త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Madhu Yaskhi | జీవో 118 బాధితులకు శాశ్వత పరిష్కారం.. మంత్రులతో మధుయాష్కి భేటీ

Madhu Yaskhi | జీవో 118 బాధితుల రిజిస్ట్రేషన్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆల్‌ ఇండియా ప్రొఫెషనల్‌ కాంగ్రెస్‌ చైర్‌పర్సన్‌, మాజీ ఎంపీ మధుయాష్కిగౌడ్‌ ప్రభుత్వాన్ని కోరారు. ఎల్బీనగర్‌ నియోజకవర్గంలోని 44 బాధిత కాలనీల ప్రజలకు పూర్తి యాజమాన్య హక్కులతో రిజిస్ట్రేషన్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

P

Telangana | Published On Sep 18, 2026, 9.00 pm IST

Madhu Yaskhi | జీవో 118 బాధితులకు శాశ్వత పరిష్కారం.. మంత్రులతో మధుయాష్కి భేటీ
Advertisement

Madhu Yaskhi | జీవో 118 బాధితుల రిజిస్ట్రేషన్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆల్‌ ఇండియా ప్రొఫెషనల్‌ కాంగ్రెస్‌ చైర్‌పర్సన్‌, మాజీ ఎంపీ మధుయాష్కిగౌడ్‌ ప్రభుత్వాన్ని కోరారు. ఎల్బీనగర్‌ నియోజకవర్గంలోని 44 బాధిత కాలనీల ప్రజలకు పూర్తి యాజమాన్య హక్కులతో రిజిస్ట్రేషన్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆహ్వానం మేరకు శుక్రవారం అసెంబ్లీలో ఆయన ఛాంబర్‌లో మధుయాష్కిగౌడ్‌ బాధిత కాలనీల ప్రతినిధులతో కలిసి సమావేశమయ్యారు. సీఎల్‌ఏసీ ప్రతినిధి లోకేశ్‌కుమార్‌, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్‌గాంధీ హనుమంతుతోనూ చర్చించారు. జీవో 118 కింద జారీ చేసిన డీడ్‌ ఆఫ్‌ కన్వేయన్స్‌తో ఎదురవుతున్న ఇబ్బందులను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. జీవో 118తో సంబంధం లేకుండా నూతన హక్కు పత్రాలు జారీ చేసి, భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించి పూర్తి యాజమాన్య హక్కులతో రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలని కోరారు. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.

మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు దృష్టికి స‌మ‌స్య‌..

స్పందించిన మంత్రి పొంగులేటి.. బాధిత కాలనీల ప్రతినిధుల సూచనలను పరిగణనలోకి తీసుకుని రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతోనూ మధుయాష్కిగౌడ్‌ సమావేశమై సమస్యను వివరించారు. ఈ సందర్భంగా మధుయాష్కిగౌడ్‌ మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మునుగోడు ఉప ఎన్నికల ప్రయోజనం కోసం జీవో 118 తీసుకొచ్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపించారు. హుడా లేఅవుట్లలో స్థలాలు కొనుగోలు చేసిన వారిని భూఆక్రమణదారులుగా పేర్కొంటూ నిబంధనలు విధించారని విమర్శించారు. డబుల్‌ ట్యాక్స్‌లతోనూ ప్రజలు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి చొరవతో జీవో 118తో సంబంధం లేకుండా నూతన హక్కు పత్రాలు ఇచ్చి సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా చర్యలు జరుగుతున్నాయని మధుయాష్కి పేర్కొన్నారు. 44 బాధిత కాలనీల ప్రజలకు త్వరలో న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

రేపు బాధితులతో సమావేశం

జీవో 118 బాధిత కాలనీల ప్రతినిధులతో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఎల్బీనగర్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు మధుయాష్కి తెలిపారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హాజరై బాధితులతో మాట్లాడతారని, నూతన హక్కు పత్రాల పంపిణీపై వివరాలు వెల్లడిస్తారని తెలిపారు.

Advertisement
Advertisement