త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Ponguleti | భూ వివాదాల్లేని తెలంగాణ నిర్మాణంలో రీ-సర్వే కీలక ఘట్టం

Minister Ponguleti Srinivas Reddy | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూముల రీ-సర్వే కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యంతో అమలు చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు ప్రతి భూమికి స్పష్టమైన హద్దులు, ప్రతి సర్వే నంబర్‌కు ప్రత్యేక భూధార్ గుర్తింపును కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

P

Telangana | Published On Jul 28, 2026, 6.55 pm IST

Minister Ponguleti | భూ వివాదాల్లేని తెలంగాణ నిర్మాణంలో రీ-సర్వే కీలక ఘట్టం
Advertisement
  • గ్రామసభలతో ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలి
  • కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి గడువులోగా పనులు పూర్తి చేయాలి
  • అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశం

Minister Ponguleti Srinivas Reddy | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూముల రీ-సర్వే కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యంతో అమలు చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు ప్రతి భూమికి స్పష్టమైన హద్దులు, ప్రతి సర్వే నంబర్‌కు ప్రత్యేక భూధార్ గుర్తింపును కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయంలో రీ-సర్వే జరుగుతున్న గ్రామాల పురోగతి, ప్రజల స్పందన, ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై రెవెన్యూ, సర్వే శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా తొలి దశలో జిల్లాకు 70 గ్రామాల చొప్పున ఎంపిక చేసిన 2,240 గ్రామాల్లో రీ-సర్వే కొనసాగుతోందన్నారు. ఈ కార్యక్రమంపై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించేందుకు ప్రతి గ్రామంలో గ్రామసభలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. రీ-సర్వే వల్ల కలిగే ప్రయోజనాలను రైతులు, భూ యజమానులకు వివరించి వారి సహకారం పొందాలని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతోనే ఈ కార్యక్రమం విజయవంతమవుతుందన్నారు. రీ-సర్వే జరుగుతున్న ప్రతి గ్రామంలో అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ప్రజల సందేహాలను వెంటనే నివృత్తి చేయాలని మంత్రి ఆదేశించారు. భూముల హద్దుల నిర్ధారణలో పూర్తి పారదర్శకత పాటిస్తూ ప్రతి దశలో ప్రజలను భాగస్వాములుగా చేయాలని సూచించారు. రీ-సర్వే పనులను జిల్లా కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలని, వారానికోసారి పురోగతిని సమీక్షించాలని మంత్రి ఆదేశించారు. రెవెన్యూ, సర్వే శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను సాధించాలని పేర్కొన్నారు. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు.

భూమి రైతుకు కేవలం ఆస్తి మాత్రమే కాదని, కుటుంబ జీవనాధారమని పేర్కొన్న మంత్రి, దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే ప్రభుత్వం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రీ-సర్వే చేపట్టిందన్నారు. డీజీపీఎస్, రోవర్స్, జీఐఎస్ వంటి ఆధునిక సాంకేతికతతో శాస్త్రీయ పద్ధతిలో సర్వే నిర్వహించడం వల్ల ప్రతి కమతానికి ఖచ్చితమైన హద్దులు నిర్ణయించే అవకాశం ఉంటుందని తెలిపారు. రీ-సర్వే పూర్తయిన అనంతరం ప్రతి సర్వే నంబర్‌కు ప్రత్యేక భూదార్ నంబర్ కేటాయించి, భూ భారతి పోర్టల్‌లో నమోదు చేయడం ద్వారా భూముల యాజమాన్యంపై శాశ్వత స్పష్టత ఏర్పడుతుందని మంత్రి వివరించారు. దీంతో భూ రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు మరింత పారదర్శకంగా, వేగవంతంగా జరిగే అవకాశం ఉంటుందన్నారు. అధికారులు ఈ కార్యక్రమాన్ని కేవలం ప్రభుత్వ విధిగా కాకుండా ప్రజల జీవితాలను ప్రభావితం చేసే కీలక బాధ్యతగా భావించి అంకితభావంతో పనిచేయాలని మంత్రి సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా రీ-సర్వేను విజయవంతంగా పూర్తి చేసి భూ వివాదాల్లేని తెలంగాణ నిర్మాణానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.

నక్షాలు లేని 373 గ్రామాల్లో కూడా రీ-సర్వే చురుకుగా కొనసాగుతోందని మంత్రి తెలిపారు. ఆయా గ్రామాల్లో సర్వేను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సర్వే ప్రారంభానికి ముందే పట్టాదారులకు తప్పనిసరిగా నోటీసులు జారీ చేయాలని, ప్రభుత్వ భూములకు మార్కింగ్ చేపట్టాలని సూచించారు. గ్రామకంఠం హద్దులను నిర్ధారించిన తర్వాతే సర్వే నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వారి సంతృప్తిని దృష్టిలో ఉంచుకొని సర్వే చేపట్టాలని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి చర్య ప్రజా ప్రయోజనాలకే దోహదపడేలా ఉండాలని అధికారులకు సూచించారు.

Advertisement
Advertisement