త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Erravelli | ఎర్రవెల్లి సర్వే నంబర్‌లో కలిపారు.. పొంగులేటిని క‌లిసిన వెంకటాపూర్‌ రైతులు

Erravelli | తమ తాతముత్తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములను ధరణి రికార్డుల్లో ఎర్రవెల్లి గ్రామంలోని సర్వే నంబర్‌ 325లో కలిపేశారని మార్కూక్‌ మండలం శివారు వెంకటాపూర్‌ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూములను సర్వే చేసి.. హక్కులు కల్పించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కోరారు.

P

Telangana | Published On Sep 29, 2026, 9.15 pm IST

Erravelli | ఎర్రవెల్లి సర్వే నంబర్‌లో కలిపారు.. పొంగులేటిని క‌లిసిన వెంకటాపూర్‌ రైతులు
Advertisement

Erravelli | తమ తాతముత్తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములను ధరణి రికార్డుల్లో ఎర్రవెల్లి గ్రామంలోని సర్వే నంబర్‌ 325లో కలిపేశారని మార్కూక్‌ మండలం శివారు వెంకటాపూర్‌ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూములను సర్వే చేసి.. హక్కులు కల్పించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కోరారు. సోమవారం సచివాలయంలో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. శివారు వెంకటాపూర్‌లోని సర్వే నంబర్లు 38, 41, 47, 85, 88, 100లో సుమారు 134 ఎకరాల భూములను తరతరాలుగా సాగు చేసుకుంటున్నామని రైతులు తెలిపారు. ధరణి పోర్టల్‌ అమల్లోకి వచ్చిన తర్వాత రికార్డుల్లో మార్పులు చేసి తమ భూములపై హక్కులు లేకుండా చేశారని ఆరోపించారు. ధరణికి ముందు ఉన్న పాస్‌బుక్కులు, గ్రామ నక్షా పఠాలను కూడా మంత్రికి చూపించారు.

పాత పాస్‌బుక్కులు తీసుకున్నారు..

కొత్త పాస్‌బుక్కులు ఇస్తామని చెప్పి అప్పటి అధికారులు తమ వద్ద ఉన్న పాత పాస్‌బుక్కులను తీసుకున్నారని.. ఆ తర్వాత కొత్త పాస్‌బుక్కులు ఇవ్వలేదని రైతులు వాపోయారు. ఓవర్‌ మ్యాపింగ్‌ పేరుతో శివారు వెంకటాపూర్‌ వ్యవసాయ భూములను ఎర్రవెల్లి గ్రామంలోని సర్వే నంబర్‌ 325లో కలిపి నక్షా రూపొందించారని తెలిపారు. ఎర్రవెల్లి సర్వే నంబర్‌ 325లో ప్రభుత్వం చేపడుతున్న సర్వే తరహాలోనే శివారు వెంకటాపూర్‌లోనూ సమగ్ర సర్వే నిర్వహించాలని కోరారు. గ్రామ సరిహద్దులను గుర్తించి.. పాత పాస్‌బుక్కులు, గ్రామ నక్షా, రెవెన్యూ రికార్డులు, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించి ఎవరి భూమి వారికి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

పరిహారం అందలేదని ఫిర్యాదు

రిజర్వాయర్‌ నిర్మాణంలో భూములు కోల్పోయినప్పటికీ ఇప్పటివరకు పరిహారం అందలేదని రైతులు మంత్రికి తెలిపారు. దేవాసుకుంట, ముత్తిలింగం కుంటలను సైతం పాండురంగా రిజర్వాయర్‌లో విలీనం చేశారని వివరించారు. రిజర్వాయర్‌ నిర్మాణం, భూముల మ్యాపింగ్‌, రికార్డుల మార్పులతో తమ గ్రామ రైతులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను విన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. సమగ్ర విచారణకు హామీ ఇచ్చారు. రికార్డులు, గ్రామ నక్షా, క్షేత్రస్థాయి సర్వే ఆధారంగా వాస్తవాలను నిర్ధారించాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన ఏ ఒక్కరికీ అన్యాయం జరగనివ్వబోమని, ఎవరి భూమి వారికి దక్కేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సమావేశంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్‌ లోకేశ్‌ కుమార్‌, సర్వే అండ్‌ ల్యాండ్‌ సెటిల్‌మెంట్స్‌ కమిషనర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు పాల్గొన్నారు.

Advertisement
Advertisement