త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponguleti | ఫాస్ట్‌ట్రాక్‌ విధానంలో 22ఏ నిషేధిత జాబితా నుంచి తొల‌గిస్తున్నం : మంత్రి పొంగులేటి

Ponguleti | 22ఏ నిషేధిత జాబితాలో భూములు, ఆస్తులను పరిశీలించి వేగంగా క్లియర్‌ చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. 22ఏ అంశంపై ప్రతిపక్షాలు వాస్తవాలకు వక్రీకరణలు జోడించి ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. గత నాలుగు వారాలుగా ఈ అంశంపై నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు.

P

Telangana | Published On Aug 24, 2026, 6.43 pm IST

Ponguleti | ఫాస్ట్‌ట్రాక్‌ విధానంలో 22ఏ నిషేధిత జాబితా నుంచి తొల‌గిస్తున్నం : మంత్రి పొంగులేటి
Advertisement

Ponguleti | 22ఏ నిషేధిత జాబితాలో భూములు, ఆస్తులను పరిశీలించి వేగంగా క్లియర్‌ చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. 22ఏ అంశంపై ప్రతిపక్షాలు వాస్తవాలకు వక్రీకరణలు జోడించి ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. గత నాలుగు వారాలుగా ఈ అంశంపై నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు. సోమవారం సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఆయా రికార్డులను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచామని చెప్పారు. ఇప్పటికే స్లాట్‌ బుక్‌ చేసుకున్న వాటిలో దాదాపు 98 శాతం వరకు రిజిస్ట్రేషన్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. దేవాదాయ, భూదాన్‌, వక్ఫ్‌ భూముల విషయంలో మాత్రం నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్లు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ముఖ్యంగా మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల్లో ఇలాంటి భూములు ఉన్నాయని చెప్పారు. వివిధ కారణాలతో రిజిస్ట్రేషన్‌ పూర్తి కాని దరఖాస్తుదారులకు చెల్లించిన మొత్తాన్ని వారంలోగా తిరిగి ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు.

22ఏపై 1,162 కాల్స్‌

22ఏ సమస్యలపై ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్‌కు ఈ నెల 18 నుంచి 22 వరకు మొత్తం 1,162 కాల్స్‌ వచ్చాయని మంత్రి తెలిపారు. ఇందులో వ్యవసాయ భూములకు సంబంధించి 612, వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించి 542 కాల్స్‌ ఉన్నాయని చెప్పారు. పునరావృతమైన కాల్స్‌ను తొలగించిన తర్వాత 980 ఫిర్యాదులు మిగిలాయని, వాటిలో వ్యవసాయానికి సంబంధించినవి 547, వ్యవసాయేతరమైనవి 433 ఉన్నాయని వివరించారు. రంగారెడ్డి నుంచి 258, మేడ్చల్‌-మల్కాజిగిరి నుంచి 249, సంగారెడ్డి నుంచి 82, కామారెడ్డి నుంచి 41 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. వీటిని సంబంధిత జిల్లా కలెక్టర్లకు పంపించి పరిష్కరించాలని ఆదేశించినట్లు చెప్పారు. అర్హత ఉన్న ఆస్తులను పీఓబీ (నిషేధిత జాబితా) నుంచి ఫాస్ట్‌ట్రాక్‌ విధానంలో తొలగిస్తున్నామని పేర్కొన్నారు. సీఎస్‌-7, సీఎస్‌-14 భూముల విషయంలో న్యాయస్థానాల ఆదేశాలకు అనుగుణంగానే ప్రభుత్వం వ్యవహరిస్తుందని పొంగులేటి స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తుది తీర్పునకు లోబడి రిజిస్ట్రేషన్లు చేపడుతున్నామని తెలిపారు.

ప‌త్రికాధిప‌తికి బెంజ్‌పై ప్ర‌శ్న‌లు

ఈ సందర్భంగా గతంలో ఐదు డాక్యుమెంట్ల ఆధారంగా 806 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్‌ చేసిన అంశాన్ని మంత్రి ప్రస్తావించారు. ఆ వ్యవహారంపై అప్పట్లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైందని చెప్పారు. ఆ భూముల రిజిస్ట్రేషన్లపై విచారణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సంబంధిత వ్యవహారంలో ఓ పత్రికాధినేతకు బెంజ్‌ కారు బహుమతిగా రావడంపైనా మంత్రి ప్రశ్నలు సంధించారు. ఐదు డాక్యుమెంట్ల ద్వారా జరిగిన 806 ఎకరాల రిజిస్ట్రేషన్లపై విచారణ జరిపితే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లా నాదర్‌గుల్‌లోని 773, 775, 776, 786 సర్వే నంబర్లలో కొంత భూమికి యూఎల్‌సీ క్లియరెన్స్‌ పూర్తి కాలేదని మంత్రి తెలిపారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలోని 68/1, 70/1, 71 సర్వే నంబర్లలోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. ఇలాంటి భూములను నిషేధిత జాబితాలో నమోదు చేశామని చెప్పారు. యూఎల్‌సీ భూములకు సంబంధించి త్వరలో ప్రత్యేక విధానం తీసుకొచ్చి తదుపరి చర్యలను నిర్ణయిస్తామని వెల్లడించారు. ముఖ్యమంత్రి ప్లాట్‌ కూడా 22ఏ జాబితాలో ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి ఖండించారు. సర్వే నంబర్‌ 403లోని 1,288 ఎకరాలను తొలుత పీఓబీలో చేర్చారని, అందులో రెండు ప్లాట్లు మాత్రమే రెగ్యులరైజ్‌ కాలేదని తెలిపారు. ప్రస్తుతం ఆ అంశాన్ని సవరించినట్లు చెప్పారు.

నకిలీ పత్రాలతో వస్తే కేసులు

22ఏ జాబితా నుంచి భూములను తొలగించాలంటూ కొందరు నకిలీ పత్రాలను అధికారులకు సమర్పిస్తున్నారని పొంగులేటి ఆరోపించారు. మేడ్చల్‌ కలెక్టర్‌ 2026 జూన్‌ 22న జారీ చేసినట్లు, యూఎల్‌సీకి సంబంధించినవి అంటూ జూన్‌ 2న జారీ చేసినట్లు చూపిన కొన్ని పత్రాలను అధికారులు పరిశీలించగా అవి నకిలీవిగా తేలినట్లు చెప్పారు. వాటిని సమర్పించిన వారిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వ భూములను నకిలీ పత్రాల ఆధారంగా ప్రైవేటు వ్యక్తులు స్వాధీనం చేసుకునే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని మంత్రి హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారంలోని 172, 173 సర్వే నంబర్లను మంత్రి ప్రస్తావించారు. 172 సర్వే నంబర్‌ ప్రభుత్వ భూమి కాగా, 173 ప్రైవేటు భూమి అని చెప్పారు. 173లో అనుమతులు తీసుకుని 172లో నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించామని తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో సంబంధిత భూములను 22ఏ జాబితాలో నమోదు చేశామని చెప్పారు. రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో ఇలాంటి ఉదంతాలు అనేకం ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.

పేద‌ల ఆస్తుల‌ను చేర్చాల‌న్న ఆలోచ‌న లేదు..

2023 డిసెంబరు 7న పీఓబీలో ఉన్న భూమి విస్తీర్ణంలో ఎలాంటి పెరుగుదల లేదని స్పష్టం చేశారు. లక్షల ఎకరాలను కొత్తగా నిషేధిత జాబితాలో చేర్చారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. పేదల ఆస్తులను 22ఏలో చేర్చాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదని తెలిపారు. కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో ఇప్పటికే 22ఏ సమస్యపై సమీక్ష నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. భూముల సర్వేను వేగవంతం చేయడానికి అవసరమైన చర్యలపై అధికారులతో చర్చించామని చెప్పారు. సాదాబైనామా తదితర భూ సమస్యలకు సమగ్ర సర్వే ద్వారా పరిష్కారం లభించే అవకాశం ఉందన్నారు. భూముల వివరాలను భవిష్యత్తులో మరింత స్పష్టంగా గుర్తించేందుకు జియో కోఆర్డినేట్ల ఆధారంగా మ్యాప్‌లు రూపొందించే ప్రక్రియ చేపడుతున్నామని తెలిపారు. ప్రతి భూమి పార్శిల్‌కు ప్రత్యేక భూదార్‌ యూనిక్‌ నంబర్‌ కేటాయించే ప్రక్రియ ప్రారంభమైందని వెల్లడించారు.

Advertisement
Advertisement