త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG Invest Summit | ఆటోమొబైల్, ఈవీ రంగాల్లో భారీ పెట్టుబడులే లక్ష్యం

TG Invest Summit | తెలంగాణను ఆటోమొబైల్‌, ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ (ఈవీ) రంగాల్లో దేశంలోనే ప్రముఖ పెట్టుబడి కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌-2026 సన్నాహాలను వేగవంతం చేసింది.

P

Telangana | Published On Nov 10, 2026, 3.44 pm IST

TG Invest Summit | ఆటోమొబైల్, ఈవీ రంగాల్లో భారీ పెట్టుబడులే లక్ష్యం
Advertisement
  • ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌-2026పై సర్కారు ఫోకస్‌
  • రేపు మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తొలి భేటీ..
  • 25 మంది ప్రముఖ పారిశ్రామికవేత్తల భాగస్వామ్యం

TG Invest Summit | తెలంగాణను ఆటోమొబైల్‌, ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ (ఈవీ) రంగాల్లో దేశంలోనే ప్రముఖ పెట్టుబడి కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌-2026 సన్నాహాలను వేగవంతం చేసింది. ఆటోమొబైల్‌ అండ్‌ ఈవీ రంగానికి ఏర్పాటు చేసిన ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ తొలి సమావేశం రేపు తెలంగాణ సచివాలయంలో జరగనుంది. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధ్యక్షతన జరిగే ఈ భేటీకి సుమారు 25 మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులు హాజరుకానున్నారు.

హైబ్రిడ్ విధానంలో స‌మావేశం..

పెట్టుబడులు.. విస్తరణపై చర్చ సచివాలయంలోని మంత్రి కాన్ఫరెన్స్‌ హాల్‌లో హైబ్రిడ్‌ విధానంలో (ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌) సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే ప్రముఖ ఆటోమొబైల్‌, ఈవీ కంపెనీలు, పరిశ్రమల నిపుణులు, కీలక భాగస్వాములను సంప్రదించగా పలువురు పాల్గొనేందుకు అంగీకరించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ వారితో నేరుగా చర్చించనున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, కంపెనీల ఆసక్తి, పెట్టుబడి ప్రతిపాదనలు, ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులు, పరిశ్రమల విస్తరణ ప్రణాళికలపై అభిప్రాయాలు సేకరించనున్నారు. వాహనాల తయారీ, ఈవీ ఛార్జింగ్‌ మౌలిక సదుపాయాలు, బ్యాటరీ టెక్నాలజీ, క్లీన్‌ మొబిలిటీ, రవాణా రంగంలో ఆధునిక సాంకేతికత వంటి అంశాలపైనా చర్చించనున్నారు. ఈ రంగాల అభివృద్ధికి అవసరమైన విధానపరమైన మార్పులు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ సహకారంపై పారిశ్రామికవేత్తల సూచనలు తీసుకోనున్నారు.

పారిశ్రామిక సంస్థ‌ల‌ను భాగ‌స్వాముల‌ను చేసేలా..

సమ్మిట్‌.. ఎక్స్‌పోలో భాగస్వామ్యమే లక్ష్యం ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌-2026తోపాటు నిర్వహించనున్న ఇన్వెస్ట్‌మెంట్‌ ఎక్స్‌పోలో ప్రముఖ కంపెనీలు, పారిశ్రామిక సంస్థలను భాగస్వాములను చేయడం ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం. గ్లోబల్‌ సమ్మిట్‌లో ఆటోమొబైల్‌, ఈవీ రంగాలపై నిర్వహించే ప్రత్యేక సెషన్‌లో చర్చించాల్సిన అంశాలను గుర్తించనున్నారు. పరిశ్రమలు, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని పెంచి కొత్త పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణం కల్పించేలా కార్యాచరణ రూపొందించనున్నారు. ప్రముఖ సంస్థల ప్రతినిధుల హాజరు ఈ సమావేశంలో ఏవీఎల్‌ ఇండియా సీఈఓ నవీద్‌ నారాయణ, బాష్‌ గ్లోబల్‌ సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ సెంటర్‌ హెడ్‌ అమ్జద్‌ ఖాన్‌ పఠాన్‌, జెడ్‌ఎఫ్‌ టెక్‌ సెంటర్‌ ఇండియా ప్రెసిడెంట్‌ కృష్ణస్వామి జంబునాథన్‌, టాఫే గ్రూప్‌ కార్పొరేట్‌ అఫైర్స్‌ హెడ్‌ రాజీవ్‌ నాగ్‌, ఏథర్‌ ఫౌండర్‌ అండ్‌ సీఈఓ తరుణ్‌ మెహతా, జియో బీపీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ రూబిన్‌ పాథర్‌, సిగ్ని ఎనర్జీ సీఈఓ వెంకట్‌ రాజారామన్‌ పాల్గొననున్నారు.

ఒక్కొక్క‌రికి ఒక్కో బాధ్య‌త‌

అలాగే అస్సాగో ఇండస్ట్రీస్‌ ఎండీ ఆశిష్‌ గుర్నాని, స్టేట్‌ ఆఫ్‌ బవేరియా (ఇండియా ఆఫీస్‌) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ జాన్‌ కొట్టాయిల్‌, యూఎస్‌-ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ డైరెక్టర్‌ ప్రదీప్‌ కరుటూరి, ఈవీఆఈ ఫౌండర్‌ కృష్ణ కే జాస్తి, టెరి సీనియర్‌ ఫెలో షరీఫ్‌ ఖమర్‌, డబ్ల్యూఆర్ఐ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పవన్‌ ములుకుట్ల, ఈవీ రిపోర్టర్‌ కో-ఫౌండర్‌ ప్రియాక్షి గుప్తా, రిసోర్సెస్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ డైరెక్టర్‌ నితీశ్ అరోరా, ఏఎస్సీఐ సెంటర్‌ ఫర్‌ ఎనర్జీ స్టడీస్‌ డైరెక్టర్‌ రాజ్‌కిరణ్‌ బిలోలికర్‌, ఐటీఎస్‌ ఇండియా ప్రెసిడెంట్‌ అఖిలేష్‌ శ్రీవాస్తవ, ఆటోమోటివ్‌ టెస్ట్‌ సిస్టమ్స్‌ ఎండీ రామనాథన్‌ హాజరుకానున్నారు. వీరితోపాటు గరపాటి ఆటో వెంచర్స్‌ ఎండీ కేవీఎస్‌ ప్రకాశ్‌ రావు, వైబ్రంట్‌ మొబిలిటీ గ్రూప్‌ డైరెక్టర్‌ సిరాజుద్దీన్‌ బాబుఖాన్‌, ఈవీ జిప్‌ మొబిలిటీ సీఈఓ శ్రీధర్‌ శివాలెంక, అసోచామ్‌ రీజినల్‌ డైరెక్టర్‌ దినేష్‌ మచ్చా, హాలా మొబిలిటీ ఇండియా ఫౌండర్‌ అండ్‌ సీఈఓ శ్రీకాంత్‌ రెడ్డి కల్కొండ తదితరులు పాల్గొననున్నారు.

పెట్టుబ‌డుల‌కు కీల‌క కేంద్రంగా..

సమన్వయ బాధ్యతలు ఔజాద్‌ షేక్‌కు ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సమావేశానికి కన్వీనర్‌గా పరిశ్రమలు, వాణిజ్య శాఖ లాజిస్టిక్స్‌, సప్లై చైన్‌, ఆటోమొబైల్‌ అండ్‌ ఈవీ విభాగం డైరెక్టర్‌ ఔజాద్‌ షేక్‌ను నియమించారు. సమావేశ ఏర్పాట్లతోపాటు పారిశ్రామిక సంస్థలు, ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయ బాధ్యతలను ఆయన పర్యవేక్షిస్తున్నారు. గ్లోబల్‌ సమ్మిట్‌కు ముందస్తు సన్నాహాల్లో భాగంగా జరుగుతున్న ఈ తొలి సమావేశం ద్వారా ఆటోమొబైల్‌, ఈవీ రంగాల్లో పెట్టుబడి అవకాశాలను గుర్తించి, ప్రముఖ సంస్థలతో ప్రభుత్వ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయనున్నారు. తద్వారా ప్రపంచస్థాయి పెట్టుబడులు, ఆధునిక సాంకేతికత, పరిశ్రమల విస్తరణకు తెలంగాణను కీలక కేంద్రంగా నిలబెట్టేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేయనుంది.

Advertisement
Advertisement