త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Khelo India Youth Games 2026 | దేశం గర్వించేలా ఖేలో ఇండియా గేమ్స్

Khelo India Youth Games 2026 | ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌–2026ను దేశం గర్వించేలా, తెలంగాణ ప్రతిష్టను జాతీయ స్థాయిలో చాటిచెప్పేలా నిర్వహించాలని రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదల, కృషి వల్లే తెలంగాణకు ఈ ప్రతిష్టాత్మక క్రీడా పోటీల నిర్వహణ అవకాశం దక్కిందని పేర్కొన్నారు.

P

Telangana | Published On Nov 10, 2026, 3.59 pm IST

Khelo India Youth Games 2026 | దేశం గర్వించేలా ఖేలో ఇండియా గేమ్స్
Advertisement
  • సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలతోనే తెలంగాణకు ఆతిథ్యం..
  • రూ.203 కోట్లతో క్రీడ‌ల కోసం ఏర్పాట్లు
  • రూ.120 కోట్లతో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి
  • అధికారులకు మంత్రి వాకిటి శ్రీహరి దిశానిర్దేశం

Khelo India Youth Games 2026 | ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌–2026ను దేశం గర్వించేలా, తెలంగాణ ప్రతిష్టను జాతీయ స్థాయిలో చాటిచెప్పేలా నిర్వహించాలని రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదల, కృషి వల్లే తెలంగాణకు ఈ ప్రతిష్టాత్మక క్రీడా పోటీల నిర్వహణ అవకాశం దక్కిందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విజయవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రతి అధికారిపై ఉందన్నారు. బేగంపేటలోని టూరిస్ట్ ప్లాజాలో ఖేలో ఇండియా గేమ్స్‌ నిర్వహణపై వివిధ జిల్లాల డిప్యూటీ కలెక్టర్లు, క్రీడా శాఖ అధికారులతో మంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, ప్రభుత్వ స్పెషల్ సీఎస్ వాణీ ప్రసాద్, స్పోర్ట్స్ అథారిటీ వీసీ అండ్ ఎండీ సోనిబాలాదేవి తదితరులు పాల్గొన్నారు.

తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలు

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఖేలో ఇండియా నిర్వహణ బాధ్యతలు తెలంగాణకు దక్కడం రాష్ట్రానికి గౌరవమని మంత్రి పేర్కొన్నారు. గతంలో శ్రీనగర్‌లో కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయాను కలిసి ఈ పోటీల నిర్వహణ బాధ్యతలను తెలంగాణకు ఇవ్వాలని కోరిన విషయాన్ని గుర్తుచేశారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన పట్టుదలతో కూడిన ప్రయత్నాల ఫలితంగానే అవకాశం వచ్చిందన్నారు. నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావివ్వొద్దని, అనవసర ఖర్చులు చేయకుండా తక్కువ వ్యయంతో ఎక్కువ ఫలితాలు సాధించాలని సూచించారు. క్రీడా మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేయాలన్నారు. ఇందుకోసం డిప్యూటీ కలెక్టర్లకు ప్రభుత్వం పూర్తి అధికారాలు కల్పిస్తోందని తెలిపారు. ప్రతి అధికారి బాధ్యతగా పనిచేస్తూ పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.

యువతను బెట్టింగ్‌ నుంచి దూరం చేయాలి

యువత రీల్స్‌, సోషల్ మీడియా మోజులో పడకుండా క్రీడల వైపు మళ్లించాలని మంత్రి పిలుపునిచ్చారు. బెట్టింగ్ మహమ్మారి నుంచి యువతను బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. మణిపూర్‌లో గ్రామీణ స్థాయిలో ఉన్న క్రీడా సంస్కృతిని ఆదర్శంగా తీసుకుని తెలంగాణలోనూ ప్రతి గ్రామంలో క్రీడా వాతావరణాన్ని పెంపొందించాలని సూచించారు. గ్రామీణ ప్రతిభను గుర్తించి తగిన శిక్షణ, ప్రోత్సాహం కల్పించాలన్నారు.

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు: శివసేన రెడ్డి

ఖేలో ఇండియా నిర్వహణను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి తెలిపారు. ప్రతి డిప్యూటీ కలెక్టర్ ఈ బాధ్యతను సవాల్‌గా స్వీకరించి సమన్వయంతో పనిచేయాలన్నారు. స్టేడియాల అభివృద్ధి పనుల్లో నాణ్యత, వేగం ఉండాలని, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పనుల్లో అలసత్వం ప్రదర్శించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

రూ.203 కోట్లతో ఏర్పాట్లు: వాణీ ప్రసాద్

ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌–2026 నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రూ.203 కోట్లతో ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వ స్పెషల్ సీఎస్ వాణీ ప్రసాద్ వెల్లడించారు. ఇందులో రూ.120 కోట్లను క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేటాయించినట్లు తెలిపారు. క్రీడాకారులు, కోచ్‌లు, అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పనుల అమలుకు స్పష్టమైన కార్యాచరణ రూపొందించి, తాగునీరు సహా ప్రాథమిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.

11 స్టేడియాలు సిద్ధం.. మరో 5 చోట్ల పనులు

ఖేలో ఇండియా నిర్వహణ కోసం ఇప్పటికే 11 స్టేడియాలను సిద్ధం చేశామని, మరో ఐదు స్టేడియాల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని స్పోర్ట్స్ అథారిటీ వీసీ అండ్ ఎండీ సోనిబాలాదేవి తెలిపారు. పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఐఎంఎస్ (IMS) పోర్టల్ ఏర్పాటు చేశామన్నారు. ప్రతి పనికి సంబంధించిన వివరాలు, పురోగతిని ఎప్పటికప్పుడు పోర్టల్‌లో అప్‌డేట్ చేయాలని డిప్యూటీ కలెక్టర్లకు సూచించారు. అన్ని ఏర్పాట్లను నిర్ణీత సమయంలో పూర్తి చేసి ఖేలో ఇండియా గేమ్స్‌ను విజయవంతం చేయాలని కోరారు.

Advertisement
Advertisement