త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Garuda Seva | వాన‌జ‌ల్లుల మ‌ధ్య వైభవంగా శ్రీవారి గరుడసేవ!

Garuda Seva | తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు గరుడ వాహనసేవ శుక్రవారం రాత్రి వైభవంగా జరిగింది. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై లక్ష్మీకాసుల మాలధారిగా శ్రీ మలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. చిరుజల్లులు కురుస్తున్నా భక్తుల గోవింద నామస్మరణతో తిరుమల గిరులు మార్మోగాయి.

P

Devotional | Published On Oct 16, 2026, 9.17 pm IST

Garuda Seva | వాన‌జ‌ల్లుల మ‌ధ్య వైభవంగా శ్రీవారి గరుడసేవ!
Advertisement

Garuda Seva | తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు గరుడ వాహనసేవ శుక్రవారం రాత్రి వైభవంగా జరిగింది. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై లక్ష్మీకాసుల మాలధారిగా శ్రీ మలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. చిరుజల్లులు కురుస్తున్నా భక్తుల గోవింద నామస్మరణతో తిరుమల గిరులు మార్మోగాయి. రాత్రి 6.30 గంటలకు ప్రారంభమైన వాహనసేవలో స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయమిచ్చారు. గజరాజుల గంభీర నడకలు, మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోషల నడుమ గరుడసేవ కనులపండువగా సాగింది.

భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం నుంచే వర్షం కురుస్తున్నా భక్తుల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. చిరుజల్లులను సైతం లెక్కచేయకుండా వేలాది మంది గంటల తరబడి వేచి ఉండి స్వామివారి దర్శనం చేసుకున్నారు. గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు టీటీడీ అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు, బాదంపాలు, అల్పాహారం, బిస్కెట్‌ ప్యాకెట్లు అందించింది. వర్షంలోనూ అవసరమైన సదుపాయాలు కల్పించడంపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.

వైష్ణవ సంప్రదాయంలో గరుడ వాహనసేవకు విశిష్ట ప్రాధాన్యం ఉంది. పరమ భక్తుడైన గరుడాళ్వారిపై స్వామివారు విహరించడం భక్తి, శరణాగతికి ప్రతీకగా భావిస్తారు. గరుడ వాహనంపై కొలువుదీరిన శ్రీవారిని దర్శించుకోవడం తమ జన్మ ధన్యమైనట్లుగా భక్తులు భావించారు. గరుడసేవలో తిరుమల పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్‌ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు, జేఈవోలు డాక్టర్‌ ఎ శరత్‌, ప్రభల గోపీనాథ్‌, సీవీఎస్వో మురళీకృష్ణ, జిల్లా ఎస్పీ ఎల్‌ సుబ్బరాయుడు తదితర అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement