త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | పీటీ స్వామి సేవలు చిరస్మరణీయం

Harish Rao | తుదిశ్వాస విడిచే వరకు గులాబీ జెండాను వీడని నిస్వార్థ ఉద్యమకారుడు పీటీ స్వామి అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు కొనియాడారు. తెలంగాణ ఉద్యమానికి, సింగరేణి కార్మికుల హక్కుల కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. పీటీ స్వామి సేవలు చరిత్రలో నిలిచిపోయేలా గోదావరిఖనిలో నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

P

Telangana | Published On Nov 1, 2026, 3.52 pm IST

Harish Rao | పీటీ స్వామి సేవలు చిరస్మరణీయం
Advertisement
  • పీటీ స్వామి సేవలు చిరస్మరణీయం
  • తుదిశ్వాస వరకు గులాబీ జెండాతోనే ఉన్న‌డు
  • గోదావరిఖనిలో నిలువెత్తు కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తాం
  • బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్‌ హరీశ్‌రావు

Harish Rao | తుదిశ్వాస విడిచే వరకు గులాబీ జెండాను వీడని నిస్వార్థ ఉద్యమకారుడు పీటీ స్వామి అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు కొనియాడారు. తెలంగాణ ఉద్యమానికి, సింగరేణి కార్మికుల హక్కుల కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. పీటీ స్వామి సేవలు చరిత్రలో నిలిచిపోయేలా గోదావరిఖనిలో నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పీటీ స్వామి దశదిన కర్మ సందర్భంగా ఆదివారం గోదావరిఖని మార్కండేయ కాలనీలోని ఆర్‌కే గార్డెన్స్‌లో నిర్వహించిన సంస్మరణ సభకు హరీశ్‌రావు హాజరయ్యారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ పీటీ స్వామిని కోల్పోవడం కుటుంబానికే కాకుండా బీఆర్ఎస్ పార్టీకి, సింగరేణి కార్మిక లోకానికి తీరని లోటన్నారు. ఆయన మరణవార్త తెలిసి పార్టీ అధినేత కేసీఆర్ తీవ్ర ఆవేదనకు గురయ్యారని, సంస్మరణ సభకు పార్టీ ప్రతినిధులుగా హాజరుకావాలని తమను ఆదేశించారని తెలిపారు.

టీబీజీకేఎస్ ఏర్పాటులో కీల‌క పాత్ర‌

టీబీజీకేఎస్ ఏర్పాటులో పీటీ స్వామి కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత పార్టీలో చేరిన ఆయన.. 26 ఏళ్ల పాటు కేసీఆర్ వెన్నంటి నడిచారని చెప్పారు. దాదాపు 15 ఏళ్ల పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమించారని పేర్కొన్నారు. ఆరోగ్యం, ఆర్థిక ప్రయోజనాలు, పదవుల గురించి ఆలోచించకుండా తెలంగాణ కోసం పనిచేసిన నిస్వార్థ ఉద్యమకారుడని కొనియాడారు. సింగరేణిలో 7 ఎల్‌ఈపీ గని ప్రమాదంలో 17 మంది కార్మికులు మృతిచెందిన ఘటనలో బాధిత కుటుంబాలకు న్యాయం కోసం పీటీ స్వామి పోరాడారని హరీశ్‌రావు గుర్తుచేశారు. మెరుగైన ఎక్స్‌గ్రేషియా, డిపెండెంట్ ఉద్యోగాలు, మృతుల భార్యలకు పూర్తిస్థాయి వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏడు రోజుల పాటు వరంగల్ జైలులో గడిపారని తెలిపారు. ఓపెన్‌కాస్ట్ గనులకు వ్యతిరేకంగా, కార్మికుల ఉద్యోగాల పరిరక్షణ కోసం సాగిన పోరాటాల్లోనూ ఆయన ముందుండేవారని చెప్పారు. రాజకీయ ఉద్యమాలతోపాటు సామాజిక సేవలోనూ పీటీ స్వామి ఆదర్శంగా నిలిచారని హరీశ్‌రావు అన్నారు. 80 ఏళ్ల వయసులోనూ తన ఉపాధ్యాయ పెన్షన్‌తో వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తూ అనాథలకు, ఆదరణకు నోచుకోని వృద్ధులకు అండగా నిలిచారని తెలిపారు. చివరి క్షణాల వరకు పేదలు, వృద్ధుల సేవలోనే నిమగ్నమయ్యారని పేర్కొన్నారు.

వృద్ధాశ్రమానికి అండగా ఉంటాం

పీటీ స్వామి నడిపిన వృద్ధాశ్రమాన్ని మరింత గొప్పగా కొనసాగించేందుకు కొప్పుల ఈశ్వర్, స్థానిక నాయకత్వంతో కలిసి బీఆర్ఎస్ పార్టీ పూర్తి సహకారం అందిస్తుందని హరీశ్‌రావు హామీ ఇచ్చారు. ఆయన కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. పీటీ స్వామి ఆశయాలను, కార్మికుల కోసం ఆయన చేసిన పోరాటాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, బీఆర్ఎస్ నాయకులు, టీబీజీకేఎస్ ప్రతినిధులు, కార్మికులు, అభిమానులు పాల్గొన్నారు.

ట్యాగ్స్:

Bronze StatueBRS PartyGodavarikhaniHarish RaoKCRKoppula EshwarKorukanti ChanderPT SwamyPT Swamy MemorialSingareni Coal MinesTBGKSTelangana MovementTelugu News
Advertisement
Advertisement