CM Revanth Reddy | కేంద్రంతో క‌లిసే న‌డుస్తాం.. సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్య‌లు..
Advertisement
  • ప్ర‌ధాని పిలుపును స్వాగ‌తిస్తున్నాం
  • విజ‌న్ 2047 కోసం వెళ్లేందుకు అభ్యంత‌రం లేదు
  • పార్టీలు, ఐడియాల‌జీ వేరైనా అభివృద్ధి కోసం క‌లిసి వెళ్తాం
  • కేంద్ర‌మంత్రి బండి సంజ‌య్ కొడుకు కేసుపై స్పంద‌న‌
  • బాధితుల స్టేట్‌మెంట్ తీసుకుని చట్ట ప్రకారం చర్యలు
  • ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి
  • మీడియాతో చిట్‌చాట్‌

త్రినేత్ర‌.న్యూస్ : కేంద్ర ప్ర‌భుత్వంతో క‌లిసే ముందుకు న‌డుస్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ప్ర‌క‌టించారు. విక‌సిత్ భార‌త్ త‌ర‌హాలోనే విజ‌న్ 2047 సాధ‌న కోసం క‌లిసి వెళ్తామ‌ని వెల్ల‌డించారు. సీఎం సోమ‌వారం మీడియాతో చిట్‌చాట్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప‌లు అంశాల‌పై స్పందించారు. ప్రధాని అధికారిక కార్యక్రమంలో తాను పాల్గొన్నాన‌న్నారు. తమతో కలిసి రావాలన్న ప్రధాని పిలుపును స్వాగతిస్తున్న‌ట్లు తెలిపారు. అందులో రాజకీయాలకు తావులేద‌ని, అభివృద్ధి, సంక్షేమంలో కేంద్రంతో కలిసి వెళ్లేందుకు అభ్యంతరం లేదన్నారు. వికసిత్ భారత్‌ లాగే విజన్‌ 2047 సాధనకు కేంద్రంతో కలిసి న‌డుస్తామ‌ని, మూడు ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ అందుకునేందుకు కేంద్రంతో క‌లిసి ముందుకెళ్తామ‌న్నారు. కేంద్రం, రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకెళ్లాలని, త‌మ పార్టీలు, ఐడియాలజీ వేరైనా అభివృద్ధి కోసం కలిసి ప‌ని చేస్తామ‌న్నారు. ఎన్నోసార్లు కలిసినా కేంద్రం నుంచి ఆశించిన మద్దతు రాలేద‌న్నారు. 2 గంటలు సమయమిస్తే మా ప్రణాళికను ప్రధానికి వివ‌రిస్తామ‌న్నారు. మెట్రోపాలిటన్ నగరాలకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయాలని సీఎంను కోరిన‌ట్లు తెలిపారు.

బ్రిటిష్ జ‌న‌తా పార్టీ..

ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టుకు 50శాతం నిధులు ఇవ్వాల‌ని కేంద్రాన్ని కోరిన‌ట్లు సీఎం పేర్కొన్నారు. మెట్రో, సదరన్ పార్ట్ రీజినల్ రింగ్ రోడ్ వంటి ప‌లు ప్రాజెక్టులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయ‌న్నారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, ఎయిర్‌పోర్ట్ క్లియరెన్స్‌, డిఫెన్స్ ల్యాండ్స్, మూసీ ప్రాజెక్టుకు ఏడీబీ నిధులు, నేషనల్ హైవేలకు అనుమతులు వ‌చ్చాయ‌ని, కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈ పనుల్లో జాప్యం జ‌రిగింద‌ని ఆరోపించారు. ఈ సంద‌ర్భంగా బీజేపీ పార్టీపై సీఎం విమ‌ర్శ‌లు గుప్పించారు. బీజేపీని బ్రిటిష్ జ‌న‌తా పార్టీగా అభివ‌ర్ణిస్తూ.. విభజించి పాలించడం ఆ పార్టీ సిద్ధాంతమన్నారు. ముస్లింలు, క్రిస్టియన్లు, మావోయిస్టులు సైతం ఈ దేశ ప్రజలేన‌న్న సీఎం అందరికీ సమాన హక్కులు ఉన్నాయ‌న్నారు. ఆ పార్టీ సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన వారిని ఖతం చేయడం వాళ్ల విధానమని ఆరోపించారు. తమ సిద్ధాంతాన్ని వ్యతిరేకించినా ఒప్పించి జనజీవన స్ర‌వంతిలో కలపడం కాంగ్రెస్ విధాన‌మ‌న్నారు. విదేశాంగ విధానంలో కేంద్రం పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని, ఇందులో కేంద్రానికి స్పష్టమైన విధానం లేద‌ని విమ‌ర్శించారు. జెమిని సర్కస్ లా బీజేపీ ఎన్నికల విధానం ఉంటుందని సెటైర్లు వేశారు. అనుభ‌వ‌లేమి, అహంకారం కార‌ణంతో దేశాన్నిసంక్షోభంలోకి నెడుతున్నారన్నారు.

బెంగాల్‌లో 90ల‌క్ష‌ల ఓట్లు తొల‌గించారు..

బీజేపీ స‌ర్ కార్య‌క్ర‌మాన్ని ఆయుధంగా ఉప‌యోగిస్తోంద‌ని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బెంగాల్‌లో 90 లక్షల ఓట్లను తొలగించారన్నారు. కేర‌ళ‌లో బీజేపీ పార్టీ కేవ‌లం మూడు సీట్లు, త‌మిళ‌నాడులో ఒకే సీటుకు ప‌రిమిత‌మైంద‌న్నారు. ఏ రాష్ట్రంలో గెల‌వాల‌నుకుంటే.. అక్క‌డ స‌ర్‌ని ప్ర‌యోగిస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జూబ్లీహిల్స్‌లో బీజేపీకి డిపాజిట్ రాలేదని, మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి ఏంట‌ని ప్ర‌శ్నించారు. బీజేపీ రెండు సీట్ల‌తో ప్రారంభ‌మైంద‌న్న ప్ర‌ధాని వ్యాఖ్య‌ల‌పై స్పందిస్తూ.. మ‌ళ్లీ ఆ పార్టీ అక్కడికే వ‌స్తుంద‌న్నారు. కాంగ్రెస్‌ను మోదీ విమ‌ర్శిస్తే తనను విమ‌ర్శించిన‌ట్లేన‌న్నారు. తెలంగాణకు కేంద్రం నుంచి స‌రైన స‌హ‌కారం లేద‌ని, బీజేపీకి ప్రజాస్వామ్యంపైన నమ్మకం లేదని మండిపడ్డారు. తమిళనాడులో అతిపెద్ద పార్టీకి ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ ఆహ్వానించకుండా నిర్లక్ష్యం ఎందుకు చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ జపం చేయకుండా బీజేపీ బ‌త‌క‌లేద‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు.

బండి సంజ‌య్ కొడుకు కేసుపై స్పందిస్తూ..

బండి సంజయ్‌ కొడుకు కేసు వ్య‌వ‌హారంపై సీఎం రేవంత్ స్పందించారు. అమ్మాయి తల్లి ఫిర్యాదు మేరకు ఈ నెల 8న పేట్ బషీరాబాద్ పీఎస్‌లో బండి భ‌గీర‌థ్‌పై ఎఫ్ఐఆర్ న‌మోదైంద‌న్నారు. ఈ కేసుపై పోలీసుల విచారణ ప్రారంభమైంద‌ని, బీఆర్ఎస్ వాళ్లు కోరుకున్నట్లు క్షణాల మీద యాక్షన్ తీసుకోలేమ‌న్నారు. బాధితుల స్టేట్‌మెంట్ తీసుకుని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేసింది పోలీసులేన‌ని.. ఈ విష‌యం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు తెలియ‌దా? అంటూ ప్ర‌శ్నించారు. చ‌ట్టానికి ఎవరూ అతీతులు కాద‌ని, ఎవరిని మేం ఇప్పటి వరకు వదిలిపెట్టలేద‌న్నారు. చట్టం తన పని తాను చేస్తుంది.. ఎవరికి మినహాయింపులు లేవ‌ని తేల్చి చెప్పారు.

Advertisement
Advertisement