త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | సహకార ఎన్నికలు నిర్వహించేలా ప్ర‌భుత్వంపై ఒత్తిడి తెండి.. కేటీఆర్‌కు సంఘాల అధ్య‌క్షుల రిక్వెస్ట్‌

KTR | రాష్ట్రంలోని సహకార సంఘాలు, సహకార బ్యాంకులకు వెంటనే ఎన్నికలు నిర్వహించేలా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షులు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను కోరారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన సంఘాల అధ్యక్షులు తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిసి సహకార రంగం ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.

P

Telangana | Published On Oct 16, 2026, 8.16 pm IST

KTR | సహకార ఎన్నికలు నిర్వహించేలా ప్ర‌భుత్వంపై ఒత్తిడి తెండి.. కేటీఆర్‌కు సంఘాల అధ్య‌క్షుల రిక్వెస్ట్‌
Advertisement

KTR | రాష్ట్రంలోని సహకార సంఘాలు, సహకార బ్యాంకులకు వెంటనే ఎన్నికలు నిర్వహించేలా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షులు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను కోరారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన సంఘాల అధ్యక్షులు తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిసి సహకార రంగం ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. వారి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కేటీఆర్‌.. సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో సహకార బ్యాంకుల మొత్తం వ్యాపారం సుమారు రూ.13 వేల కోట్లుగా ఉండగా, కేసీఆర్‌ నేతృత్వంలోని పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రూ.60 వేల కోట్లకు చేరిందని అధ్యక్షులు తెలిపారు. రైతులకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో అప్పటి ప్రభుత్వం సహకార సంఘాలు, బ్యాంకులను బలోపేతం చేసిందని పేర్కొన్నారు. ఎన్నికల ద్వారా పాలకవర్గాలను ఏర్పాటు చేసి, సంఘాలకు స్వయం ప్రతిపత్తి కల్పించడంతో రైతులకు చేరువగా సేవలు అందించగలిగామని వివరించారు.

అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్‌ పాలకవర్గాలతో వ్యవస్థను నడిపిస్తుండటంతో సహకార రంగం బలహీనపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల సహకార సంఘాల పదవులను రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు తీసుకుని కేటాయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. ఈ వ్యవహారాలపై విచారణ జరిపి పారదర్శకత తీసుకురావాలని కోరారు. మేనేజ్‌మెంట్‌ కమిటీలు లేకపోవడంతో సహకార బ్యాంకులు రైతులకు పంట రుణాలు అందించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అధ్యక్షులు తెలిపారు. ప్రస్తుత పంట సీజన్‌లో సహకార బ్యాంకుల ద్వారా రుణాల పంపిణీ కష్టంగా మారిందని పేర్కొన్నారు. బ్యాంకుల సీఈఓలకు పరిమిత అధికారాలే ఉండటంతో రూ.10 లక్షలకు మించిన రుణాల మంజూరుకు అవసరమైన నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతోందన్నారు. దీంతో జిల్లా సహకార బ్యాంకుల కార్యకలాపాలు, వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణాల పంపిణీపై ప్రభావం పడుతోందని వివరించారు.

ఉన్నత విద్య కోసం ఐఐటీలు, ఐఐఎంలలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు సైతం రుణాలు అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. సహకార బ్యాంకుల ద్వారా రైతులకు పంట రుణాలు, విద్యార్థులకు విద్యా రుణాలు సహా అవసరమైన సేవలు సక్రమంగా అందాలంటే ఎన్నికైన పాలకవర్గాలు ఉండాలని స్పష్టం చేశారు. గతంలో ఎన్నికైన పాలకవర్గాల స్థానంలో నామినేటెడ్‌ వ్యవస్థను కొనసాగించడం వల్ల సహకార సంఘాల స్వయం ప్రతిపత్తి దెబ్బతింటోందని అధ్యక్షులు పేర్కొన్నారు. పాలకవర్గాల పునరుద్ధరణకు సంబంధించిన అంశం హైకోర్టులో పెండింగ్‌లో ఉందని, న్యాయపరమైన ప్రక్రియలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపట్టేలా ఒత్తిడి తీసుకురావాలని కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. సహకార సంఘాలు, బ్యాంకులు తిరిగి బలోపేతం కావాలంటే ఎన్నికల నిర్వహణ అత్యవసరమని తెలిపారు. ఈ విజ్ఞప్తిపై స్పందించిన కేటీఆర్‌.. సహకార రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన చర్యలకు తమ వంతు సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.

Advertisement
Advertisement