త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

John Wesley | అన్యాక్రాంత ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోవాలి.. సీపీఐ(ఎం) జాన్‌వెస్లీ డిమాండ్‌..

John Wesley | అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని భూమిలేని దళితులు, గిరిజనులు, పేదలకు పంపిణీ చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. 22ఎ నిషేధిత భూములు, ‘ధరణి’ అక్రమాలు, భూ కబ్జాలపై ప్రభుత్వం చేపట్టిన విచారణను పారదర్శకంగా నిర్వహించాలని కోరింది.

P

Telangana | Published On Sep 18, 2026, 9.20 pm IST

John Wesley | అన్యాక్రాంత ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోవాలి.. సీపీఐ(ఎం) జాన్‌వెస్లీ డిమాండ్‌..
Advertisement

John Wesley | అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని భూమిలేని దళితులు, గిరిజనులు, పేదలకు పంపిణీ చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. 22ఎ నిషేధిత భూములు, ‘ధరణి’ అక్రమాలు, భూ కబ్జాలపై ప్రభుత్వం చేపట్టిన విచారణను పారదర్శకంగా నిర్వహించాలని కోరింది. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో 388 ఎకరాల ప్రభుత్వ భూమి, మైహోమ్‌ రామేశ్వరరావు ఆధీనంలో 2,647 ఎకరాల భూదాన్‌ భూమి, సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబానికి 308 ఎకరాల భూములపై ఆరోపణలు ఉన్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ పేర్కొన్నారు. వీటితోపాటు కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలు, కార్పొరేట్‌ సంస్థల ఆధీనంలో ఉన్న అసైన్డ్‌, భూదాన్‌, వక్ఫ్‌, అటవీ భూములపై కూడా విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.

అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ నాయకులు, కార్పొరేట్‌ సంస్థలు భూములను ఆక్రమించారన్న ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరపాలని కోరారు. నకిలీ ఎన్‌ఓసీలు, రికార్డుల ట్యాంపరింగ్‌ ద్వారా సీలింగ్‌, భూదాన్‌ భూములు అన్యాక్రాంతమయ్యాయన్న ఆరోపణలపైనా చర్యలు తీసుకోవాలన్నారు. ధరణి, భూభారతి పోర్టళ్లలో సాంకేతిక లోపాలు, ఇతర కారణాలతో 22ఎ నిషేధిత జాబితాలో చిక్కుకున్న చిన్న, సన్నకారు రైతుల పట్టా భూములను వెంటనే జాబితా నుంచి తొలగించాలని జాన్‌ వెస్లీ కోరారు. భూదాన్‌, సీలింగ్‌ భూములపై సమగ్ర ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించి, విచారణ నివేదికల ఆధారంగా శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. భూ సమస్యల పరిష్కారంపై వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement
Advertisement