త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | కొడంగల్‌లో పారిశ్రామిక హబ్‌.. 535 మందికి ఉద్యోగాలు

CM Revanth Reddy | పారిశ్రామిక ప్రగతికి కొత్త చిరునామాగా కొడంగల్‌ను తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలకు కేంద్రంగా కొడంగల్‌లో రేర్‌ (RARE–Rural Agriculture Regional Economy) ఇండస్ట్రియల్‌ హబ్‌ను అభివృద్ధి చేస్తోంది.

P

Telangana | Published On Nov 7, 2026, 8.12 pm IST

CM Revanth Reddy | కొడంగల్‌లో పారిశ్రామిక హబ్‌.. 535 మందికి ఉద్యోగాలు
Advertisement
  • 943 ఎకరాల్లో రేర్‌ ఇండస్ట్రియల్‌ హబ్‌ అభివృద్ధి
  • ఇప్పటికే రెండు సంస్థలకు 96 ఎకరాల భూమి కేటాయింపు
  • రూ.252.86 కోట్ల పెట్టుబడులు..
  • పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్‌ ముఖాముఖి

CM Revanth Reddy | పారిశ్రామిక ప్రగతికి కొత్త చిరునామాగా కొడంగల్‌ను తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలకు కేంద్రంగా కొడంగల్‌లో రేర్‌ (RARE–Rural Agriculture Regional Economy) ఇండస్ట్రియల్‌ హబ్‌ను అభివృద్ధి చేస్తోంది. హైదరాబాద్‌కే పరిశ్రమలు పరిమితం కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు పారిశ్రామిక అభివృద్ధిని విస్తరించడం, స్థానిక యువతకు సొంత ప్రాంతంలోనే ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ హబ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొడంగల్‌ రేర్‌ ఇండస్ట్రియల్‌ హబ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని, పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి నిర్వహించారు.

943 ఎకరాల్లో హబ్‌ అభివృద్ధి

కొడంగల్‌లో 943.34 ఎకరాల విస్తీర్ణంలో వివిధ రంగాలకు చెందిన పరిశ్రమలను ఆకర్షించేలా రేర్‌ ఇండస్ట్రియల్‌ హబ్‌ను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నారు. రేడియల్‌ రోడ్డు వెంట ఈ హబ్‌ ఉండటంతో పరిశ్రమలకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుంది. భూసేకరణ కోసం ప్రభుత్వం రూ.220 కోట్లు వెచ్చించింది. రోడ్లు, నీరు, విద్యుత్‌ తదితర మౌలిక వసతుల కల్పనకు రూ.441.91 కోట్లతో అభివృద్ధి పనుల ప్రణాళికలు రూపొందించింది.

రెండు సంస్థలకు భూముల కేటాయింపు

ఇప్పటికే రెండు పారిశ్రామిక సంస్థలకు ఈ హబ్‌లో భూములు కేటాయించారు. బిర్లా నూ లిమిటెడ్‌కు ఫైబర్‌ సిమెంట్‌ బోర్డుల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు, ఎకోపామ్‌ ఆయిల్‌ అండ్‌ ఫ్యాట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు వెజిటబుల్‌ ఆయిల్స్‌, వ్యవసాయ పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాల కోసం మొత్తం 96 ఎకరాలు కేటాయించారు. ఈ రెండు సంస్థలు కలిపి రూ.252.86 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. వీటి ద్వారా దాదాపు 535 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

వంద మంది పారిశ్రామికవేత్తలతో భేటీ

రేర్‌ ఇండస్ట్రియల్‌ హబ్‌ అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దాదాపు వంద మంది పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి నిర్వహించారు. కొడంగల్‌ పరిసర ప్రాంతాలతోపాటు హైదరాబాద్‌ విమానాశ్రయ ప్రాంతం, ఇతర పారిశ్రామిక క్లస్టర్లకు చెందిన పారిశ్రామిక ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఏరోస్పేస్‌, రక్షణ రంగం, గ్రీన్‌ టెక్నాలజీ, పునరుత్పాదక ఇంధనం, ఉక్కు, రాగి, టెక్స్‌టైల్‌, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ప్రతినిధులు, పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement